గ్లోబల్ మార్కెట్ ధరల ప్రకారం తక్షణమే అమల్లోకి వచ్చేలా కీలకమైన ఎడిబుల్ ఆయిల్‌ల గరిష్ట రిటైల్ ధర (ఎంఆర్‌పి)ని లీటరుకు రూ.8-12 తగ్గించాలని ప్రభుత్వం ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్‌లను కోరింది.
దేశంలోని సామాన్యులకు మరో శుభవార్త ఎదురుచూస్తోంది. ప్రపంచ ధరలకు అనుగుణంగా ఎడిబుల్ ఆయిల్స్ ధరను లీటరుకు రూ.8-12 తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం కంపెనీలను కోరింది. గ్లోబల్ మార్కెట్ ధరల ప్రకారం తక్షణమే అమల్లోకి వచ్చేలా, ప్రధాన ఆహార నూనెల గరిష్ట రిటైల్ ధర (MRP) రూ. 8-12 తగ్గించాలని ప్రభుత్వం ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్లను కోరినట్లు పిటిఐ రిపోర్ట్ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఆహార, ప్రజాపంపిణీ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా ప్రతినిధులతో సమావేశమయ్యారు.
తక్షణమే అమల్లోకి వచ్చేలా డిస్ట్రిబ్యూటర్లకు ధరలు తగ్గించాలని తయారీదారులు, రిఫైనర్లను కేంద్ర ప్రభుత్వం కోరింది. అలాగే, సమావేశానంతరం కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ "కొన్ని కంపెనీలు తమ ధరలను తగ్గించడంలేదని, వాటి ఎంఆర్‌పి ఇతర బ్రాండ్‌ల కంటే ఎక్కువగా ఉందని" పిటిఐ పేర్కొంది.
"ప్రముఖ ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్‌లు తమ సభ్యులతో సమస్యను తక్షణమే పరిష్కరించాలని, ప్రధాన వంట నూనెల గరిష్ట రిటైల్ ధర (MRP) లీటరుకు రూ. 8-12 తగ్గింపును తక్షణమే అమలులోకి వచ్చేలా చూడాలని ఆదేశించింది" అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
రిపోర్ట్ ప్రకారం, తయారీదారులు లేదా రిఫైనర్లు డిస్ట్రిబ్యూటర్లకు ధరలను తగ్గించినప్పుడు, ఆ ప్రయోజనాన్ని పరిశ్రమ నుండి వినియోగదారులకు బదిలీ చేయాలని , ఆ విషయం మంత్రిత్వ శాఖకు తెలియజేయాలని వచ్చిన ప్రతినిధులకు తెలిపింది. "వంటనూనెల ముడి సరుకులు ధరలు తగ్గడం వలన భారతీయ వినియోగదారులకు తక్కువ ధరకే వంట నూనెలు లభిస్తాయని, తద్వారా ద్రవ్యోల్బణం అరికట్టవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది.
గ్లోబల్ ధరలు తగ్గుముఖం పట్టడం వల్ల వంట నూనెల రిటైల్ ధరలను మరింత తగ్గించడంపై చర్చించేందుకు ఇండియన్ సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్షన్ అసోసియేషన్ , ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్‌తో సహా పరిశ్రమ ప్రతినిధులు నెలలోపు జరిగిన రెండవ సమావేశానికి హాజరయ్యారు. దిగుమతి చేసుకున్న వంటనూనెల ధరలు తగ్గుతున్నందున స్థానిక మార్కెట్‌లో ధరలు తగ్గేలా ఎడిబుల్ ఆయిల్ కంపెనీలు నిర్ధారించుకోవాలని మంత్రిత్వ శాఖ సమావేశంలో పేర్కొంది. గ్లోబల్ మార్కెట్‌లో ధర తగ్గింపులు వీలైనంత త్వరగా తుది వినియోగదారులకు చేరేలా చూడాలని వారికి సూచించారు.
గత రెండు నెలల్లో, ప్రపంచవ్యాప్తంగా వివిధ ఎడిబుల్ ఆయిల్స్ ధరలు టన్నుకు 150-200 డాలర్లు తగ్గాయి. మంత్రిత్వ శాఖ ఇంతకుముందు టాప్ ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్‌లతో సమావేశాన్ని నిర్వహించింది , ఒక నెలలో, అనేక పెద్ద బ్రాండ్‌ల రిఫైన్డ్ సోయాబీన్ , సన్‌ఫ్లవర్ ఆయిల్‌ల లీటరుకు MRP రూ. 5 నుంచి రూ. 15 చొప్పున తగ్గాయి.