Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ నిజాం ఆస్తుల కేసు: పాకిస్తాన్ కు బ్రిటన్ కోర్టు షాక్

హైదరాబాద్ నిజాం ఆస్తులకు చెందిన కేసులో పాకిస్తాన్ కు బ్రిటన్ కోర్టులో చుక్కెదురైంది. దాదాపు 300 కోట్ల రూపాయల విలువ చేసే నిధులు తమకే చెందుతాయంటూ పాకిస్తాన్ వాదిస్తూ వస్తోంది. అయితే, అవి భారత్ కే చెందుతాయని కోర్టు స్పష్టం చేసింది.

Pakistan Loses UK Court Battle For Hyderabad Nizam's 35 Million Pounds
Author
London, First Published Oct 2, 2019, 9:33 PM IST

లండన్: హైదరాబాద్ నిజాం ఆస్తులకు సంబంధించిన కేసులో పాకిస్తాన్ కు బ్రిటన్ కోర్టులో చుక్కెదురైంది. అంతర్జాతీయ వేదికపై భారత్ కు మరో ఘన విజయం లభించింది. హైదరాబాద్ నిజాంకు చెందిన 35 మిలియన్ బ్రిటిష్ పౌండ్ల (రూ.300 కోట్ల) విలువైన ఆస్తులపై భారత్ వాదనను బ్రిటన్ హైకోర్టు బుధవారం సమర్థించింది.

70 ఏళ్ల క్రితం కేసులో పాకిస్తాన్ కు ఏ విధమైన సంబంధం లేదని బ్రిటన్ కోర్టు బుధవారం తేల్చి చెప్పింది. లండన్ లోని నేషనల్ వెస్ట్ మినిస్టర్ బ్యాంక్ లో ఉన్న నిజాం నిధులపై తనకు హక్కు ఉందంటూ పాకిస్తాన్ వాదిస్తూ ఉంది. బ్రిటన్ కోర్టు తీర్పుతో పాకిస్తాన్ వాదన వీగిపోయింది. 

దేశ విభజన సమయంలో అప్పటి హైదరాబాద్ నిజాం తనపై సైన్యం దండెత్తవచ్చుననే భయంతో బ్రిటన్ లో పాకిస్తాన్ హైకమిషనర్ కు ఆ నిధులు పంపించారు. ఆ నిధులు 1948 సెప్టెంబర్ నుంచి బ్రిటన్ కు పాకిస్తాన్ హై కమిషనర్ ఖాతాలో ఉన్నాయి. వాటిపై తమకు హక్కులు ఉంటాయని పాకిస్తాన్ వాదిస్తూ వస్తోంది. 

నిజాం వారసులు మాత్రం భారత ప్రభుత్వంతో కలిసి తమ వాదనను వినిపించారు. ఆ నిధులు ఆయుధ నౌకలకు చెల్లింపుల కోసం ఉద్దేశించినవని, తమకు బహుమతిగా వచ్చినవని చేస్తున్న పాకిస్తాన్ వాదనను బ్రిటన్ కోర్టు తోసి పుచ్చింది. భారత్ కే ఆ నిధులు చెందుతాయని కోర్టు స్పష్టం చేసింది. ఆ నిధుల లబ్దిదారుడిగా ఏడవ నిజాంగా గుర్తిస్తూ ఆయన ఇద్దరు మునిమనవలకు ఇది వారసత్వంగా సంక్రమిస్తుందని తెలిపింది. 

దేశ విభజన తర్వాత నిజాం ఇటు భారత్ లో గానీ అటు పాకిస్తాన్ లో గానీ చేరడానికి ఇష్టపడలేదు. అయితే, భారత సైన్యం ఆపరేషన్ తో ఆయన అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లబ్ పటేల్ ముందు లొంగియి, భారత యూనియన్ లో విలీనానికి అంగీకరించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios