2025 నాటికి Petrol, Diesel ధరలు భారీగా తగ్గే చాన్స్, Ethanol Blending 20 శాతం పెంపునకు కేంద్ర కేబినేట్ ఓకే

By team teluguFirst Published May 18, 2022, 10:43 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2025 నాటికి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడంలో భాగంగా, ఇంధనాల్లో ఇథనాల్ మిక్సింగ్ 20 శాతం పెంపునకు కేబినేట్ ఆమోదం తెలిపింది. తద్వారా  ప్రత్యామ్నాయ పర్యావరణ అనుకూల ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు,  క్రూడ్ వంటి వాటి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. 

2025-26 నాటికి పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిక్స్ చేయాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంతకు ముందు 2030 నాటికి ఈ  లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్దేశించుకున్నారు. ప్రస్తుతం పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్‌ కలుపుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశం బయో ఇంధనాలపై జాతీయ విధానానికి సవరణలకు ఆమోదం తెలిపింది. దీని కింద ఇథనాల్ ఉత్పత్తి పెరుగుతుంది. దీనితో పాటు, ఉత్పత్తిని పెంచడానికి మరిన్ని పంటల వినియోగాన్ని కూడా ఆమోదించారు.

పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ 2009లో జాతీయ జీవ ఇంధన విధానాన్ని అమలు చేసింది.  తరువాత, జూన్ 4, 2018న, ఈ మంత్రిత్వ శాఖ దాని స్థానంలో బయో ఇంధనంపై జాతీయ విధానం-2018ని నోటిఫై చేసింది. వచ్చే రెండేళ్లలో పెట్రోల్‌లో 20% ఇథనాల్‌ను కలపాలని మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో చమురు దిగుమతుల భారం విషయంలో చాలా వరకు ఉపశమనం కలిగిస్తుంది.

జీవ ఇంధన విధానానికి ఆమోదించబడిన ప్రధాన సవరణల్లో  ప్రత్యేక సందర్భాలలో జీవ ఇంధనాన్ని ఎగుమతి చేయడానికి అనుమతించడం లాంటివి ఉన్నాయి. దీంతో పాటు 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమం కింద దేశంలో జీవ ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది ప్రత్యేక ఆర్థిక మండలాలు (SEZలు) లేదా ఎగుమతి యూనిట్ల ద్వారా ప్రోత్సహించబడుతుంది.

ఆత్మనిర్భర్ భారతదేశానికి ఊతం లభిస్తుంది
భారతదేశం ప్రస్తుతం తన ముడి చమురు అవసరాలలో 85 శాతం దిగుమతులపై ఆధారపడి ఉంది. అటువంటి పరిస్థితిలో, జీవ ఇంధన విధానం చాలా ఉపయోగకరంగా మారనుంది. ఇది దిగుమతులపై దేశం ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. జీవ ఇంధన ఉత్పత్తికి మరిన్ని ఉత్పత్తులు అనుమతించబడుతున్నందున, ఇది స్వావలంబన భారతదేశానికి ప్రోత్సాహాన్ని ఇస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. 2047 నాటికి ఇంధన విషయాల్లో భారతదేశాన్ని ఆత్మనిర్భర్ భారత్ గా మార్చాలన్న ప్రధాని నరేంద్ర మోదీ కల నెరవేరేందుకు ఇది దోహదపడుతుంది.

click me!