Asianet News TeluguAsianet News Telugu

"నేనే రాజు నేనే మంత్రి" మూవీ రివ్యూ

  • చిత్రం: నేనే రాజు నేనే మంత్రి
  • నటీనటులు: రానా, కాజల్‌, కేథరిన్‌, అశుతోష్‌ రాణా, పోసాని, అజయ్‌, నవదీప్‌, జోష్‌ రవి, తనికెళ్ల భరణి, జయప్రకాష్‌రెడ్డి
  • సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
  • సినిమాటోగ్రఫీ: వెంకట్‌ సి.దిలీప్‌
  • నిర్మాతలు: డి.సురేష్‌బాబు, కిరణ్‌రెడ్డి, భరత్‌ చౌదరి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తేజ
  • ఆసియానెట్ రేటింగ్- 3/5
nene raju nenen manthri movie review

వరుస విజయాలతో దూసుకుపోతున్న రానా విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులకు రోజు రోజుకు మరింత చేరువవుతున్నాడు. చాలా రోజుల క్రితం చిత్రం, నువ్వు నేను, జయం వంటి సినిమాలతో హిట్స్‌ అందుకున్న దర్శకుడు తేజ. ఈ సినిమాల తర్వాత అంతగా భారీ విజయాలేవీ లేని తేజ దర్శకత్వంలో.. తాజాగా రానా నటించిన చిత్రమే 'నేనే రాజు నేనే మంత్రి'. ఈ సినిమాలోని పొలిటికల్‌ డైలాగ్స్‌, రానా నటన సినిమాపై మంచి అంచనాలే పెంచాయి. మరి ఈ అంచనాలను సినిమా అందుకుందా? లేదా?

కథ:

జోగేంద్ర(రానా), రాధ(కాజల్‌) ఇద్దరూ భార్యభర్తలు. ఒకరంటే ఒకరికి ప్రాణం. జోగేంద్ర కారైకూడ గ్రామంలో ధర్మ వడ్డీలకు డబ్బులు ఇస్తుంటాడు. అయితే వడ్డీ వ్యాపారం చేస్తుండే రానా, రాధలకు పెళ్లైయిన మూడేళ్ల వరకు పిల్లలుండరు.  స్వతహాగా గొప్ప మనసు కలిగిన రాధ దీని గురించే కాస్తత ఎక్కువ బెంగ పెట్టుకుంటుంది. ఇంతలోనే గర్భవతి అవుతుంది. దాని కోసం మొక్కుకున్న అమ్మవారి గుళ్లో మొక్కు తీర్చుకోవడానికి గుడికి వెళ్లి తొలి దీపం వెలిగిస్తుంది. అయితే రాధను ఊరి సర్పంచ్‌(ప్రదీప్‌ రావత్‌) భార్య.. సర్పంచ్ భార్యను నేనుండగా నువ్వెలా దీపం పెడతావే అని నిండు చూలాలైన రాధను తోసేస్తుంది. దాంతో రాధ కావాలో, బిడ్డ కావాలో తేల్చుకొమ్మని డాక్టర్లు చెప్తారు. అయితే మళ్లీ పిల్లలు పుట్టరని చెప్పినా రాధే కావాలని జోగేంద్ర చెప్పడంతో డాక్టర్లు బిడ్డను తీసేసి రాధను కాపాడుతారు. దాంతో గర్భం పోవటమే కాక రాధకు పిల్లలు కూడా పుట్టని పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో రాధకు సర్పంచ్‌ పై కోపం వస్తుంది. ఎలాగైనా జోగేంద్రను సర్పంచ్‌ కావాలని కోరిక కోరుతుంది.

