ప్రయాణికుల కార్ల తయారీ దిగ్గజం ‘మారుతి సుజుకి’ తన కార్ల విక్రయ ధరలను రూ.10 వేలు పెంచుతున్నట్లు తెలిపింది. న్యూ ఎర్టిగా మినహా అన్ని మోడళ్ల ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక టాటా మోటార్స్ అనుబంధ జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్) విక్రయాలు 2018లో మందగించాయి.
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ కార్ల ధరల పెరిగాయి. కొన్ని మోడల్ కార్ల ధరలు రూ.10 వేల దాకా పెంచుతున్నట్లు వెల్లడించింది. పెరిగిన ధరలు గురువారం నుంచే అమలవుతాయని తెలిపింది.
ముడి సరకు, విదేశీ మారకం రేట్ల పెరుగుదలతో ధరలు పెంచాల్సి వచ్చినట్లు పేర్కొంది. ఇటీవల విడుదల చేసిన కొత్త ఎర్టిగా మినహా మిగతా మోడళ్ల ధరలు పెరగడానికి అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
మారుతి సుజుకి మోడల్ కార్లివి..
మారుతీ సుజుకీ ఎంట్రీ లెవల్‌లో ఆల్టో 800 నుంచి ప్రీమియం క్రాసోవర్ ఎస్-క్రాస్ వరకు వివిధ మోడళ్లను విక్రయిస్తోంది. ఏయే మోడల్ కార్లపై ధరలు పెరుగుతాయనేది మారుతీ వెల్లడించలేదు.
ప్రస్తుతం మారుతీ సుజుకీ కార్ల మోడళ్లు ఆల్టో 800 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఆల్టో 800 నుంచి ప్రీమియం ఎస్-క్రాస్ మోడల్స్ ధరలు రూ.2.53 లక్షల నుంచి రూ.11.45 లక్షల దాకా ఉన్నాయి.
రోవర్ ఆబ్రాడ్ అమ్మకాల్లో 4.6% క్షీణత
టాటా మోటార్స్ అనుబంధ జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్‌ఆర్) 2018లో ప్రపంచవ్యాప్త విక్రయాల్లో క్షీణత రికార్డైంది. 2018లో మొత్తం 5,92,708 కార్లను విక్రయించింది. 2017తో పోలిస్తే అమ్మకాలు 4.6% తగ్గాయి.
2018లో జాగ్వార్ బ్రాండ్ వాహన అమ్మకాలు 2017తో పోల్చితే 1.2% పెరిగి 1,80,833 యూనిట్లకు చేరాయి. గతేడాది లాండ్ రోవర్ వాహనాల అమ్మకాలు మాత్రం 6.9 శాతం తగ్గి 4,11,875 యూనిట్లకు చేరుకున్నాయి.
ఇవీ విక్రయాల తగ్గుదలకు కారణాలు
‘చైనాలో ఆర్థిక మందగమనంతోపాటు వాణిజ్య పరమైన ఆందోళనల వల్ల వినియోగదారుడి విశ్వాసం ప్రభావితమైంది. ప్రపంచవ్యాప్తంగా అనేక పరివ్రమలపై ప్రభావం పడింది’అని జెఎల్‌ఆర్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ఫెలిక్స్ బ్రౌటిగమ్ తెలిపారు.
అమ్మకాలను పెంచుకునేందుకు రిటైలర్లతో కలిసి పని చేస్తున్నామని చెప్పారు. గత డిసెంబర్ నెల విక్రయాల్లో జెఎల్‌ఆర్ మొత్తం అమ్మకాలు 52,160 యూనిట్లుగా ఉన్నాయి. అంతకు ముందు ఏడాది ఇదే నెలతో పోల్చితే అమ్మకాలు 6.4 శాతం తగ్గాయి.
4,500 ఉద్యోగాల కోత!
చైనాలో అమ్మకాలు తగ్గడం, బ్రెగ్జిట్ భయాలు తదితర ప్రతికూల అంశాలతో 4,500 వరకూ ఉద్యోగాలను తొలగించడానికి జాగ్వార్ లాండ్ రోవర్ సిద్ధమవుతోంది. ఈ కంపెనీలో 40వేల మందికి పైగా పని చేస్తున్నారు. 320 కోట్ల డాలర్లు ఆదా చేసే కార్యక్రమంలో భాగంగా ఉద్యోగులను కంపెనీ తొలగిస్తున్నట్లు తెలుస్తోంది.