ఏప్రిల్‌లో దేశ నిరుద్యోగ రేటు 5.1%..

Published : May 16, 2025, 11:07 AM IST
ఏప్రిల్‌లో దేశ నిరుద్యోగ రేటు 5.1%..

సారాంశం

భారత్‌లో మొదటి నెలవారీ ఉద్యోగ గణాంకాల ప్రకారం ఏప్రిల్‌లో నిరుద్యోగ రేటు 5.1%. గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ భాగస్వామ్యం పట్టణాల కంటే అధికంగా ఉంది.

భారత ప్రభుత్వం తొలిసారిగా నెలవారీ ఉద్యోగ గణాంకాలను విడుదల చేసింది. ఏప్రిల్ 2025కి సంబంధించిన ఈ నివేదిక దేశంలో ఉపాధి పరిస్థితులపై త్వరితగతిన అవగాహన కల్పించేందుకు తీసుకున్న కీలక చర్యగా మారింది. గణాంకాలు,  కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం, 15 ఏళ్లు, అంతకంటే పై వయస్సు గల ప్రజలలో నిరుద్యోగ రేటు 5.1 శాతంగా ఉంది. ఇందులో పురుషుల నిరుద్యోగిత 5.2 శాతం కాగా, మహిళలది 5.0 శాతం.

ఈ గణాంకాలను పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే కింద కరెంట్ వీక్లీ స్టేటస్ ప్రమాణాలతో సేకరించారు. ఇప్పటివరకు దేశస్థాయిలో ఏటా, పట్టణాల పరంగా త్రైమాసికంగా గణాంకాలు అందించబడేవి. ఇకపై నెలవారీగా విడుదల చేయనున్నారు.ఏప్రిల్ నెలలో దేశవ్యాప్తంగా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు (LFPR) అంటే పనిచేయదలిచిన లేదా పని చేస్తున్న వారి శాతం 55.6గా నమోదైంది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో ఇది 58 శాతం ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 50.7 శాతంగా ఉంది. పురుషుల LFPR గ్రామీణ ప్రాంతాల్లో 79 శాతం, పట్టణాల్లో 75.3 శాతంగా ఉండగా, మహిళలది గ్రామీణాల్లో 38.2 శాతం, పట్టణాల్లో మాత్రం చాలా తక్కువగా 23.5 శాతంగా ఉంది.

ఉపాధిలో ఉన్న వ్యక్తుల శాతం, అంటే వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు (WPR), దేశవ్యాప్తంగా 52.8 శాతంగా నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది 55.4 శాతం ఉండగా, పట్టణాల్లో 47.4 శాతంగా ఉంది. గ్రామీణ మహిళల్లో WPR 36.8 శాతంగా ఉండగా, పట్టణ మహిళల్లో ఇది కేవలం 23.5 శాతమే ఉంది. మొత్తం మహిళా ఉపాధి రేటు 32.5 శాతంగా నమోదైంది.

ఈ గణాంకాలను ప్రతినెల 45 రోజుల గ్యాప్‌తో విడుదల చేస్తారు. ఇది దేశాన్ని అంతర్జాతీయ కార్మిక గణాంక ప్రమాణాలకు దగ్గరగా తీసుకువెళ్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, ప్రైవేట్ సంస్థ CMIE అంచనా ప్రకారం ఏప్రిల్‌లో నిరుద్యోగ రేటు 7.73 శాతంగా ఉండగా, ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల్లో ఇది తక్కువగా ఉంది. అధికారికంగా పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం 6.5 శాతంగా, గ్రామీణ ప్రాంతాల్లో 4.5 శాతంగా నమోదైంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మీలో ఈ మూడు విషయాలుంటే చాలు..! సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ కావచ్చు.. అంబానీ అవ్వొచ్చు
Aadhaar PAN Link : డిసెంబర్ 31 డెడ్‌లైన్.. ఆధార్, పాన్ లింక్ చేయకపోతే ఏం జరుగుతుంది?