Asianet News TeluguAsianet News Telugu

అసలు పెళ్లికొడుకు ఎవరు..?: ప్రతిపక్ష కూటమి ప్రధాని అభ్యర్థిపై బిజెపి సెటైరికల్ వీడియో వైరల్

ఎన్నికల ప్రచారానికి కాదేదీ అనర్హం అంటున్నాయి రాజకీయ పార్టీలు. ఇలా బిజెపి ప్రతిపక్ష ఇండి కూటమిలో అనైక్యతను తెలియజేస్తూ ఓ సెటైరికల్ వీడియోను రూపొందించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 

BJP satirical video  dulha kaun hai goes viral AKP
Author
First Published Apr 22, 2024, 12:55 PM IST

న్యూడిల్లీ : ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. మొత్తం ఏడు విడతల్లో 543 లోక్ సభ స్థానాలను ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో మునిగిపోయాయి. బిజెపి నేతృత్వంలోనే ఎన్డీఏ కూటమి మళ్ళీ గెలిస్తే ముచ్చటగా మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాని అవుతారు. మరి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఇండి కూటమి పరిస్థితి ఏమిటి? కూటమి  ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ఇంతవరకు క్లారిటీ లేదు. దీన్నే ఇప్పుడు బిజెపి ప్రచార అస్త్రంగా మార్చుకుంటోంది. 

ప్రతిపక్ష కూటమిలో అసలు ఐక్యతే లేదని ... కేవలం ప్రధాని పదవికోసమే అందరూ ఒక్కటయ్యారు అనేలా బిజెపి యాడ్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 'దుల్హా కౌన్ హై' (పెళ్లికొడుకు ఎవరు) అంటూ ప్రతిపక్ష ఇండి కూటమిపై సెటైరికల్ వీడియోను రూపొందించింది బిజెపి. పెళ్లి కొడుకు (ప్రధాని అభ్యర్థి) ఎవరో తేలకుండానే పెళ్లికి (ఎన్నికలకు) సిద్దం అయ్యారంటూ ప్రతిపక్ష కూటమిపై రూపొందించిన వీడియో రాజకీయ దుమారం రేపుతోంది. 

దుల్హా కౌన్ హై (పెళ్ళి కొడుకు ఎవరు)? 

పెళ్లి చూపుల సీన్ తో వీడియో ప్రారంభం అవుతుంది. ఓవైపు పెళ్లికూతురు, కుటుంబసభ్యులు కూర్చోగా మరోవైపు ప్రతిపక్ష కూటమిలోకి కీలక నాయకులను పోలినవారు కూర్చుంటారు. రాహుల్ గాంధీని పోలిన వ్యక్తి ముందు కూర్చుని వుండగా మిగతావారు వెనకాల కూర్చుంటారు. వీళ్లంతా ఎవరని పెళ్లికూతురు అడగ్గా వారిని పరిచయం చేస్తాడు. 

'వీళ్లంతా వ్యాపార భాగస్వాములు. దీదీ బెంగాల్ లో, చాచా బీహార్ లో, వీళ్లు యూపీ, ముంబై, చెన్నైలో బిజినెస్ చూసుకుంటారు. ఈయన ఇటీవలే డిల్లీలో దుకాణం తెరిచాడు. దేశ వ్యాప్తంగా మా బిజినెస్ విస్తరించి వుంది. అందరం సంపాదిస్తాం... తింటాం'' అంటూ రాహుల్ గాంధీని పోలిన వ్యక్తి పరిచయం చేస్తాడు. ఇందులో మమతా బెనర్జీ,  అరవింద్ కేజ్రీవాల్, లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్, అఖిలేష్ యాదవ్ ను పోలీన పాత్రలను చూపించారు. 

అమ్మాయి తరపువారు పెళ్లి కొడుకు ఎవరు? అని అడగడంతో అసలు కథ ప్రారంభమవుతుంది. అందరూ నేనంటే నేను పెళ్లికొడుకును అంటూ గొడవపడుతుంటారు. ఇలా ప్రతిపక్ష ఇండి కూటమిపై సెటైర్లు వేస్తూ రూపొందించిన బిజెపి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

 


 
 

Follow Us:
Download App:
  • android
  • ios