వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య వైరం.. రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి చేరుతున్నాయి. వైసీపీని ఢీకొట్టడానికి జగన్ పైకి ఆయన చెల్లి షర్మిలను కాంగ్రెస్ పార్టీ అస్త్రంగా మలుచుకుంటున్నది. ఇంతకీ ఈ అన్నా, చెల్లి మధ్య వైరం ఎందుకు మొదలైంది? ఆస్తుల్లోనే కాదు, రాజకీయ వారసత్వంలోనూ వాటా అడిగినందుకు వీరి మధ్య విభేదాలు తలెత్తాయనేది రాజకీయ విశ్లేషకుల మాట.
AP News: అందరూ ఊహిస్తున్నట్టుగానే ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఆమె ఒక వైపు కొడుకు వైఎస్ రాజారెడ్డి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నా.. కాంగ్రెస్ హైకమాండ్ ఆమెకు ఏపీ పీసీసీ బాధ్యతలు అప్పగించే ప్రక్రియను ఆపలేదు. ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజుతో రాజీనామా చేయించి ఆమెకు ఈ బాధ్యతలు అప్పగించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందనీ స్పష్టం చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం మొదలైంది. అన్న జగన్, చెల్లి షర్మిల మధ్య వైరం రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి చేరే దశకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇంతకీ వీరిద్దరి మధ్య విభేదాలు ఎందుకు తలెత్తాయి? ఇప్పటి వరకు అన్న జగన్‌ను నేరుగా విమర్శించని షర్మిల పార్టీ కోసం నోరెత్తుతుందా? అనే సంశయాలు వస్తున్నాయి.
స్థూలంగా అర్థం చేసుకుంటే ఇటు జగన్, అటు షర్మిల వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసత్వం కోసం పోరాడుతున్నారు. ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమైన కాంగ్రెస్ నేతగా ఎదిగారు. ఒక దశలో కాంగ్రెస్ హైకమాండ్‌ను కూడా కంట్రోల్ చేసే స్థాయికి రాజశేఖర్ చేరారని చెప్పుకునేవారు. రెండో సారి సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో 2009లో మరణించారు. ఆ తర్వాత వైఎస్ జగన్ రాజకీయ అరంగేట్రం చేశారు.
Also Read: Explained: మన బలగాలను మాల్దీవులు ఎందుకు వెనక్కి పంపించాలని అనుకుంటున్నది? చైనా పాత్ర ఏమిటీ?
రాష్ట్రవ్యాప్తంగా ఓదార్పు యాత్ర చేశారు. ఈ యాత్ర జగన్ ఇమేజ్ బ్రాండింగ్‌కు ఉపకరించింది. సీఎం కావాలనే ఆలోచనలతో ఉన్న జగన్‌ను కాంగ్రెస్ నిరాకరించింది. ఆయన యాత్రలను నిలిపేయాలని ఆదేశించింది. కానీ, జగన్ అంగీకరించలేదు. 2011లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. కానీ, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2012-13లో ఆయన జైలుపాలయ్యారు. అప్పుడు అన్న జగన్ కోసం శర్మిల రాజకీయ క్షేత్రంలో అడుగుపెట్టారు. సుమారు 3,100 కిలోమీటర్లు ఆమె కూడా పాదయాత్ర చేశారు. తాను జగన్ అన్న వదిలిన బాణాన్ని అని అప్పుడే చెప్పారు. జగన్ జైలులో ఉండగా షర్మిల ప్రచారం చేసిన ఉపఎన్నికల్లో 18 అసెంబ్లీ స్థానాల్లో 15 స్థానాలను వైసీపీ గెలుచుకుంది. జగన్ జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా 2019లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీపై వైసీపీ గెలవడంలో షర్మిల కీలక పాత్ర పోషించారు.
Also Read: Rahul Gandhi: రాహుల్ గాంధీతోపాటు ఆ బస్‌లో ప్రయాణించాలనుకుంటున్నారా? ఇలా ప్రయత్నించండి
అప్పటికే జగన్, షర్మిల మధ్య ఆస్తుల విషయంలో విభేదాలు పొడసూపాయి. రాజశేఖర్ రెడ్డి కొడుకు, కూతురును సమానంగా చూసేవాడని టాక్. కానీ, ఆస్తుల పంపకం చేయకుండానే మరణించారు. ఆ తర్వాత ఈ విషయంలో వీరిద్దరి మధ్య వైరం మొదలైంది. ముఖ్యంగా సాక్షి, భారత సిమెంట్‌లోనూ వాటా కావాలని షర్మిల డిమాండ్ చేసిందని, దీంతో ఆ రెండింటి బాధ్యతలు చూస్తున్న భారతితోనూ ఆమెకు దూరం పెరిగిందనే చర్చ జరిగింది.
ఆస్తుల్లోనే కాదు.. రాజకీయ వారసత్వం కూడా షర్మిల కావాలని అనుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ స్థానాన్ని ఆశించి భంగపడ్డారు. ఆ తర్వాత క్రమంగా అన్నా చెల్లి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. తొలుత తటస్థంగా వ్యవహరించి ఇద్దరినీ కలిపే ఉంచాలని అనుకున్న తల్లి విజయమ్మ.. చివరకు కూతురు వైపు మొగ్గినట్టు చెబుతారు.
వైఎస్ జగన్ కోసం మొదలైన ఆమె పాదయాత్రతోనే షర్మిలకు కూడా రాజకీయ కాంక్ష మొదలైందని చర్చిస్తుంటారు. అప్పటి నుంచి ఆమె రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర కోసం పోషించాలని అనుకున్నా ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చినా.. ఆమెకు సరైన ప్రాధాన్యత దక్కలేదు. దీంతో ఆమె కూడా అన్న జగన్‌కు, వైసీపీకి దూరం అయ్యారు. అయితే, ఏపీలో కాకుండా తెలంగాణలో ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. 2021లో ఇక్కడ వైఎస్సార్టీపీ స్థాపించి పాదయాత్ర చేశారు. అన్న జగన్ సన్నిహితంగా ఉండే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీలపై ఆమె ప్రధానంగా విరుచుకుపడ్డారు. కానీ, కాంగ్రెస్‌తో ఆమెకు అనూహ్యమైన ఈక్వేషన్ సెట్ అయింది. మళ్లీ ఏపీలో లాంచ్ అయ్యారు. అయితే, జగన్ పై ఆమె నేరుగా, బహిరంగంగా ఎక్కడా విమర్శలు చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ బాధ్యతలు ఎత్తుకుంటున్న షర్మిల ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అన్న జగన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తారా? తండ్రి రాజశేఖర్ రెడ్డి తరహాలోనే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తారా? అనేది వేచి చూడాల్సిందే.