విదేశీ మారక ధరలు, రూపాయి మారకం, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు, వడ్డీరేట్లు, బీమా వ్యయం తదితర అంశాలన్నీ సెంటిమెంట్ ను బలహీన పరిచాయి. ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నికర లాభం 17.21 శాతం తగ్గింది. ఇది వరుసగా రెండో త్రైమాసికంలో లాభం తగ్గడం ఒక ఎత్తైతే.. ఐదేళ్లలో ఇంత భారీగా నికర లాభం తగ్గడం ఇదే మొదటిసారి.
న్యూడిల్లీ: దేశీయ ప్రయాణ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) ఆర్థిక ఫలితాలు నిరాశ పరిచాయి. వరుసగా రెండో త్రైమాసికంలోనూ నికర లాభంలో క్షీణత నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కంపెనీ రూ.1,489.3 కోట్ల నికర లాభం నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన రూ.1,799 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఇది 17.21 శాతం తక్కువ కావడం గమనార్హం.
ఐదేళ్లలో త్రైమాసికం ఫలితాల తగ్గుదల ఇదే ప్రథమం
గత ఐదేళ్లలో ఒక త్రైమాసికంలో ఈ స్థాయిలో లాభం తగ్గడం ఇదే ప్రథమం. పండగల సీజన్‌లో అంచనాల కంటే తక్కువ అమ్మకాలు నమోదు కావడం, అధిక ముడివస్తువుల ధరలు, ప్రతికూల విదేశీ మారక ధరలు లాభంపై ప్రభావం చూపాయని మారుతీ సుజుకీ తెలిపింది. ఇక మొత్తం ఆదాయం రూ.19,528.1 కోట్ల నుంచి నామమాత్రంగా 5.41 శాతం వృద్ధితో రూ.20,585.6 కోట్లకు చేరింది.
విక్రయాల్లోనూ క్షీణతే నమోదు
మారుతి సుజుకి డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో మొత్తం 4,28,643 వాహనాలు విక్రయించింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది 0.6 శాతం తక్కువ. అధిక మార్కెటింగ్, అమ్మకాల వ్యయాలు, అధిక వృద్ధి కోసం వనరులు, సామర్థ్యాలపై ఖర్చులు పెరగడం వంటివి ప్రతికూల ప్రభావం చూపాయని కంపెనీ పేర్కొంది. ఖర్చులు తగ్గించడం, ఉద్యోగులు, పంపిణీదారుల నుంచి సలహాలు తీసుకోవడం వంటి చర్యలు చేపట్టినట్లు వివరించింది. పండగల సీజన్ నేపథ్యంలో డీలర్ల వద్ద అదనంగా 90 వేల వాహనాలు నిల్వ ఉంచామని, అయితే అమ్మకాలు అంచనాలు అందుకోలేదని తెలిపింది.
ఎగుమతుల్లోనూ 8.5 శాతం తగ్గుదల
సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలోనూ కంపెనీ నికర లాభం 9.8 శాతం తగ్గి రూ.2,240.4 కోట్లకు చేరిన విషయం తెలిసిందే. 2013-14 నాలుగో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 35.46 శాతం తగ్గిన తర్వాత.. గత త్రైమాసికంలోనే లాభం ఎక్కువగా తగ్గింది. బలహీన మార్కెట్ పరిస్థితులు సైతం ప్రతికూల ప్రభావం చూపాయని మారుతీ తెలిపింది. ఇక ఎగుమతులు సైతం 8.5 శాతం తగ్గాయి.
బలహీన ఫలితాలతో 52 వారాల కనిష్ట స్థాయికి షేర్
బలహీన త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించిన నేపథ్యంలో మారుతీ సుజుకీ షేర్ కుదేలైంది. బీఎస్‌ఈలో అంతర్గత ట్రేడింగ్‌లో 8.77 శాతం కుప్పకూలిన షేర్.. రూ.6,420 వద్ద 52 వారాల కనిష్ఠానికి చేరింది. చివరకు 7.40 శాతం నష్టంతో రూ.6,516.35 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.15,739.06 కోట్లు ఆవిరై రూ.1,96,845.94 కోట్లకు చేరింది.