ఇంజినీరింగ్ విద్యార్థుల ఔత్సాహానికి తోడు కళాశాల, వివిధ సంస్థల సహకారంతో ఒక విద్యుత్ చార్జింగ్ కారును ఆవిష్కరించారు. 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ కారు పూర్తిగా చార్జింగ్ కావాలంటే నాలుగు గంటలు పడుతుంది.
విశ్వవ్యాప్తంగా విద్యుత్ వాహనాలపైనే చర్చ జరుగుతోంది. ఆటోమొబైల్ సంస్థలు రకరకాల వ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి. వ్యక్తిగత, ప్రయాణ వాహనాల తయారీ వరకే ప్రస్తుతం అంతా ఫోకస్ పెట్టారు. కానీ బెంగళూరుకు చెందిన ఆర్వీ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ విద్యార్థులు ఒక అద్భుతాన్ని సృష్టించడారు. అచ్చంగా చార్జింగ్‌తో నడిచే కారిది. అంతేకాదు ఇది ఓ రేస్ కారు. ఐదు సెకన్లలోనే 75 మీటర్లు దాటడం దీని ప్రత్యేకత.
గరిష్ఠ వేగం గంటకు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 40 కి.మీల వరకు వెళ్తుంది. పూర్తిగా ఛార్జింగ్ చేయాలంటే నాలుగు గంటలు సమయం పడుతుంది. ఇన్ని ప్రత్యేకతలు గల ఈ చిన్న రేసు కారులోని విశేషాలను జయనగర్‌లో ప్రారంభమైన విద్యుత్ వాహన సాంకేతికత ప్రదర్శనలో ఆవిష్కరించారు.
ఈ రేస్ కారును తయారు చేయడానికి ఏడాది సమయం పట్టిందని విద్యార్థి బృంద నాయకుడు శ్రీకేశ్ చెప్పారు. దీని తయారీకి రూ.12 లక్షలు ఖర్చైందని అన్నారు. కారు బరువు 250 కిలోల వరకు ఉంటుంది. ఈ కారు సింగిల్ సీటర్ మాత్రమే కావడం గమనార్హం. 2006లో ఏర్పాటైన ‘టీం చిమెరా’ అనే బృందం ఈ కారు తయారీని ప్రారంభించింది.
విద్యార్థి బృంద నాయకుడు శ్రీకేశ్ మాట్లాడుతూ ‘భవిష్యత్ అంతా విద్యుత్ వాహనాలదే. అందుకే హైబ్రీడ్ వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టాం. కళాశాల ప్రాంగణంలోనే విద్యార్థులు ఈ రేస్ కారును రూపొందించి అభివృద్ది చేశారు’ అని తెలిపారు. కార్ల రేస్‌లో పాల్గొనే డ్రైవర్ ప్రాణ రక్షణకు తాము ప్రథమ ప్రాధాన్యం ఇచ్చామని శ్రీకేశ్ పేర్కొన్నారు. క్రాష్, ఎలక్ట్రిక్ షార్ట్ షర్క్యూట్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.
ఈ కారు నిర్మాణానికి ప్రధాన స్పాన్సరర్ ఆర్వీ కాలేజీ ఇంజినీరింగ్. కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ షణ్ముఖ నాగరాజు మాట్లాడుతూ మూడు రోజుల పాటు సాగిన విద్యుత్ వాహనాల ప్రదర్శనలో తమ కారు అందరిని ఆకర్షించిందన్నారు.
దేశంలోనే ఒక ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు ఆటోమొబైల్ రంగంలో హైబ్రీడ్, విద్యుత్ టెక్నాలజీతో కారును తయారు చేయడం కూడా ఇదే మొదటిసారి నాగరాజు పేర్కొన్నారు. విద్యార్థులు తమ కాలేజీ పరిసరాల్లోనే దీన్ని డిజైన్ చేసి, నిర్మించారని ఆయన వివరించారు.
ఆర్వీ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం విద్యార్థి స్వాప్నిల్ సవర్ణ్ మాట్లాడుతూ వివిధ బ్యాచ్‌ల విద్యార్థులు ఈ ప్రాజెక్టులో పాల్గొన్నారు. ఒకవేళ ఎవరైనా పొరపాటు చేస్తే మిగతావారు గుణపాఠం నేర్చుకుని ముందుకు సాగేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నామని స్వాప్నిల్ సవర్ణ్ అన్నారు.
టీమ్ చిమెరా 2014లో అమెరికాలో జరిగిన ఫార్ములా హైబ్రీడ్ కాంపిటిషన్ మొదలు వివిధ రేస్‌ల్లో పాల్గొని ఆయా కార్ల డిజైన్లను సునిశితంగా పరిశీలించింది. 2015లో ఇటలీలో ఫార్ములా ఎలక్ట్రిక్ కాంపిటీషన్, 2016, 2017ల్లో జపాన్‌లో స్టూడెంట్ ఫార్ములా, 2018లో కోయంబత్తూరులో ఫార్ములా గ్రీన్ అండ్ ఫార్ములా భారత్ కాంపిటీషన్‌లోనూ చిమెరా టీం పాల్గొంది.
కాగా, ప్రధాన స్పాన్సరర్ ఆర్వీ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అయితే సాంకేతికంగా, ఆర్థికంగా సుమారు 10 ప్రైవేట్ కంపెనీలు కళాశాల విద్యార్థులకు మద్దతునిచ్చాయని ఫ్రొఫెసర్ షణ్ముఖ నాగరాజు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ రంగ పెట్రోలియం సంస్థ హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) కూడా ఒక భాగస్వామిగా ఉంది.
మూడు రోజుల విద్యుత్ వాహన ప్రదర్శనలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పాల్గొన్నాయి. ఇందులో ఈ-రిక్షాలు, ఈ-బైకులు, ఈ-స్కూటర్లు, ఈ- సైకిళ్లు సహా అధునాతన సాంకేతికత, పర్యావరణహిత ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను ప్రదర్శించారు.