మార్కెట్‌లో ఆవిష్కరించకముందే బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులు నెలకొల్పిన హ్యుండాయ్ మోటార్స్ సరికొత్త మోడల్ హ్యాచ్ బ్యాక్ ‘శాంత్రో’ కారు మంగళవారం కార్ల ప్రేమికుల ముందుకు రానున్నది.
మార్కెట్‌లో ఆవిష్కరించకముందే బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులు నెలకొల్పిన హ్యుండాయ్ మోటార్స్ సరికొత్త మోడల్ హ్యాచ్ బ్యాక్ ‘శాంత్రో’ కారు మంగళవారం కార్ల ప్రేమికుల ముందుకు రానున్నది. దాని ప్రారంభ ధర రూ.3.88 లక్షలుగా ఉంటుందని తెలుస్తోంది.
అంతేకాదు తొమ్మిది విభిన్న ఆకృతుల్లో న్యూ శాంత్రో కారు అందుబాటులోకి వస్తున్నది. హ్యుండాయ్ న్యూ శాంత్రో కార్ల కొనుగోలు కోసం కార్ల లవర్స్ రూ.11 వేలు చెల్లించి మరీ బుకింగ్ చేసుకున్నారు. నూతన తరం శాంత్రో కారు 17.64 సెంటీమీటర్ల (6.94 అంగుళాల) టచ్ స్క్రీన్ ఆడియో వీడియో సిస్టం కలిగి ఉంటుంది.
ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, మిర్రర్ లింక్, స్క్రీన్‌పై సపోర్టింగ్ వాయిస్ రికగ్నిషన్, రేర్ పార్కింగ్ కెమెరా డిస్ ప్లేతో కూడిన మల్టీ మీడియా సిస్టమ్ అమర్చారు. అంతేకాదు ఏసీ ఎవపొరేటర్ నుంచి చెడు వాసనలను నివారించేందుకు అవసరమైన ‘ఎకో కోటింగ్ టెక్నాలజీ’ పేటెంట్ న్యూ శాంత్రో సొంతం.
63 శాతం అధునాతన హై స్ట్రెంత్ స్టీల్ (ఎహెచ్ఎస్ఎస్) ప్లస్ హై స్ట్రెంత్ స్టీల్ (హెచ్ఎస్ఎస్)లతో నూతన శాంత్రో కార్లను తయారు చేశారు. ప్రయాణికుల భద్రతపై ఎటువంటి రాజీ లేకుండా డైనమిక్ ఎయిర్ బ్యాగ్ పని చేస్తుంది. అదనంగా స్టాండర్డ్ ఏబీఎస్, ఈబీడీలతో రూపొందించిన డ్రైవర్స్ ఎయిర్ బ్యాగ్ వినియోగదారులకు పూర్తి భద్రత కల్పిస్తుంది.
న్యూ శాంత్రో మోడల్ కార్లలో 4 సిలిండర్లతో 1.1. లీటర్ల పెట్రోల్ సామర్థ్యంగల ఇంజిన్ అమర్చారు. స్మార్ట్ ఆటో ఏఎంటీ టెక్నాలజీతో తొలిసారి డెవలప్ చేసిన ఇన్ హౌస్ హుండాయ్ మోడల్ కారు న్యూ శాంత్రో. మూడేళ్ల పాటు రోడ్ పై సహకారంతోపాటు మూడేళ్లు లేదా లక్ష కిలోమీటర్ల ప్రయాణం వరకు వారంటీని హ్యుండాయ్ న్యూ శాంత్రో కారు వినియోగదారులకు అందుబాటులోకి తెస్తోంది.