Asianet News TeluguAsianet News Telugu

తమ్మినేని స్పీకరా, వైసిపి అధికార ప్రతినిదా..? : అచ్చెన్నాయుడు సెటైర్లు

సభా సాంప్రదాయాలను గాలికొదిలేసి తమ్మినేని కేవలం చంద్రబాబుపై బురద చల్లే పనిలో ఉన్నారని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు  ఆరోపించారు. చంద్రబాబు కుటుంబంపై ఆరోపణలు చేస్తున్న తమ్మినేని.. దానిని ఆధారాలతో సహా నిరూపించగలరా..?  అని ప్రశ్నించారు. 

tdp leader atchennaidu fire  on assembly speaker tammineni sitharam
Author
Guntur, First Published Nov 7, 2019, 10:13 PM IST

గుంటూరు: బాధ్యతాయుతమైన స్పీకర్‌ పదవిలో ఉన్న తమ్మినేని సీతారామ్‌ రాజకీయాలు మాట్లాడటం సిగ్గుచేటని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుల కింజారపు అచ్చెన్నాయుడు ద్వజమెత్తారు. స్పీకర్‌ స్ధానాన్ని జగన్‌కి తాకట్టు పెట్టి తమ్మినేని రాజకీయాలు మాట్లాడుతున్నారని అన్నారు. 

అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుల్ని ఏ విధంగా ఏకవచనంతో మాట్లాడారో.. బయట సభల్లోనూ అదే పంథాను కొనసాగిస్తూ స్పీకర్‌ హోదాను తమ్మినేని  దిగజారుస్తున్నారని ఆరోపించారు. రాజకీయాలు మాట్లాడాలంటే ఆయన స్పీకర్‌ పదవికి రాజీనామా చేసి వైసీపీ అధికార ప్రతినిధిగా మారాలని సూచించారు.కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం స్పీకర్‌ స్ధానాన్ని దిగజార్చటం సరికాదని హితవు పలికారు. 

అగ్రిగోల్డ్‌ ఆస్తులన్నీ జప్తు అయి కోర్టు ఆధీనంలో ఉన్నాయని అన్నారు. వీటి గూరించి రాజ్యాంగబద్దమైన స్పీకర్‌ స్ధాయిలో ఉండి అసత్యాలు మాట్లాడటం ఎంతవరకు సమంజసం..? అని తమ్మినేనిని ప్రశ్నించారు.

read more  అగ్రిగోల్డ్‌ విషయంలో ఆరోపణలు: వైసీపీ నేతలకు చంద్రబాబు కౌంటర్

సభా సాంప్రదాయాలను గాలికొదిలేసి తమ్మినేని కేవలం చంద్రబాబుపై బురద చల్లే పనిలో ఉన్నారని ఆరోపించారు. చంద్రబాబు కుటుంబంపై ఆరోపణలు చేస్తున్న తమ్మినేని.. దానిని ఆధారాలతో సహా నిరూపించగలరా..?  అని ప్రశ్నించారు. 

ప్రజాప్రతినిధులమని చెప్పుకుంటూ తమ్మినేని చేస్తున్న విమర్శలు, ఆరోపణలు స్పీకర్‌ స్థాయినే దిగజారుస్తున్నాయన్నారు. అసెంబ్లీ నియమావళిని మంటగలుపుతున్న తమ్మినేనికి ట్రీట్‌ మెంట్‌ అవసరమని ఎద్దేవా చేశారు.

చట్టసభల్లో నిద్రపోవడం... బయట రాజకీయ విమర్శలతో కాలక్షేపం చేయడం తమ్మినేనికి షరామామూలైందన్నారు. తమ్మినేని తీరుతో చట్టసభలపై ప్రజలకు గౌరవం  పోతోందన్నారు.  

read more మద్య నియంత్రణలో జగన్ మరో కీలక నిర్ణయం, కొత్త ఏడాది నుంచే అమలు

అగ్రిగోల్డ్‌ కుంభకోణం జరిగిందే వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో అని  ఆరోపించారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను పరిరక్షించి బాధితులకు న్యాయం చేసేందుకు ప్రయత్నం చేసిన చంద్రబాబుపై స్పీకర్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని అచ్చెన్నాయుడు ద్వజమెత్తారు.   

అగ్రిగోల్డ్ బాధితులకు వైసీపీ ప్రభుత్వం చెల్లింపుల ప్రక్రియ ప్రారంభించడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. అసలు బాధితులను ఆదుకునే ప్రక్రియను ప్రారంభించిందని చంద్రబాబు గుర్తుచేశారు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోయిన ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున 100 కుటుంబాలకు రూ.5 కోట్లు అందజేసినట్లు తెలిపారు. అగ్రిగోల్డ్ నిందితులపై కేసులు పెట్టి.. ఆస్తులను కాపాడింది తెలుగుదేశం ప్రభుత్వమేనని చంద్రబాబు ట్వీట్ చేశారు.

అగ్రిగోల్డ్ బాధితుల జాబితా సేకరించి తొలి విడత పంపిణీకి తమ ప్రభుత్వం రూ.336 కోట్లు సిద్ధంగా ఉంచిందని బాబు వెల్లడించారు.  బడ్జెట్‌లో రూ.1,150 కోట్లు పెట్టి నిధులు ఎందుకు విడుదల చేయలేదని బాబు ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ విషయమై వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం బాధితులను మనోవేదనకు గురిచేసిందని.. ఇందుకు అధికార పార్టీ నేతలు క్షమాపణలు చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్రిగోల్డ్ విషయంలో గత ప్రభుత్వమే అవినీతికి పాల్పడిందని.. టీడీపీ అధినేత చంద్రబాబు పెద్ద మోసగాడని ఆరోపించారు. హాయ్‌ల్యాండ్ భూములును కొట్టేసేందుకు చంద్రబాబు, నారా లోకేశ్ ప్లాన్ వేశారని స్పీకర్ ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలపైనే తాజాగా అచ్చెన్నాయుడు స్పందించారు. 

                                       

Follow Us:
Download App:
  • android
  • ios