RBI to introduce notes with images: రూపాయి నోట్లపై ఆ ఇద్దరి బొమ్మల ముద్రణ.. ఆర్బీఐ తుది నిర్ణయం..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jun 06, 2022, 10:53 AM IST
RBI to introduce notes with images: రూపాయి నోట్లపై ఆ ఇద్దరి బొమ్మల ముద్రణ.. ఆర్బీఐ తుది నిర్ణయం..!

సారాంశం

భారతీయ కరెన్సీ నోట్లపై ఇన్నేళ్లుగా మహాత్మ గాంధీ ఫొటోను మాత్రమే చూశాం. కానీ.. త్వరలో దేశానికి చెందిన మరో ఇద్దరు ప్రముఖుల ఫొటోలను కూడా నోట్లపై ముద్రించాలని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా భావిస్తున్నట్లు తెలిసింది. ఆ ఇద్దరిలో ఒకరు బెంగాల్‌కు చెందిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కాగా, మరొకరు దేశం గర్వించదగ్గ మిస్సైల్ మ్యాన్, భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం.   

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న అత్యంత కీలక నిర్ణయాల్లో ఒకటి- పెద్ద నోట్ల రద్దు. అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సాల్లోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు మోడీ. అప్పట్లో అదో పెద్ద సంచలనం. బ్లాక్ మనీని అరికట్టాలనే ప్రధాన లక్ష్యంతో పెద్ద నోట్లను రద్దు చేస్తూ 2016 నవంబర్ 8వ తేదీన ప్రకటన చేశారాయన. అప్పటి నుంచే కొత్త కరెన్సీ నోట్లు మనుగడలోకి వచ్చాయి. 10 నుంచి 2000 రూపాయల వరకు కొత్త కరెన్సీ నోట్లు చలామణి అవుతున్నాయి.

దేశ కరెన్సీ చరిత్రలో రెండో అతిపెద్ద సంస్కరణగా చెబుతుంటారు దీన్ని. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కరెన్సీ నోట్ల విషయంలో మరో సంచలనానికి తెర తీసినట్టే కనిపిస్తోంది. మూడో సంస్కరణగా మార్పులు చేర్పులు చేసే అవకాశాలను పరిశీలిస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం రూపాయి నోట్ల మీద జాతిపిత మహాత్మాగాంధీ బొమ్మ ముద్రితమౌతోన్న విషయం తెలిసిందే. మహాత్ముడి బొమ్మతో పాటు దేశ చరిత్రను మార్చివేసిన మరో ఇద్దరు ప్రముఖుల బొమ్మలను ముద్రించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు.

ఆ ఇద్దరు- నోబెల్ పురస్కార గ్రహీత, జాతీయ గేయ రచయిత రబీంద్రనాథ్ ఠాగూర్, దేశ అంతరిక్ష పరిశోధనల పితామహుడు, మిస్సైల్ మ్యాన్‌, దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఈ ఇద్దరి బొమ్మలను కూడా కరెన్సీ నోట్ల మీద ముద్రించే యోచనలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఉందని సమాచారం. రబీంద్రనాథ్ ఠాగూర్, ఏపీజే అబ్దుల్ కలాం బొమ్మలను వాటర్ మార్కులుగా ముద్రించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

దీనికి సంబంధించిన ప్రతిపాదనలు రిజర్వుబ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ పరిశీలనలో ఉన్నాయని, త్వరలోనే దీనిపై తుదినిర్ణయాన్ని తీసుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. ప్రత్యేకించి- 2000 రూపాయల నోటుపై మహాత్మగాంధీతో పాటు రవీంద్రనాథ్ ఠాగూర్, అబ్దుల్ కలాం వాటర్ మార్కులను ముద్రించాలని రిజర్వ్ బ్యాంక్ ఇంటర్నల్ కమిటీ ప్రతిపాదించిందని, దీన్ని గవర్నర్ శక్తికాంత దాస్ తుది ఆమోదం తెలపాల్సి ఉందని అంటున్నారు.

ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం.. అగ్రరాజ్యం అమెరికాను అనుసరిస్తోందనే అభిప్రాయాలు సైతం వ్యక్తమౌతున్నాయి. అమెరికా ముద్రించే డాలర్ల మీద వేర్వేరు ప్రముఖలు బొమ్మలు ఉంటాయి. జార్జ్ వాషింగ్టన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, థామస్ జెఫర్సన్, ఆండ్రూ జాక్సన్, అలెగ్జాండర్ హామిల్టన్, అబ్రహం లింకన్.. వంటి ప్రముఖుల పేర్లతో డాలర్.. చలామణిలో ఉంటోంది. అదే తరహాలో రూపాయి నోట్ల మీద కూడా మహాత్మాగాంధీ బొమ్మ మాత్రమే కాకుండా.. ఇతర ప్రముఖుల ఫొటోలను కూడా ముద్రించే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు.

రబీంద్రనాథ్ ఠాగూర్, ఏపీజే అబ్దుల్ కలాం బొమ్మలను ముద్రించిన నోట్ల నమూనాలు కూడా సిద్ధమైనట్లు చెబుతున్నారు. రెండు వేర్వేరు శాంపిళ్లను ఆర్బీఐ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూపొందించిందని తెలుస్తోంది. ఈ రెండు వాటర్ మార్కులను ఐఐటీ-ఢిల్లీ ప్రొఫెసర్ దిలీప్ టీ షహానీ డిజైన్ చేశారని సమాచారం. రెండు సెట్ల డిజైన్లను షహానీ సిద్ధం చేశారని, వాటిని తుది నిర్ణయం కోసం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వద్దకు పంపించారనే ప్రచారం ఉంది.

PREV
click me!

Recommended Stories

Personal Loan: శాలరీ స్లిప్ లేకుండా వెంటనే పర్సనల్ లోన్.. ఈ పత్రాలతో గంటల్లో అప్రూవల్ !
Best Investment : బంగారం vs వెండి vs రాగి.. 2025లో ఏది కొంటే జాక్‌పాట్? నిపుణుల సీక్రెట్ ఇదే !