నవీకరణపై ఫోకస్: మారుతి నుంచి రెండు కొత్త మోడళ్లు

By sivanagaprasad kodati  |  First Published Jan 8, 2019, 8:24 AM IST

దేశంలోకెల్లా అతిపెద్ద ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండు మోడళ్ల కార్లను మార్కెట్లోకి తేనున్నది. ఇప్పటికే ప్రజాదరణ పొందిన మోడల్ కార్లను నవీకరించడం ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి తేనున్నది. 


వచ్చే ఆర్థిక సంవత్సరం (2019-20)లో దేశీయ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) రెండు కొత్త మోడళ్లను విడుదల చేయనున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు మోడళ్లను విడుదల చేసిన సంస్థ.. ప్రస్తుత పోర్ట్‌ఫోలియోలోని మోడళ్ల నవీకరణపై దృష్టి పెట్టింది. కొత్త భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్‌ బెల్ట్‌ రిమైండర్‌, రివర్స్‌ పార్కింగ్‌ సెన్సార్‌లు వంటి వాటిని ఏర్పాటు చేయనుంది.

ఇక ప్రస్తుత త్రైమాసికంలో ఒక కారును విపణిలోకి ప్రవేశపెట్టనున్నట్లు మారుతి సుజుకి కంపెనీ ఛైర్మన్‌ ఆర్సీ భార్గవ తెలిపారు. బహుళ ప్రాచుర్యం పొందిన కంపెనీ కాంపాక్ట్‌ కారు వ్యాగన్‌ఆర్‌ కొత్త వెర్షన్‌ను కంపెనీ ఈ నెలాఖరులో విడుదల చేయొచ్చని తెలుస్తోంది.

Latest Videos

2018-19లో కంపెనీ ఎంపీవీ ఎర్టిగా, సెడాన్‌ సియాజ్‌ల్లో కొత్త వేరియంట్‌లను తీసుకొచ్చింది. గతేడాది ఫిబ్రవరిలో కొత్త స్విఫ్ట్‌ను సైతం విడుదల చేసింది. మారుతి సుజుకి కొత్తగా విడుదల చేయనున్న మోడళ్లలో ఒకటి కంపెనీ ప్రీమియం నెక్సాలో, మరోకటి ఎరీనా విక్రయశాలల్లో విక్రయించే అవకాశం ఉంది.

కొత్త మోడళ్ల విడుదలతో 2019 అమ్మకాలు ఆశావహంగా ఉంటాయని భావిస్తున్నట్లు మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ చెప్పారు. సాధారణంగానే ఎన్నికల ఏడాదిలో అమ్మకాలు అధికంగా ఉంటాయని మారుతి సుజుకి చైర్మన్ ఆర్సీ భార్గవ గుర్తు చేశారు.

జూన్‌ నాటికి కొత్త భద్రతా ఫీచర్లను ప్రవేశపెట్టనున్నట్లు ఎంఎస్‌ఐ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఇంజినీరింగ్‌) సీవీ రామన్‌ తెలిపారు. ఇప్పటికే ఏడు మోడళ్లను సిద్ధం చేశామని, మిగతా వాటిపై పనిచేస్తున్నామని అన్నారు.

click me!