అనీజీనెస్: రిలయన్స్ ఎం క్యాప్ రూ.21,456 కోట్లు ఆవిరి

By rajesh yFirst Published Feb 18, 2019, 11:44 AM IST
Highlights


అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు ప్రత్యేకించి అమెరికాలో నెలకొన్న పరిస్థితులు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. ఐటీసీ మినహా తొమ్మిది అగ్రశ్రేణి సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ హరించుకుపోయింది. మార్కెట్ లీడర్ రిలయన్స్ రూ.21,456.38 కోట్ల మేరకు మార్కెట్ క్యాపిటలైజేషన్‍ను కోల్పోయింది.

న్యూఢిల్లీ: అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు.. ముగింపు దశకు చేరుకున్న త్రైమాసిక ఫలితాల సీజన్‌, అమెరికాలో తగ్గుముఖం పట్టిన రిటైల్‌ అమ్మకాలతో దేశీయ రుణం, నగదు లభ్యతపై నెలకొన్న సందేహాల మధ్య గత వారం స్టాక్‌మార్కెట్లు ఆద్యంతం నష్టాలను చవిచూశాయి.

వారం మొత్తంలో సూచీలకు ఒక్క లాభం కూడా దక్కలేదు. అటు దిగ్గజ కంపెనీలు కూడా గత వారం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. మార్కెట్‌ విలువ పరంగా దేశంలోనే అత్యంత విలువైన పది కంపెనీల్లో తొమ్మిది కంపెనీలు రూ. 98వేల కోట్లకు పైగా సంపదను కోల్పోయాయి. 

మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు. ఫలితంగా మార్కెట్ లీడర్‌గా వ్యవహరిస్తున్న దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా పేరొందిన రిలయన్స్‌ గత వారం రూ. 21,456.38 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ నష్ట పోయింది. రిలయన్స్ మార్కెట్‌ విలువ రూ. 7,88,213.12కోట్లకు పడిపోయింది.

పది అగ్రశ్రేణి కంపెనీల్లో ఒక్క ఐటీసీ మినహా అన్ని సంస్థలు నష్టాలను చవిచూశాయి. వీటి నష్టం విలువ రూ. 98,862.63కోట్లుగా ఉంది. ఇక స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మార్కెట్‌ విలువ రూ. 19,723.34కోట్లు తగ్గి రూ. 2,34,672.03కోట్లకు పడిపోయింది.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌) రూ. 11,951.35 కోట్ల సంపదను కోల్పోయింది. హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్‌ విలువ రూ. 11,725.23 కోట్లు తగ్గి రూ. 3,22,531.39 కోట్లుగా ఉంది. హిందుస్థాన్‌ యూనీలివర్‌ లిమిటెడ్ ‌(హెచ్‌యూఎల్‌) రూ. 9,600.22 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ. 8,293.27కోట్లు, ఇన్ఫోసిస్‌ రూ. 7,906.92కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రూ. 5,998.66 కోట్లు, కొటక్‌ మహింద్రా బ్యాంక్‌ రూ. 2,207.26 కోట్ల మేర నష్టపోయాయి.

ఐటీసీ మార్కెట్‌ విలువ మాత్రం గతవారం రూ. 4,593.55కోట్లు పెరిగి రూ. 3,42,495.09కోట్లకు చేరింది. క్రితం వారంలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్ 737.53 పాయింట్లు పతనమై 35,808.95 వద్ద ముగిసింది.

మార్కెట్‌ విలువ పరంగా రిలయన్స్‌ అగ్రస్థానంలో ఉండగా.. టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, ఐటీసీ, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్‌ మహింద్రా బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌ టాప్‌ 10లో ఉన్నాయి.
 

click me!