రూ.29కే కేంద్ర ప్రభుత్వ భారత్ రైస్! ఇప్పుడు 5 కిలోలు, 10 కిలోల ప్యాక్‌లలో.. !

By Ashok kumar SandraFirst Published Feb 7, 2024, 1:48 PM IST
Highlights

సబ్సిడీ భారత్ బియ్యాన్ని 5 కిలోలు, 10 కిలోల బ్యాగుల్లో కొనుగోలు చేయవచ్చని ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అలాగే ప్రజలకు అవసరమైన ఆహార పదార్థాలను సరసమైన ధరలకు అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
 

గతేడాది బియ్యం చిల్లర ధర 15 శాతం పెరగగా, వినియోగదారులపై భారం పడకుండా  కేంద్ర ప్రభుత్వం కిలో రూ.29కి 'భారత్ రైస్'ను ప్రవేశపెట్టింది.

సబ్సిడీ భారత్ బియ్యాన్ని 5 కిలోలు, 10 కిలోల బ్యాగుల్లో కొనుగోలు చేయవచ్చని ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అలాగే ప్రజలకు అవసరమైన ఆహార పదార్థాలను సరసమైన ధరలకు అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

మంగళవారం భారత్ రైస్ విక్రయాలను ప్రారంభించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా కేంద్ర ప్రభుత్వ చర్యలతో టమోటాలు, ఉల్లి ధరలు త్వరగా తగ్గాయని గుర్తు చేశారు. భారత్ అట్టా పేరుతో గోధుమలను విక్రయించడం ప్రారంభించిన గత ఆరు నెలల్లో గోధుమల ద్రవ్యోల్బణం సున్నాకి పడిపోయిందని, అదే ప్రభావాన్ని బియ్యంపై కూడా చూడగలమని కేంద్ర మంత్రి అన్నారు.

ఈ ఉత్పత్తుల ధర చాలా స్థిరంగా ఉందని, ఇది మధ్యతరగతి ప్రజల అవసరాలను తీర్చగలదని ఆయన నొక్కి చెప్పారు. నిత్యవసర వస్తువులను సరసమైన ధరలకు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గోయల్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో 'భారత్ రైస్' విక్రయించే 100 మొబైల్ వ్యాన్‌లను మంత్రి పీయూష్ గోయల్ జెండా ఊపి ప్రారంభించారు. విక్రయాలను ప్రారంభించేందుకు ఐదుగురు లబ్ధిదారులకు 5 కిలోల భారత్ బియ్యం బ్యాగులను  పంపిణీ చేశారు.

మొదటి దశలో, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) NABARD (NAFED) అండ్  నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NCCF) ద్వారా 5 లక్షల టన్నుల భారత్ బియ్యాన్ని విక్రయించనుంది. ఈ బియ్యం 5 కిలోలు, 10 కిలోల బస్తాల్లో లభిస్తుంది.

ఇప్పటికే భారత్ అట్టా కిలో రూ.27.50కి, భారత్ చానా(dal ) కిలో రూ.60కి విక్రయించడం గమనార్హం. అదేవిధంగా 'భారత్ రైస్'కు కూడా మంచి ఆదరణ లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

భారత్ బ్రాండ్ ఉత్పత్తుల గురించి తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్న కేంద్ర మంత్రి గోయల్, తాను 'భారత్ దళ్' అండ్  'భారత్ అట్టా'లను ఉపయోగించడం ప్రారంభించానని, రెండూ రుచికరమైనవని అన్నారు. "ఇప్పుడు, నేను 'భారత్ బియ్యం' కొన్నాను. ఇది కూడా మంచి నాణ్యతతో ఉంటుంది," అని అన్నారు .

click me!