సుమారు 88 శాతం 2000 నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయని అధికారికంగా సమాచారం వెలువడింది. ఈ నేపథ్యంలో మార్కెట్లో ప్రస్తుతం 12 శాతం 2000 రూపాయల నోట్లు మిగిలి ఉన్నాయి. వీటి విలువ 42 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ 42 వేల కోట్ల రూపాయలు ఎక్కడ ఉన్నాయి అన్న దానిపైన సర్వత్రా చర్చ నడుస్తోంది.
రూ.2000 నోట్లలో 88 శాతానికి పైగా బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. అంటే మార్కెట్‌లో కేవలం 12 శాతం 2 వేల నోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. బ్యాంకుల నుంచి అందిన సమాచారం ప్రకారం జులై 31 వరకు రూ.3.14 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయి. మే 19న రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఇందుకోసం వినియోగదారులకు సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుల్లో ఈ నోట్లను డిపాజిట్ చేసేందుకు లేదా మార్చుకునేందుకు వెసులుబాటు కల్పించారు.
ఇప్పుడు సుమారు రూ.42,000 కోట్ల విలువైన రూ.2000 నోట్లు మాత్రమే తిరిగి రావాల్సి ఉన్నాయి. నిజానికి రెండువేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించినప్పుడు రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు మార్కెట్లో చలామణిలో ఉన్నాయి. మార్చి 31 నాటికి ఈ నోట్ల విలువ రూ.3.62 లక్షల కోట్లు. బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చిన రూ.2,000 నోట్లలో 87 శాతం బ్యాంకు డిపాజిట్ల రూపంలో వచ్చినవే కాగా, 13 శాతం ఇతర విలువల నోట్లతో కలిపి ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు, సెప్టెంబర్ వరకు రూ.2000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని లేదా ఇతర నోట్లతో మార్చుకోవాలని సెంట్రల్ బ్యాంక్ ప్రజలను కోరింది.
రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకునే అధికారం ఆర్బీఐకి లేదని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మాత్రమే నిర్ణయం తీసుకోగలదని పిటిషనర్ రజనీష్ భాస్కర్ గుప్తా వాదించారు. విలువైన నోట్లను నేరుగా రద్దు చేసే స్వతంత్ర అధికారం ఆర్బీఐకి లేదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 1934 ఆర్‌బిఐ చట్టంలోని సెక్షన్ 24(2) ప్రకారం, ఈ అధికారం కేంద్ర ప్రభుత్వం వద్ద మాత్రమే ఉంటుంది. ఆర్థిక ప్రణాళికలో భాగంగా 'ప్రింట్ మేనేజ్‌మెంట్ క్యాంపెయిన్'లో భాగంగా చెలామణి నుంచి రూ.2000 నోటును ఉపసంహరించుకోవడంపై ఆర్బీఐ పిటిషన్‌ను వ్యతిరేకించింది.
రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటామని, ప్రస్తుతం ఉన్న నోట్లను సెప్టెంబర్ 30 వరకు బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవచ్చని లేదా మార్చుకోవచ్చని మే 19న ఆర్బీఐ ప్రకటించింది. అంతకుముందు అశ్విని కుమార్ ఉపాధ్యాయ అనే న్యాయవాది వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి 2000 నోట్ల విలువ 42 వేల కోట్లుగా అంచనా వేస్తున్నారు ఈ డబ్బంతా ఎక్కడ ఉందనే దానిపైన ప్రస్తుతం నిఘవర్గాలు ఆర్థిక సంస్థలు ఆరా తీస్తున్నాయి. కాగా గతంలో పలు రాజకీయ పార్టీలు ఎన్నికల్లో అవినీతి చేసేందుకే పెద్ద ఎత్తున 2000 నోట్లను దాచిపెట్టాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సర్వత్ర ఈ 42 వేల కోట్లపైనే ఆసక్తి నెలకొని ఉంది.