
హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత, అదానీ సామ్రాజ్యంలో పెద్ద తుఫాను తలెత్తింది. ఈ తుపానులో అదానీ సంపద కొట్టుకుపోయిందని విశ్లేషిస్తున్నారు. బుధవారం, అదానీ నికర విలువ 45 బిలియన్ డాలర్ల కంటే తక్కువగా ఉంది. ఫోర్బ్స్, బ్లూమ్‌బెర్గ్ ప్రచురించిన ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో అదానీ 29వ స్థానానికి పడిపోయారు. ప్రపంచ సంపన్నుల జాబితాలో ముఖేష్ అంబానీ కూడా 11వ స్థానం నుంచి 12వ స్థానానికి పడిపోయారు. ఇద్దరి నికర ఆదాయంలో పతనం ఉంది. అయితే అంబానీతో పోలిస్తే అదానీ ఆదాయం భారీగా పడిపోయింది.
హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత అదానీ సంపదలో క్షీణత
జనవరి 24న, US-ఆధారిత హిండెన్‌బర్గ్ 100 పేజీల నివేదిక బయటపెట్టిన తర్వాత అదానీ సంపద బాగా క్షీణించింది. అంతేకాదు అదానీ గ్రూప్ షేర్లు కూడా భారీ క్షీణతను నమోదు చేశాయి. గత సెప్టెంబర్‌లో అదానీ మొత్తం సంపద దాదాపు 150 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఫలితంగా, అతను ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో రెండవ స్థానంలో నిలిచాడు. ఆసియా నుంచి ఈ స్థానానికి చేరుకున్న తొలి వ్యక్తిగా కూడా గుర్తింపు పొందారు. అయితే ఈ ఏడాది మాత్రం అదానీ వ్యూహం బెడిసి కొట్టింది. దీంతో ఆయన సంపది కరిగిపోతోంది.
అదానీ సంపద కరిగిపోయింది
హిండెన్ బెర్గ్ నివేదిక ద్వారా అదానీ గ్రూప్ ఇన్వెస్టర్లను మోసం చేసిందని ఆరోపించడంతో గౌతమ్ అదానీ సంపద కరిగిపోయింది. దీంతో అదానీ సంపద 42.7 బిలియన్ డాలర్లకు తగ్గింది. దీంతో ప్రపంచ సంపన్నుల జాబితాలో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన అదానీ.. ఇప్పుడు 29వ స్థానానికి పడిపోయారు. ముఖేష్ అంబానీతో పోలిస్తే గౌతమ్ అదానీ సంపద 14 రెట్లు తగ్గింది. ఈ ఏడాది సంపద తగ్గిన వ్యాపారవేత్తల్లో గౌతం అదానీ, ముఖేష్ అంబానీలు వరుసగా మొదటి, రెండో స్థానాల్లో ఉన్నారు. బుధవారం భారత స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్ షేర్లు భారీగా పతనమయ్యాయి. అదానీ గ్రూప్‌లోని మొత్తం 10 షేర్లు నష్టాలతో గత వారం రోజులుగా నష్టాల బారిన పడుతున్నాయి..
12వ స్థానంలో ముఖేష్ అంబానీ
భారత స్టాక్ మార్కెట్ పతనం ముకేశ్ అంబానీని కూడా ప్రభావితం చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు కూడా నష్టాలను చవిచూశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 2.35 శాతం క్షీణించి రూ.2,337కు చేరుకుంది. అప్పటి నుంచి ముఖేష్ అంబానీ సంపద కూడా తగ్గుముఖం పట్టింది. ఇప్పటివరకు అంబానీ నికర విలువ 5.6 బిలియన్ డాలర్లు కోల్పోయింది. ప్రస్తుతం ముఖేష్ అంబానీ నికర విలువ 81.5 బిలియన్ డాలర్లు. ముఖేష్ అంబానీ సంపద గౌతమ్ అదానీ కంటే రెట్టింపు అవడం విశేషం.