ఇక హోండా ఎంట్రీ లెవెల్ కారు ‘అమేజ్’..బ్రియోకు రాంరాం

By Siva Kodati  |  First Published Feb 11, 2019, 9:12 AM IST

భారత మార్కెట్లో వినియోగదారుల ఆకాంక్షలు మారిపోవడంతో బ్రియో ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు హోండా కార్స్ ప్రకటించింది. దీనిస్థానంలో న్యూ అమేజ్ మోడల్ తమ ఎంట్రీ లెవెల్ కారుగా మారనున్నదని తెలిపింది. గతేడాది అమేజ్ మోడల్ కార్లే భారీగా అమ్ముడు పోవడమే దీనికి కారణం. 
 


జపాన్‌ కార్ల తయారీ సంస్థ హోండా.. భారత్‌లో తన ఎంట్రీ లెవల్‌ హ్యాచ్‌బ్యాక్‌ మోడల్ కారు బ్రియో ఉత్పత్తిని నిలిపివేసింది. 2011 సెప్టెంబర్ నెలలో ఈ కారును కంపెనీ భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పటి వరకు 97,000 కార్లను విక్రయించింది. గత నెలలో కేవలం రెండు బ్రియో కార్లు మాత్రమే అమ్ముడు పోయాయి. 

నాటి నుంచి ఇప్పటి వరకు ఏడేళ్ల పాటు భారతదేశ రహదారులపై హోండా బ్రియో కార్లు చక్కర్లు కొట్టాయి. బ్రియో ఉత్పత్తిని నిలిపివేయడంలో హోండా ఎంట్రీలెవల్‌ కారుగా అమేజ్‌ మారనుంది.  భారత్‌లో ఉత్పత్తి చేసిన ఈ కారుకు అంతగా డిమాండ్ లేకపోవడం వల్లనే సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.

Latest Videos

‘బ్రియో ఉత్పత్తిని నిలిపివేశాం. భావితరం బ్రియోను తీసుకువచ్చే ఆలోచన లేదు. ఇప్పుడు మా కంపెనీ ఎంట్రీ లెవల్‌ కారు అమేజ్‌’ అని హోండా కార్స్‌ ఇండియా సేల్స్‌, మార్కెటింగ్‌ విభాగం సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, డైరెక్టర్‌ రాజేష్‌ గోయల్‌ తెలిపారు. కంపెనీకి చెందిన కాంప్యాక్ట్ సెడాన్ అమేజ్ అమ్మకాలు టాప్‌గేర్‌లో దూసుకుపోతుండటం ఇదే ఎంట్రిలెవల్‌గా మారడంతో బ్రియో ఉత్పత్తిని నిలిపివేసినట్లు చెప్పారు. 

గతేడాది దేశవ్యాప్తంగా సెడాన్ కార్లు అత్యధికంగా అమ్ముడయ్యాయని, ఇతర దేశాలతోపోలిస్తే భారత్‌లో కార్ల మార్పిడి వేగవంతంగా జరుగుతున్నదని హోండా కార్స్‌ ఇండియా సేల్స్‌, మార్కెటింగ్‌ విభాగం సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, డైరెక్టర్‌ రాజేష్‌ గోయల్‌ అభిప్రాయపడ్డారు. గతంలో ఆరు నుంచి ఏడేండ్లలో కారును మార్చేవారు, కానీ ప్రస్తుతం మూడు నుంచి నాలుగేండ్లకు మించి ఉంచుకోవడం లేదని ఆయన చెప్పారు.

జాజ్‌, డబ్ల్యూఆర్‌-వీ మోడళ్లు చిన్న కార్ల అవసరాలను తీరుస్తాయని హోండా కార్స్‌ ఇండియా సేల్స్‌, మార్కెటింగ్‌ విభాగం సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, డైరెక్టర్‌ రాజేష్‌ గోయల్‌ పేర్కొన్నారు. పెద్ద మోడళ్ల వైపు కస్టమర్ల ప్రాధాన్యం మారుతోందన్నారు.

భారతదేశంలోనూ అంతర్జాతీయ మార్కెట్లలో మాదిరిగా పెద్ద కార్ల వైపు సానుకూల ప్రాధాన్యం పెరుగుతున్నదని హోండా కార్స్‌ ఇండియా సేల్స్‌, మార్కెటింగ్‌ విభాగం సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, డైరెక్టర్‌ రాజేష్‌ గోయల్‌ చెప్పారు.

ఇదిలా ఉంటే కస్టమర్ల నుంచి పెద్దగా ఆదరణ లేకపోవడంతో 2017లో మల్టీ పర్పస్‌ వెహికిల్‌ (ఎంపీవీ) మొబిలియో ఉత్పత్తిని హోండా నిలిపివేసింది. 2014 జూలైలో మార్కెట్లోకి తెచ్చి 40,789 మొబిలియోలను కంపెనీ విక్రయించింది.

గతేడాది నవంబర్‌లోనే బ్రియో మోడల్ కార్ల ఉత్పత్తిని హోండా కార్స్ నిలిపివేయనున్నదని తొలిసారి వార్తలొచ్చాయి. కానీ అధికారిక స్పందనేది లేదు. ఆదివారం తొలిసారి అధికారికంగా హోండా కార్స్ యాజమాన్యం భారత మార్కెట్లో బ్రియో మోడల్ కారు నిలిపివేస్తున్నామని తెలిపింది. గతేడాదే థాయిలాండ్‌లో న్యూ జనరేషన్ బ్రియో మోడల్ కారును ఆవిష్కరించింది.

click me!