భార్య అంటే ఎనలేని ప్రేమ కురిపించే జోగేంద్ర తన తెలివి తేటలతో సర్పంచ్‌ అవుతాడు. తన పదవి పోవడంతో మాజీ సర్పంచ్‌, జోగేంద్రను హత్య చేయాలని చూస్తాడు. దీంతో జోగేంద్ర మాజీ సర్పంచ్‌ను చంపేస్తాడు. జోగేంద్ర పదవి, డబ్బు, ప్రజల్లో అతనికున్న పలుకుబడిని చూసి ఎమ్మెల్యే చౌడప్ప(సత్య ప్రకాష్‌) అతన్ని పోలీసు కేసు నుండి తప్పిస్తాడు. ఈ కేసులో ఎమ్మెల్యేకు సి.ఐ(అజయ్‌) సహాయపడతాడు. తనని తప్పించినందుకు డబ్బులివ్వాలని అజయ్‌ డిమాండ్ చేస్తాడు. దీంతో అతన్ని కూడా తన పొలిటికకల్ పవర్ తో జోగేంద్ర ట్రాన్స్ ఫర్ చేయిస్తాడు. ఇక ఎమ్మెల్యే చౌడప్ప కూడా కేసు నుంచి తప్పించినందుకు జోగిని డబ్బులు అడుగుతాడు. అంత డబ్బు తన వద్ద లేదంటూ బతిమాలిన జోగితో... నీ పెళ్లాన్ని పంపించు.. అని అంటాడు. దాంతో ఎమ్మెల్యేను కూడా చంపేసి తాను ఎమ్మెల్యే అవుతాడు. అయితే తానిచ్చిన రికమెండేషన్ లెటర్ యువకుని ఉద్యోగానికి పనికిరాదనటంతో... తాను మంత్రి కావాలనుకుంటాడు జోగేంద్ర. దాని కోసం సీఎంను అడగ్గా నిరాకరిస్తాడు. అప్పుడు హోం మంత్రిని గురువా అంటూ కాకా పట్టి అతన్ని ఇరికించి.. తాను మంత్రవుతాడు జోగి.  అలా అంచెలంచెలుగా ఎదిగి ఏకంగా సీఎం సీటుకే టార్గెట్ పెడతాడు. డబ్బు వ్యవసాయం అంటూ కరెన్సీ కట్టలు కట్టలుగా వచ్చే బిజినెస్ లు అన్నీ చేస్తాడు. కోట్ల కొద్దీ అక్రమంగా కూడబెడతాడు.

ఈ క్రమంలో అత్యంత నమ్మకస్తుడైన శివ(నవదీప్‌)ను జోగేంద్ర కుడిభుజంలా పక్కన బెట్టుకుంటాడు. అయితే..  ప్రత్యర్థులు ఆడే మైండ్ గేమ్ లో..తప్పు చేసిన వాడు దొరికితే ఆలోచించకుండా చంపే తన వీక్ నెస్ కారణంగా నిజం తెలుసుకోకుండానే తెలియకుండా శివను జోగేంద్ర చంపేస్తాడు. తాను చేసిన తప్పు తెలుసుకుని జోగేంద్ర చాలా బాధపడతాడు. మరోవైపు హై కమాండ్ వద్ద జోగేంద్రను ప్రత్యర్థులు ఇరికించడంతో జోగేంద్రను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హై కమాండ్ చెప్తుంది. దీంతో ఆగ్రహించిన జోగి తానే పార్టీ పెడతానని శపథం చేసి అన్నంత పనీ చేస్తాడు. ఈ క్రమంలో ఓ ఛానెల్ యాంకర్ తన గురించి చేసిన స్టింగ్ ఆపరేషన్ గురించి జోగేంద్రకు తెలుస్తుంది. దాంతో వెంటనే ఆ యాంకర్ ను కాంప్రమైజ్ చేసే పనిలో పడ్డ జోగి ఏకంగా ఆమె బుట్టలో పడిపోతాడు. అయితే.. ఆమె అతన్ని ప్రేమిస్తుంది. ఆ ప్రేమను అంగీకరించని జోగి తనకు రాధంటే ప్రాణమని, రాధ లేనిదే జోగేంద్ర లేడని స్పష్టం చేస్తాడు. చాలా సీరియస్ గా రియాక్ట్  అయిన జోగేంద్రను చూసి ఆమె భయపడుతుంది. కోపంతో... హోం మంత్రి పక్కన చేరుతుంది. మరి తన చుట్టూ ఇంత జరుగుతున్నా... సీఎం కుర్చీ కోసం అక్కడ మొదలైన ఆటలో చివరకు రానా విజేతగా ఎలా నిలుస్తాడు? సీఎం కావాలనే ఆశయం సాధించడం కోసం పోరాడిన జోగేంద్ర చివరికి ఏం సాధిస్తాడు? రాజకీయ చదరంగంలో చివరకు జోగేంద్రకు ఏం మిగిలింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

 

నటీనటులు:

నటీనటుల విషయానికి వస్తే సినిమా అంతా ప్రధానంగా జోగేంద్ర, రాధ పాత్రలపైనే సాగుతుంది. జోగేంద్రగా రానా, రాధగా కాజల్‌ వారి పాత్రల్లో ఒదిగిపోయారు. బాహుబలి, ఘాజీ వంటి డిఫరెంట్‌ మూవీస్‌ చేసిన రానా లీడర్‌ తర్వాత చేసిన పొలిటికల్‌ జోనర్‌ మూవీ ఇది. సామాన్య వడ్డీ వ్యాపారి సీఎం కావాలనుకున్నప్పుడు అతను ఎదిగే క్రమం, అందులో అతను ఎదుర్కొనే సమస్యలు అన్నింటినీ చక్కగా చూపించారు. రానా తన పాత్రకు తగిన విధంగా బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకుని చేసిన సినిమా ఇది. రానా లుక్‌ కూడా ఆకట్టుకుంటుంది. ఇక కాజల్‌ కూడా హోమ్లి పాత్రలో చక్కగా ఒదిగింది. ప్రీ క్లైమాక్స్‌లో హాస్పిటల్‌ సీన్‌లో కాజల్‌ నటన కంటతడి పెట్టిస్తుంది. ఇక కీలక పాత్రలో నటించిన తన పాత్రకు న్యాయం చేశాడు.

