
IBM cuts 8000 jobs as AI replaces: కృత్రిమ మేధస్సు (AI) ఎఫెక్ట్ తో కార్పొరేట్ ఉద్యోగాలు ఎలా ఊడుతున్నాయో తేటతెల్లం చేసింది ఐబీఎం ఘటన. టెక్ దిగ్గజం ఐబీఎం సంస్థ దాదాపు 8,000 ఉద్యోగులను తొలగించింది. ఈ తొలగింపులలో ఎక్కువగా హ్యూమన్ రీసోర్సెస్ (HR) విభాగంలోని ఉద్యోగులు ఉన్నారు. ఈ ఉద్యోగాలను ఏఐ భర్తీ చేస్తోందని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
ఇంటర్నల్ రిపోర్టుల ప్రకారం, IBM ఇటీవల తన హెచ్‌ఆర్ కార్యకలాపాలలో ఏఐ వ్యవస్థలను విస్తృతంగా ప్రవేశపెట్టింది. ఇప్పటికే 200 హెచ్‌ఆర్ ఉద్యోగాలను ఇంటెలిజెంట్ ఏఐ సాఫ్ట్‌వేర్ ఏజెంట్లు భర్తీ చేశాయి. ఈ ఏఐ ఏజెంట్లు డేటా సరిపోల్చుకోవడం, ఉద్యోగుల ప్రశ్నలకు స్పందించడం, డాక్యుమెంటేషన్ ప్రాసెసింగ్ వంటి పునరావృత పనులను నిర్వహిస్తున్నాయి.
ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ ప్రకారం.. ఈ మార్పులు వ్యాపార వృద్ధికి అవసరమైన విభాగాలకు మూలధనాన్ని మళ్లించడం వల్ల జరిగినవిగా పేర్కొన్నారు. "AI వల్ల మేం కొంత ఆదా చేసాం. ఈ ఆదా వల్ల మేం డెవలప్‌మెంట్, మార్కెటింగ్, సెల్స్ విభాగాలలో మరింత పెట్టుబడులు పెట్టగలగాం" అని చెప్పారు.
ఈ మార్పులు ప్రధానంగా హెచ్‌ఆర్ విభాగాన్ని ప్రభావితం చేశాయి. అయినప్పటికీ, IBM చీఫ్ హెచ్‌ఆర్ ఆఫీసర్ నికెల్ లామోరో ప్రకారం, "పూర్తిగా ఉద్యోగాలు పోవు. రిపిటేటివ్ పనులు ఏఐ చేత జరుగుతాయి. మానవ ఉద్యోగులు వ్యూహాత్మక నిర్ణయాలలో భాగమవుతారు" అని తెలిపారు.
ఇంటర్నల్ ఏఐ మార్పులతో పాటు, ఐబీఎం ఇతర సంస్థలకూ టూల్స్‌ను అందించేందుకు రంగంలోకి దిగింది. ఈ నెలలో జరిగిన వార్షిక ‘థింక్ ఈవెంట్’ లో ఇతర కంపెనీలు తమ సొంత ఏఐ ఏజెంట్లను నిర్మించేందుకు ఉపయోగపడే కొత్త టూల్స్‌ను విడుదల చేసింది. ఇవి ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్, ఏడబ్ల్యూఎస్ వంటి దిగ్గజ సంస్థల పరిష్కారాలతో అనుసంధానమవుతాయి.
కేవలం ఐబీఎం మాత్రమే కాదు ఇతర సంస్థలు కూడా ఏఐ రాకతో పెద్ద స్థాయిలో మార్పులు చేస్తున్నాయి. Duolingo ఇటీవల కంటెంట్ మాడరేషన్‌లో మానవ ఉద్యోగుల స్థానంలో ఏఐ టూల్స్‌ను ప్రవేశపెట్టింది. Shopify CEO Tobias Lütke కూడా "మానవులను నియమించే ముందు ఏఐ ఆ పని చేయగలదా అనే ప్రశ్న వేసుకోవాలి" అని చెప్పాడం మార్కెట్ పోకడలు ఎలా ఉన్నాయనేది వివరిస్తుంది.