Asianet News TeluguAsianet News Telugu

కెసిఆర్ కు ఆర్టీసీ కార్మికుల ఉసురు తగిలి తీరుతుంది: ఉత్తమ్

ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేసారు. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యాయత్నానికి కెసిఆర్ దే బాధ్యత అని తెలిపారు. కార్మికుల ఆకలి కేకలు కెసిఆర్ కు వినిపించడం లేదా అంటూ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.

kcr will pay the price for the agony caused to rtc employees
Author
Hyderabad, First Published Oct 13, 2019, 7:22 AM IST

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు తొందరపడి ఆత్మహత్యలకు పాల్పడవద్దని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేసారు. సమస్యలపై పోరాటం చేయాలి తప్ప ఇలా సమస్యలకు లొంగిపోయి ఆత్మహత్యల వంటి విపరీత చర్యలకు దిగొద్దని ఆయన సూచించారు. 

ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేసారు. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యాయత్నానికి కెసిఆర్ దే బాధ్యత అని తెలిపారు. కార్మికుల ఆకలి కేకలు కెసిఆర్ కు వినిపించడం లేదా అంటూ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. కార్మికుల ఉసురు, వారి కుటుంబాల ఉసురు కెసిఆర్ కు ఖచ్చితంగా తగిలి తీరుతుందని ఉత్తమ్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఇలా ఆత్మహత్యలు చేసుకోవడానికి కాదని అన్నారు. కెసిఆర్ అసమర్థ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని అన్నారు. నిన్న శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ ఉత్తమ్ ఈ వ్యాఖ్యలు చేసాడు. 

తెలంగాణ లో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె వల్ల తెలంగాణ వ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వానికి ఆర్టీసీ యూనియన్లకు మధ్య ఒక మహా యుద్ధమే నడుస్తున్నా విషయం తెలిసిందే. 

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్ తో పాటు మరో 26 డిమాండ్లపై ఆర్టీసీ జేఎసి నేతలు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. విధుల్లోకి రాకపోతే డిస్మిస్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం చెప్పినట్టుగానే దాదాపు 48వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్టు ప్రకటించింది. 

ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా రాపర్తి నగర్ కు చెందిన డ్రైవర్ భీంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దాదాపు 90శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.    

Follow Us:
Download App:
  • android
  • ios