నిజమే: జీఎస్టీతో చిన్న వ్యాపారులకు నష్టమే.. ప్రధాని మోదీ ఒప్పుకోలు

By rajesh yFirst Published Jan 2, 2019, 10:20 AM IST
Highlights

ఒకేదేశం.. ఒకే పన్ను నినాదంతో ఏడాదిన్నర క్రితం అట్టహాసంగా కేంద్రం ప్రారంభించిన జీఎస్టీ అమలుతో చిన్న వ్యాపారులు సైతం తోపుడుబండ్ల వద్ద తమ అవసరాలు కొనుగోలు చేయడం గమనార్హం. ప్రధాని మోదీ కూడా చిన్న వ్యాపారులు జీఎస్టీ వల్ల దెబ్బ తిన్నారని ఏఎన్ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అంగీకరించారు.

న్యూఢిల్లీ: తమ ప్రభుత్వం 2017 జూలై నుంచి అమలులోకి తెచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)తో చిన్న వ్యాపారులు దెబ్బ తిన్నారని ప్రధాని నరేంద్రమోదీ ఎట్టకేలకు అంగీకరించారు. ఆయన ఏఎన్‌ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ సంగతి చెప్పారు. జీఎస్టీ ఇంకా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోలేదని దీనిపై కసరత్తు కొనసాగుతోందన్నారు. 
రాహుల్‌ గాంధీ జీఎస్టీని 'గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్‌‌'గా పేర్కొనడాన్ని ప్రధాని మోదీ ఆక్షేపించారు. అన్ని పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాకే తాము జీఎస్టీని అములులోకి తెచ్చామన్నారు. ప్రణబ్‌ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పటి నుంచే జీఎస్టీ ప్రక్రియ మొదలైందని అన్నారు. 

బలహీన చట్టాలతోనే వారు ఫలాయనం
బ్యాంకులను ముంచి విజయ్ మాల్యా, నీరవ్‌ మోదీ, మెహుల్ చోక్సీ తదితర ఆర్థిక నేరగాళ్లు సరిహద్దులు దాటి వెళ్లిపోవడానికి దేశంలో అమలులో ఉన్న బలహీనమైన ఆర్థిక చట్టాలే కారణమని ప్రధాని మోడీ అన్నారు. వీటిని సమీక్షించి బలమైన చట్టాలను అమలులోకి తెచ్చే ప్రక్రియను తమ సర్కార్కొనసాగిస్తోందని ఆయన అన్నారు. ఆర్థిక మోసగాళ్లను వెనక్కి రప్పించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. వారి వద్ద నుంచి తాము ప్రతి పైసా రాబడుతామని ఆయన తెలిపారు. 

నోట్ల రద్దు ఆకస్మిక నిర్ణయం కాదు
దేశంలో చేపట్టిన పెద్దనోట్ల రద్దు ప్రక్రియన తాము తీసుకున్న ఆకస్మిక నిర్ణయం కాదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ఇది ఆర్థిక వ్యవస్థకు కుదుపు ఏ మాత్రం కాదన్నారు. వ్యవస్థను శద్ధి చేసేందుకు నోట్ల రద్దు అవసరమన్నారు. నోట్లరద్దుకు ఏడాది ముందు నుంచే ప్రజలను తాము హెచ్చరిస్తూ వచ్చామని ప్రధాని అన్నారు. నల్లధనం ఉంటే ప్రజలు వెంటనే డిపాజిట్‌ చేయమని కోరామని, లేకుంటే తగిన జరిమానాను ఎదుర్కోవాల్సి వస్తుందని తాము ప్రజలకు ముందే తెలిపామని ఆయన అన్నారు. అయితే చాలా మంది తన వ్యాఖ్యలను తేలిగ్గా తీసుకున్నారని.. ఇతర నేతల్లాగా మోదీ కూడా మాటలు తప్ప చేతలు చేయలేరని వారు భావించారన్నారు. అయితే నోట్లరద్దులో వ్యవస్థ శుద్ధిచేయబడిందని ఆయన అన్నారు. 

చాలా ముందే వైదొలుతానని ఉర్జిత్‌ చెప్పారన్న మోదీ  
భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్బీఐ) మాజీ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామాపై దేశ ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారిగా పెదవి విప్పారు. ఉర్జిత్‌ను రాజీనామా చేయమని తాము కోరలేదని  తెలిపారు. అలాగని ఆయనపై రాజకీయ ఒత్తిడి కూడా తేలేదని ఆయన వివరించారు. ఆర్బీఐ అధినేత పదవి నుంచి తప్పుకోనున్నట్టు ఆయన కొన్ని నెలల ముందే తనకు సమాచారం ఇచ్చినట్టుగా మోదీ తెలిపారు. వ్యక్తిగత కారణాలతో తాను పదవి నుంచి వైదొలగాలని భావిస్తున్నట్టుగా ఉర్జిత్‌ ఆరేడు నెలల ముందే తనకు లిఖితపూర్వకంగా తెలియజేశారని మోదీ వెల్లడించారు.

ఒత్తిళ్లకు తావే లేదని నరేంద్రమోదీ వెల్లడి
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆర్బీఐ గల అదనపు నిధులను కోరడంతో పాటు పెద్ద బ్యాంక్‌ విధివిధానాలు, పనితీరు విషయం ప్రభుత్వం, ఆర్బీఐకి మధ్య వివాదం తారాస్థాయికి చేరి నేపథ్యంలో ఆర్బీఐ అధినేత పదవి నుంచి ఉర్జిత్‌ పటేల్‌ అకస్మాతుగా తన పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. వ్యక్తిగత కారణాలను చూపుతూ ఆయన తన పదవకి రాజీనామా చేసినప్పటికీ.. ఆర్బీఐ బోర్డు పేరుతో సర్కార్ చేసిన రాజకీయ ఒత్తిడి వల్లే ఆయన వైదొలిగినట్టుగా విమర్శలు వినవచ్చిన నేపథ్యంలో మోదీ ఈ వివరణనిచ్చారు. ఉర్జిత్‌ రాజీనామాకు వెనుక ఆలాంటి కారణాలకు ఆస్కారమేలేదని అన్నారు. 
 

click me!