Asianet News TeluguAsianet News Telugu

ఇంటర్ విద్యార్థుల ఉసురు పోసుకుంది ఈ సంస్థేనా?: గత చరిత్ర ఇదీ..

విద్యార్థుల హాల్ టికెట్ల పంపిణీ నుంచి ఫలితాల ప్రాసెసింగ్ వరకు గ్లోబెరినా సంస్థ నేతృత్వంలోనే జరిగింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఆ సంస్థ ప్రభుత్వ గుర్తింపు పొందింది కాబట్టి కాంట్రాక్టు ఇచ్చామని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్ అంటున్నారు. 

Errors in Inter results: Globerina is blamed
Author
Hyderabad, First Published Apr 22, 2019, 1:35 PM IST

హైదరాబాద్: ఇంటర్మీడియట్ విద్యార్థుల ఉసురు పోసుకుంది గ్లోబెరినా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ అనే విమర్శలు వినిపిస్తున్నాయి. తప్పులు జరిగిన మాట వాస్తవమేనని ఓ ప్రముఖ టీవీ చానెల్ స్టింగ్ ఆపరేషన్ లో ఆ సంస్థ ప్రతినిధి అంగీకరించారు. గ్లోబెరినా టెక్నాలజీస్ అనేది లెర్నింగ్ అండ్ అసెస్ మెంట్ సంస్థ. 

విద్యార్థుల హాల్ టికెట్ల పంపిణీ నుంచి ఫలితాల ప్రాసెసింగ్ వరకు గ్లోబెరినా సంస్థ నేతృత్వంలోనే జరిగింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఆ సంస్థ ప్రభుత్వ గుర్తింపు పొందింది కాబట్టి కాంట్రాక్టు ఇచ్చామని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్ అంటున్నారు. 

పరీక్షకు గైర్హాజరు అయినవారు పాసైనట్లుగా కూడా మెమోలు వచ్చాయి. ఎక్కువ మంది విద్యార్థులు లెక్కల్లో తప్పినట్లు మార్కుల మెమోలు చూపిస్తున్నాయి. మొత్తం మీద ప్రాసెసింగ్ లో భారీగా తప్పులు జరిగినట్లు మాత్రం అర్థమవుతోంది. ఈ తప్పులకు ఎవరు బాధ్యత వహిస్తారనేది తెలియదు. 

అయితే, గ్లోబెరినా సంస్థకు అంత మంచి పేరేమీ లేదు. గత చరిత్ర చూస్తే ఓ కుంభకోణంలో ఆ సంస్థ పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. అది కాకినాడ జెఎన్ టీయూ కుంభకోణం రూపంలో 2015 జూన్ లో బయటపడింది. జెఎన్ టీయూలో ఈ కంటెంట్, ఈ లెర్నింగ్ ను అభివృద్ధి చేయడానికి గ్లోబెరినా సంస్థ 2013లో ఒప్పందం కుదుర్చుకుంది. జెఎన్ టీయూ విసిగా తులసీరాం దాస్ ఉన్న సమయంలో ఈ ఒప్పందం జరిగింది.  నిజానికి, ఒకే టెండర్ విధానం ద్వారా ఈ ఒప్పందం కుదిరింది.

ఈ కుంభకోణంలో 26 కోట్ల రూపాయలకు పైగా అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత కాకినాడ జెఎన్ టీయూ వీసీగా విఎస్ఎస్ కుమార్ పదవీబాధ్యతలను స్వీకరించిన తర్వాత ఆ ఒప్పందాన్ని రద్దు చేశారు. సంస్థపై అప్పటి రిజిస్ట్రార్ సుబ్బారావు సర్పవరం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. 

జెఎన్ టీయూ కుంభకోణంపై సిపిఐ అప్పటి కార్యదర్శి నారాయణ గవర్నర్ నరసింహన్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలోనే కుంభకోణంపై విచారణకు గవర్నర్ ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని కూడా వేశారు. ఆ కంపెనీ మాజీ వైస్ చాన్సలర్ సోదరుడికి సంబంధించిందని నారాయణ ఆరోపించారు కూడా. అటువంటి సంస్థ చేతిలో తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థుల భవిష్యత్తును పెట్టింది. 

సంబంధిత వార్త

ఇంటర్ బోర్డు నిర్వాకం: అధికారులపైకి నెట్టేసి..., ఒక్కటే ప్రశ్న...

Follow Us:
Download App:
  • android
  • ios