Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు అరెస్ట్, టీడీపీ-జనసేన పొత్తు.. ఏపీలో బీజేపీకి విచిత్రమైన పరిస్థితి..!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం ఉన్నప్పటికీ రాజకీయ వేడి ఓ రేంజ్‌లొ ఉంది.

AP BJP in a bind after Chandrababu arrest and Janasena-TDP alliance announcement ksm
Author
First Published Oct 8, 2023, 12:44 PM IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం ఉన్నప్పటికీ రాజకీయ వేడి ఓ రేంజ్‌లొ ఉంది. టీడీపీ-జనసేన పొత్తుపై అధికార ప్రకటన చేసిన పవన్ కల్యాణ్.. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే రోజురోజుకు ఆ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తుంది. అయితే ఎన్డీయే నుంచి బయటకు రాలేదని జనసేన చెబుతున్నప్పటికీ.. బీజేపీ హైకమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన వెలువడటం లేదు.  పవన్ కూడా రానున్న ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమిదే అధికారమనే ప్రకటన చేస్తున్నారు. పవన్ కూడా టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ కలిసి వస్తుందని పెద్దగా ఆశలు పెట్టుకోలేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. 

గత కొంతకాలంగా జనసేన-బీజేపీ పొత్తులో ఉండగా.. ఇరు పార్టీలు ఉమ్మడిగా పనిచేసిన దాఖలు లేవనే చెప్పాలి. అయితే తాజాగా టీడీపీ-జనసేన పొత్తు ప్రకటన తర్వాత క్షేత్రస్థాయిలో ఆ రెండు పార్టీల నేతలు ఏకతాటికి పైకి రావడం కనిపిస్తుంది. మరోవైపు ఈ పరిణామాలు రాష్ట్రంలోని బీజేపీ నాయకులకు ఇబ్బందికరంగా మారాయి. బీజేపీ అధిష్టానం ఈ పరిణామాలపై దృష్టి సారించకపోవడంతో.. టీడీపీ, జనసేన కూటమిలో బీజేపీ ఉంటుందో లేదోననే విషయంపై ఇప్పట్లో క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. 

దీంతో రాష్ట్ర బీజేపీ నేతలు ఏ వైఖరితో ముందుకు వెళ్లాలనేది అర్థం కాక.. ఇరకాటంలో పడిపోయారు. అయితే పొత్తుల విషయంలో బీజేపీ హైకమాండ్‌దే తుది నిర్ణయమని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితో పాటు పలువురు సీనియర్ నేతలు చెబుతున్నారు. అయితే పదే పదే ఇదే మాట చెబుతుండంతో.. బీజేపీ తీరు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

మరోవైపు ఇటీవల పురందేశ్వరి నేతృత్వంలోని ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన, టీడీపీ కూటమితో కలిసి వెళ్లేందుకు కొందరు అనుకూలంగా మాట్లాడగా.. మరో వర్గం మాత్రం ఆ చర్చను తీవ్రంగా వ్యతిరేకించినట్టుగా తెలుస్తోంది. అయితే రాష్ట్రంలోని బీజేపీ నాయకుల్లో కొందరు టీడీపీకి అనుకూల వైఖరితో, మరికొందరు వైసీపీకి అనుకూల వైఖరితో, అతి కొద్ది మంది మాత్రమే  న్యూట్రల్‌గా ఉండటమే.. ఈ పరిస్థితికి కారణమనే విశ్లేషణలువినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే జాతీయ నాయకత్వం స్పష్టమైన రోడ్‌మ్యాప్ ఇచ్చే వరకు పొత్తులపై స్పందించవద్దని పురంధేశ్వరి నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. 

చంద్రబాబు అరెస్ట్‌ నేపథ్యంలో బీజేపీపై ఆరోపణలు.. 
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను అధికార వైసీపీ సమర్ధిస్తుండగా.. రాష్ట్రంలో బీజేపీ మినహా ఇతర రాజకీయ పక్షాలు అన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాయి. చంద్రబాబు అరెస్ట్‌ను రాష్ట్ర బీజేపీ నాయకులు తొలుత ఖండించారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానాన్ని వారు తప్పుబట్టారు. అయితే ఆ తర్వాత ఈ విషయంపై పెద్దగా మాట్లాడలేదు. చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ చేపట్టిన నిరసనలపై కూడా మౌనం వహించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అరెస్ట్ వెనక బీజేపీ హస్తం కూడా ఉందని కొందరు నాయకులు ఆరోపణలు చేయడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మోదీ, అమిత్ షా అండతోనే జగన్.. చంద్రబాబును అరెస్ట్ చేయించారని వారు ఆరోపించారు. 

మరోవైపు చంద్రబాబు దాదాపు నెల రోజులుగా జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉండటం, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌తో పాటుగా పలువురు నేతలపై వరుసగా కేసులు నమోదు అవుతుండటం.. వాటిపై బీజేపీ నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో టీడీపీ కార్యకర్తలు కూడా ఈ పరిణామాలకు వైసీపీతో పాటు బీజేపీ నిందించడం ప్రారంభించారు. మరోవైపు పురందేశ్వరిపై వైసీపీ విమర్శలు చేస్తున్న.. ఏపీ బీజేపీలోని ముఖ్య నాయకులు చాలా మంది వాటిని ఖండించేందుకు ముందుకు రావడం లేదని ఆ పార్టీ వర్గాల్లోనే చర్చ సాగుతుంది. 

ఈ నేపథ్యంలోనే ఏపీలో తాజా పరిణామాలు రాష్ట్రంలోని బీజేపీకి ఇబ్బంది కలిగించేవిగా మారుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి సరైన దిశానిర్దేశం లేకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నట్టుగా కొందరు నేతలు ఆఫ్ ది రికార్డుగా పేర్కొంటున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలతో ఏపీలో బీజేపీకి నష్టం జరుగుతుందని ఆ పార్టీకి చెందిన కొందరు సీనియర్ నేతలే వ్యాఖ్యానించడం చూస్తే.. ఆ పార్టీలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఈ పరిణామాలపై ఏ విధమైన వ్యూహంతో ముందుకుకెళ్తుందోననే  ఉత్కంఠ కూడా ఏపీ రాజకీయాల్లో నెలకొంది.

Follow Us:
Download App:
  • android
  • ios