
మంగళవారం మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ఉదయం పాజిటివ్ నోట్ తో మొదలైనప్పటికీ, మార్కెట్ ముగిసే సమయానికి భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ముగింపులో, సెన్సెక్స్ 304.48 పాయింట్లు నష్టపోయి 57,684 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 69.80 పాయింట్లు క్షీణించి 17,245.70 వద్ద ముగిసింది. దాదాపు 1424 షేర్లు పురోగమించాయి, 1891 షేర్లు క్షీణించాయి. 118 షేర్లు మారలేదు.
కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, బ్రిటానియా ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్‌టెల్ మరియు సిప్లా టాప్ నిఫ్టీ లూజర్స్ లో ఉన్నాయి. హిందాల్కో ఇండస్ట్రీస్, దివీస్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, టాటా స్టీల్, యుపిఎల్ మాత్రం టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.
సెక్టార్ల పరంగా చూస్తే హెల్త్‌కేర్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ సూచీలు గ్రీన్‌లో ముగియగా, ఆటో, బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్‌ఎంసిజిలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు వరుసగా రెండో రోజు ఫ్లాట్‌గా ముగిశాయి.
ఇటీవలి ర్యాలీ తర్వాత, మార్కెట్ అప్రమత్తంగా ఉంది. సరఫరా పరిమితుల ద్వారా ప్రేరేపించబడిన ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా మార్కెట్లో అస్థిరత తిరిగి వచ్చింది. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో కోవిడ్ కేసుల పెరుగుదల, మార్కెట్లో డిమాండ్ తగ్గడం, యుద్ధం, అధిక వస్తువుల ధరలు ఆదాయ వృద్ధిని ప్రభావితం చేస్తున్నాయి, ఇది అవుట్‌లుక్‌లో డౌన్‌గ్రేడ్‌కు దారి తీస్తుంది.
యుద్ధానికి ముగింపు వస్తే ప్రపంచ వాణిజ్య సరఫరాలో పెరుగుదల నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు భారత్ లాంటి దేశాలకు తిరిగి మార్కెట్లో పుంజుకునే అవకాశం దక్కుతుంది. లేకుంటే ఇది స్వల్పకాలంలో సవాలుగా ఉంటుందని - వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ పేర్కొన్నారు.