Asianet News TeluguAsianet News Telugu

తరముకొస్తున్న ఫణి: ఏపీ, తమిళనాడుకు పొంచివున్న ముప్పు

హిందూ మహా సముద్రానికి అనుకోని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ‘‘ఫణి’’ తుఫాను కోస్తాను భయపెడుతోంది. గురువారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం కొద్దిగంటల్లోనే తీవ్ర అల్పపీడనంగా మారింది

red alert for coastal ap and tamilnadu as cyclone fani approaches
Author
Chennai, First Published Apr 26, 2019, 7:33 AM IST

హిందూ మహా సముద్రానికి అనుకోని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ‘‘ఫణి’’ తుఫాను కోస్తాను భయపెడుతోంది. గురువారం ఉదయం ఏర్పడిన అల్పపీడనం కొద్దిగంటల్లోనే తీవ్ర అల్పపీడనంగా మారింది.

దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. ఈ నేపథ్యంలో తీవ్ర అల్పపీడనం శుక్రవారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది.

అనంతరం శనివారం నాటికి తుఫానుగా మారనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది 72 గంటల తర్వాత శ్రీలంక తూర్పు తీర ప్రాంతం వెంబడి వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 30న తమిళనాడు-దక్షిణ కోస్తాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

దీని ప్రభావంతో తమిళనాడు, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, అక్కడక్కడా పిడుగులు పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.

తుఫాను తీరం దాటే సమయంలో పెనుగాలులు వీస్తూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. వాయుగుండం, తుఫాను నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. ఈ సమయంలో చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఈ నెల 30 వరకు సముద్రంలోకి వెళ్లకపోవడమే మంచిదని తెలిపింది. ఈ తుఫానుకు ‘‘ఫణి’’ అనే పేరును పెట్టారు. దీనిని బంగ్లాదేశ్ సూచించింది.  

Follow Us:
Download App:
  • android
  • ios