రసకందాయంలో జెట్ ఎయిర్‌వేస్: ఆడిటర్ల వివరణ కోరిన కేంద్రం

By pratap reddyFirst Published Aug 22, 2018, 2:45 PM IST
Highlights

జెట్‌ ఎయిర్‌వేస్‌ జూన్‌ క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలను వాయిదా వేసిన విషయమై ఆ సంస్థ ఆడిటర్లను ప్రభుత్వం వివరణ కోరినట్లు తెలియవచ్చింది.

న్యూఢిల్లీ: జెట్‌ ఎయిర్‌వేస్‌ జూన్‌ క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలను వాయిదా వేసిన విషయమై ఆ సంస్థ ఆడిటర్లను ప్రభుత్వం వివరణ కోరినట్లు తెలియవచ్చింది. ఫలితాల వెల్లడిలో జాప్యం జరగడానికి కారణాలపై ఆడిటర్లను కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పని చేస్తున్న రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వివరణ అడిగిందని ఆ వర్గాల సమాచారం. కాగా భవిష్యత్‌లో కంపెనీ మనుగడ విషయమై ఆడిటర్లు సందేహాలు వ్యక్తం చేశారన్న వార్తలు వెలువడ్డాయి. నిధుల దుర్వినియోగంపై వివరాలివ్వాలని ఆదేశించినట్లు వినికిడి. 

ఇందులో జెట్ ఎయిర్ వేస్ ఆడిటర్ల పాత్రపైనా దర్యాప్తు చేస్తామని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రాథమిక దర్యాప్తునకు మాత్రమే పరిమితమని, మున్ముందు ఏదైనా ఆధారం లభిస్తే పూర్తిస్థాయి దర్యాప్తునకు చర్యలు తీసుకుంటామని పేర్కొంది. కానీ కార్పొరేట్ మంత్రిత్వశాఖ నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని స్టాక్ ఎక్స్చేంజ్‌లకు జెట్ ఎయిర్‌వేస్ యాజమాన్యం తెలిపింది. 

ఇదిలా ఉంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వాయిదా వేస్తున్నామని జెట్‌ ఎయిర్‌వేస్‌ ఈ నెల 9న ప్రకటించింది. ఈ ఫలితాలను ఈ నెల 27న ప్రకటిస్తామని ఇటీవలే జెట్‌ ఎయిర్‌వేస్‌ పేర్కొంది. ఆర్థిక ఫలితాలను వెల్లడించడంలో జాప్యం జరుగుతున్న విషయమై మార్కెట్‌ నియంత్రణ సంస్థ ‘సెబీ’ కూడా దృష్టి సారించింది. 

ప్రైవేట్ విమానయాన సంస్థలకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించుకోవాల్సిన బాధ్యత వాటిదేనని, ప్రభుత్వ పాత్ర విధాన నిర్ణయాల వరకే ఉంటుందని పౌర విమానయాన మంత్రి సురేశ్‌ ప్రభు తెలిపారు. ముడిచమురు ధరలు పెరగడానికి తోడు, తీవ్రపోటీ నేపథ్యంలో టికెట్‌ ధరలు పెంచలేనందున, విమానయాన సంస్థల లాభదాయకత బాగా తగ్గుతుందని మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. జెట్‌ ఎయిర్‌వేస్‌ పరిస్థితి ఎలా ఉందో తమకు తెలియదని మంత్రి తెలిపారు. విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ధరలు పెరిగినపుడల్లా, టికెట్ల ధరలు సత్వరం మార్చలేరని, ఫలితంగా విమానయాన సంస్థలకు ఆర్థికంగా నష్టం వాటిల్లుతోందని మంత్రి పేర్కొన్నారు.

‘దేశీయంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉంది. ఇంధన ధరలపై మన నియంత్రణ ఉండదు. ఏటీఎఫ్‌ను వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) పరిధిలోకి తీసుకు రావడమే మన చేతుల్లో ఉంది. దీనికోసం ప్రయత్నిస్తున్నాం’ అని మంత్రి వివరించారు. 


పాతికేళ్లుగా దేశంలో పూర్తిస్థాయి విమానయాన సేవలందిస్తున జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆర్థికంగా కష్టాల్లో ఉన్న సంగతి విదితమే. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసిక ఫలితాలను కూడా సంస్థ వాయిదా వేసింది. నిధుల మళ్లింపు జరిగిందని వచ్చిన వార్తలపై కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ పరిశీలన ప్రారంభించిందని వార్తలు రావడంతో జెట్ ఎయిర్ వేస్ షేర్లు పతనం అయ్యాయి.

click me!