అదానీ గ్రూప్ ఎంక్యాప్ 7 నెలల గరిష్ట స్థాయికి చేరుకోగా, చాలా గ్రూప్ కంపెనీల షేర్లు పెరిగాయి. జీ 20 సదస్సు అనంతరం ప్రతిపాదిత భారత్-మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ ద్వారా అదానీ గ్రూప్ లబ్ది పొందనుంది. ఈ నేపథ్యంలో గ్రూపు షేర్లు పెరుగుతున్నాయి.
అదానీ గ్రూప్‌కు సోమవారం లక్కీ డేగా నిలిచింది. అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో మంచి పెరుగుదల కనిపించింది. సోమవారం ట్రేడింగ్ సెషన్‌లో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ షేర్లు 7.10 శాతం లాభంతో ముగిశాయి. అదానీ పోర్ట్స్ ప్రమోటర్లు ఆగస్టు 14 , సెప్టెంబర్ 8 మధ్య కంపెనీలో తమ వాటాను 2.17 శాతం పెంచుకున్న తర్వాత కంపెనీ షేర్లలో ఈ పెరుగుదల వాస్తవంగా వచ్చింది. ఈ చర్యతో కంపెనీలో అదానీ గ్రూప్ మొత్తం వాటా 65.23 శాతానికి పెరిగింది.
అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో పెరుగుదల
గ్రూప్‌లోని ఇతర కంపెనీల షేర్లు కూడా నేటి సెషన్‌లో పెరుగుదలను నమోదు చేశాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్ 3.68 శాతం లాభంతో ముగియగా, అదానీ పవర్ షేర్ 8.90 శాతం లాభంతో ముగిసింది. నేటి పెరుగుదల తర్వాత, అదానీ గ్రూప్ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 11.35 లక్షల కోట్లకు చేరుకుంది, ఇది గత ఏడు నెలల గరిష్ట స్థాయి కావడం విశేషం. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ విడుదలైన వారం తర్వాత ఫిబ్రవరి 1, 2023న గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ చివరిగా ఈ స్థాయిలో కనిపించింది.
ఇదిలా ఉంటే గ్రూప్‌లోని 8 కంపెనీల షేర్లు ఇప్పటికీ జనవరి 24 స్థాయి కంటే దిగువన ఉండటం గమనార్హం.అయితే అదానీ పోర్ట్స్, అదానీ పవర్ షేర్లు జనవరి 24న ఆయా షేర్ల ధరల నుంచి వరుసగా 16 శాతం, 44 శాతం పెరిగాయి. అయినప్పటికీ, గ్రూప్‌లోని 10 కంపెనీలలో 8 షేర్లు ఇప్పటికీ జనవరి 24 స్థాయి కంటే తక్కువగా ఉన్నాయి.
ఇదిలా ఉండగా, జీ20 శిఖరాగ్ర సదస్సు తొలిరోజున ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, యూఏఈ, సౌదీ అరేబియా, భారత్‌లతో కలిసి ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ లేదా ఐఎంఈసీని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రకటించారు.
అయితే భారత్-మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ ద్వారా అదానీ గ్రూప్ లబ్ది పొందనుంది. ఈ కారిడార్‌లో రెండు ప్రత్యేక కారిడార్‌లు ఉంటాయి. మొదటిది తూర్పు కారిడార్, ఇది భారతదేశాన్ని అరేబియా గల్ఫ్‌తో కలుపుతుంది , రెండవది అరేబియా గల్ఫ్‌ను యూరప్‌తో అనుసంధానించే ఉత్తర కారిడార్. అదానీ గ్రూప్‌కు చెందిన హైఫా పోర్ట్ కూడా ఈ ప్రతిపాదిత కారిడార్ ఇందులో ఉండటం విశేషం.