
జులై నెల ముగిసి ఆగస్టు నెల రావోస్తోంది. కొత్త నెల నుండి పలు నిబంధనలలో మార్పులు రానున్నాయి. ఎల్‌పిజి సిలిండర్ల ధరలు ప్రతి నెల 1వ తేదీన నిర్ణయిస్తారు. దీంతో ఆగస్టు 1 నుంచి ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్లో మార్పు రావచ్చు. అయితే సిలిండర్ల ధరలు ఎంత పెరుగుతుంది లేదా తగ్గుతుంది అనేది ఆగస్టు 1న తేలనుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఆగస్టు 1 నుంచి చెక్కులకు సంబంధించిన నిబంధనలను కూడా మార్చబోతోంది. ఆగస్టు 1 నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడాలో పాజిటివ్ పే సిస్టమ్ కూడా ప్రారంభం కానుంది. దీనితో పాటు స్వాతంత్ర్య దినోత్సవం, రక్షాబంధన్ వంటి పండుగలు కూడా ఆగస్టు నెలలో రానున్నాయి.
బ్యాంక్ ఆఫ్ బరోడా
బ్యాంక్ ఆఫ్ బరోడాలో చెక్ పేమెంట్ నియమాలు ఆగస్టు 1 నుండి మారబోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం, బ్యాంక్ ఆఫ్ బరోడా చెక్కుల పేమెంట్ నిబంధనలలో మార్పులు చేసింది, ఈ మార్పులు ఆగస్టు 1 నుండి వర్తిస్తాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు ఆగస్టు 1 నుంచి రూ. 5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంతో చెక్కులను పాజిటివ్ పే సిస్టమ్ ఆధారంగా చెల్లించనున్నట్లు తెలిపింది. దీని ప్రకారం రూ. 5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో చెక్కులను జారీ చేసే వారు చెక్కు చెల్లింపుకు సంబంధించిన సమాచారాన్ని SMS, నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ యాప్ ద్వారా బ్యాంకుకు అందించాలి. ఆ తర్వాత మాత్రమే సంబంధిత చెక్కు పేమెంట్ చేయవచ్చు. 2020 సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెక్ పేమెంట్ కోసం పాజిటివ్ పేమెంట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని కింద చెక్కు పేమెంట్ కోసం సంబంధించిన సమాచారాన్ని ప్రత్యేకంగా బ్యాంకుకు అందుబాటులో ఉంచాలి.
LPG సిలిండర్ ధరలు
ప్రతి నెల 1వ తేదీన ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరను నిర్ణయిస్తాయి. ఈసారి కూడా ఆగస్టు 1న ఎల్‌పీజీ సిలిండర్ ధరను నిర్ణయించనున్నాయి. మరోవైపు ఈసారి కూడా ఎల్‌పీజీ ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే దీనిపై ఇంకా స్పష్టత లేదు. ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెరుగుతాయా.. లేదా తగ్గుతాయా అన్నది ఆగస్టు 1వ తేదీన తేలనుంది. కొత్త ధరలు తెలియాలంటే ఆగస్ట్ 1 ఉదయం వరకు ఆగాల్సిందే.
ITR రిటర్న్
ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి చివరి తేదీ 31 జూలై 2022. మీరు జూలై 31, 2022లోపు మీ రిటర్న్‌ను ఫైల్ చేయకపోతే ఆగస్టు 1 నుండి మీ రిటర్న్‌ను ఫైల్ చేయడంలో సమస్య ఉండొచ్చు. అయితే, ఆగస్టు 1న లేదా ఆ తర్వాత ప్రజలు రిటర్న్‌ను దాఖలు చేయవచ్చు, అయితే జూలై 31 తర్వాత తమ రిటర్న్‌లను దాఖలు చేయడానికి ఆదాయపు పన్ను శాఖ నిర్ణయించిన పెనాల్టీని చెల్లించాల్సి ఉంటుంది.
కొత్త ఉపరాష్ట్రపతి
జూలైలో ద్రౌపది ముర్ము భారతదేశ కొత్త రాష్ట్రపతి అయ్యారు. అయితే ఆగస్టు నెలలో కొత్త ఉపరాష్ట్రపతి రానున్నారు. ఆగస్టు 6న దేశ ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలు కూడా అదే రోజున రానున్నాయి అలాగే దేశ కొత్త ఉపరాష్ట్రపతి పేరును ప్రకటించనున్నారు.
ఆగస్టు నెలలో బ్యాంకులు బంద్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ హాలిడేస్ లిస్ట్ సిద్ధం చేస్తుంది. ఈ జాబితా ప్రకారం, ఆగస్టు నెలలో బ్యాంకులకు మొత్తం 18 సెలవులు రానున్నాయి. అంటే ఆగస్టు నెలలో మొత్తం 18 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంకింగ్ సంబంధించి మిగిలి ఉన్న కొద్ది రోజుల్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టులో మొహర్రం, రక్షా బంధన్, స్వాతంత్ర్య దినోత్సవం, కృష్ణ జన్మాష్టమి, గణేష్ చతుర్థి వంటి పండుగ రోజుల్లో బ్యాంకులు మూసివేయబడతాయి. అంతే కాకుండా ప్రతి నెలలాగే ఆగస్టు నెలలో కూడా వీకెండ్ హాలిడేస్ కారణంగా రెండో, నాలుగో శనివారాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ వీకెండ్ సెలవులను కలుపుకుంటే ఆగస్టు నెలలో దాదాపు 18 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.