రిటైల్ ప్లస్ ఎఫ్ఎంసీజీ కొలువుల నెలవులు.. 2.76 లక్షల జాబ్స్

By rajesh yFirst Published Jun 21, 2019, 11:54 AM IST
Highlights

ఈ ఏడాది ప్రథమార్ధంలో 2.76 లక్షల కొత్త కొలువులు రావచ్చని టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ అంచనా వేసింది. ఎఫ్‌ఎంసీజీ, రిటైల్‌ రంగాల్లో అత్యధిక ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొంది. 

ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలోని తొలి ఆరు నెలల్లో రిటైల్, ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జూమర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎంసీజీ) రంగాల్లో అత్యధికంగా 2.76 లక్షల ఉద్యోగాల కల్పన జరగనున్నది. విదేశీ రిటైల్‌ దిగ్గజాలు ఆయా రంగాల్లోకి భారీగా విస్తరించడమే దీనికి కారణమని ఏప్రిల్‌–సెప్టెంబర్‌ మధ్య ఉద్యోగాల అంచనాల నివేదికలో టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ సంస్థ తెలిపింది. 

దీంతో రిటైల్‌ రంగంలో నికరంగా ఉద్యోగావకాశాలు రెండుశాతం  శాతం పెరిగి అదనంగా 1.66 లక్షల ఉద్యోగాలు యువతకు అందుబాటులోకి రానున్నాయి. ఇక ఎఫ్‌ఎంసీజీలో ఒక శాతం వృద్ధితో 1.10 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయి. 

27,560 ఉద్యోగాలతో ఢిల్లీ రిటైల్‌ రంగం అగ్రస్థానంలో, 22,770 కొత్త కొలువులతో బెంగళూరు ఆ తర్వాత స్థానంలో ఉంటాయి. విదేశీ రిటైల్‌ దిగ్గజాల రాకతో పాటు రిటైల్‌ రంగం భారీగా వృద్ధి చెందడం, కార్యకలాపాల విస్తరణ, కంపెనీల కొనుగోళ్లు తదితర అంశాలు ఉపాధి కల్పనకు ఊతంగా నిలుస్తున్నాయని టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ పేర్కొంది.

ఇక ఎఫ్‌ఎంసీజీ విభాగంలో ముంబైలో14,770 కొత్త ఉద్యోగాలు, ఢిల్లీలో 10,880 ఉద్యోగాలు లభిస్తాయి. ఫుడ్‌ పార్కుల ఏర్పాటు, సామర్థ్యాల పెంపు, ప్రస్తుత కంపెనీలు.. ఇతర సంస్థలను కొనుగోళ్లు చేయడం, క్యాష్‌ అండ్‌ క్యారీ విభాగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలు సడలించడం వంటి అంశాలతో ఉద్యోగ నియామకాలు పెరుగుతాయని తెలుస్తోంది.

సింగిల్, మల్టీ బ్రాండ్‌ రిటైల్‌లో ఆటోమేటిక్‌ రూట్‌లో పెట్టుబడులకు అనుమతించడం వంటి అంశాలు ఈ ఉపాధి కల్పనకు ఊతంగా ఉండగలవని టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ డిజిటల్, ఐటీ విభాగం హెడ్‌ మయూర్‌ సారస్వత్‌ తెలిపారు. 

మొత్తం మీద చూస్తే రిటైల్‌ రంగంలో 15.11 శాతం, ఎఫ్‌ఎంసీజీ సెక్టార్‌లో 10.31% ఉద్యోగాల వృద్ధి జరుగుతుందని టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ డిజిటల్, ఐటీ విభాగం హెడ్‌ మయూర్‌ సారస్వత్‌ పేర్కొన్నారు. అనుభవజ్ఞులకు మాత్రమే కాక ఫ్రెషర్లకూ బాగానే అవకాశాలు లభించగలవన్నారు. 

కేవలం రిటైల్‌లోనే 33,310 తాజా గ్రాడ్యుయేట్స్‌కు కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభించగలవని టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ డిజిటల్, ఐటీ విభాగం హెడ్‌ మయూర్‌ సారస్వత్‌ పేర్కొన్నారు. టీమ్ లీజ్ నివేదిక ప్రకారం 2018–19 అక్టోబర్‌–మార్చి వ్యవధితో పోలిస్తే 2018–19 ఏప్రిల్‌–సెప్టెంబర్‌ మధ్య రిటైల్, ఎఫ్‌ఎంసీజీ రంగాల్లో ఉద్యోగుల వలసలు భారీగా నమోదయ్యాయి. రిటైల్‌లో 19.82 శాతంగాను, ఎఫ్‌ఎంసీజీలో 16.03 శాతంగాను ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
 

click me!