విలన్‌ పాత్రలో అశుతోష్‌ రానా మెప్పించాడు. ఇక పోసాని కృష్ణమురళి తనదైన శైలిలో సెటైరికల్‌ డైలాగ్స్‌ తో ప్రేక్షకులను నవ్వించాడు. వాడు జోగేంద్ర.. అంటూ పదే పదే పంచ్ డైలాగ్‌ చెబుతూ మరోవైపు ప్రభాస్‌ శ్రీను నవ్వించాడు. దూరదర్శన్‌ కెమెరామెన్‌గా బిత్తిరి సత్తి తనదైన యాసతో, మరోవైపు సెంట్రల్‌ జైలు సూపరిడెంట్‌ పాత్రలో జయప్రకాష్‌ రెడ్డిలు అలరించారు.

 

సాంకేతిక నిపుణులు :

ఇక సాంకేతిక విషయాలకు వస్తే, దర్శకుడు తేజ ఇప్పటి వరకు లవ్‌స్టోరీతోనే పెద్ద విజయాలను సాధించాడు. ఈసారి తన ట్రెండ్‌కు భిన్నంగా చేసిన సినిమా ఇది. పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఐదేళ్ల కాలంలో ఓ వ్యక్తి సీఎం స్థాయికి ఎలా ఎదిగాడు.. అనే సామాన్యుని జీవన ప్రయాణాన్ని తేజ తెరకెక్కించిన ప్రయత్నమే ఈ చిత్రం. స్క్రీన్‌ప్లే పరంగా క్లారిటీతో సినిమా సాగుతుంది. అనూప్‌ నువ్వే నువ్వే సాంగ్‌, జోగేంద్ర టైటిల్‌ సాంగ్‌ ఇలా అన్ని మాంటేజ్‌ సాంగ్స్‌ ఒకే అనిపించాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే వుంది. వెంకట్‌ సి.దిలీప్‌ సినిమాటోగ్రఫీ బావుంది. లక్ష్మీభూపాల్‌ మాటలు సినిమాకు ప్లస్‌ అయ్యాయి.

రానా సందర్భానుసారం చెప్పే సామెతలు. పదవుల్లో ఉన్నవాళ్లే బాగుంటారు. పక్కనుండేవాళ్లు బాగుండరు. అన్న వస్త్రాలు కావాలంటే ఉన్న వస్త్రాలు పోతాయి, వంద మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి హోటల్‌లో పెడితే నేనూ అవుతా సీఎం...శత్రువు కూడా పాఠాలు నేర్పుతాడని తెలిసింది..లాంటి డైలాగ్స్‌ తో పాటు... క్ల్రైమాక్స్‌ సీన్లో జనం ఎవరికి ఓటేస్తుంటారు. ఎలా మోసపోతుంటారు. ప్రజల గురించి చాలా మంది రాజకీయ నాయకులు ఎలా ఆలోచిస్తారు. అసలు సానుభూతి ఓట్లు వేయడం, వారసత్వ రాజకీయాలు.. ఇలా అన్నింటిపై వచ్చే డైలాగ్స్‌ ప్రేక్షకులను మెప్పిస్తాయి. అయితే... రాధను అమితంగా ప్రేమించే జోగేంద్ర ఆమె చివరు కోరిక నెరవేర్చకుండా.. ఆమె చేసిన త్యాగానికి విలువ లేకుండా.. తాను ఆత్మహత్య చేసుకోవడం లాజిక్ మిస్ అయినట్లు అనిపిస్తుంది. దర్శకుడు దీన్ని జస్టిఫై చేసిన తీరు మరోలా వుంటే బాగుండేదనిపిస్తుంది. అయితే.. తన దగ్గరికే వెళ్లిపోయాడు కాబట్టి రాధ తన త్యాగానికి అర్థం లేకుండా చేసినా.. జోగిని ఎప్పటిలాగే ప్రేమించిందా అన్నది దర్శకుడి ఛాయిస్.

ప్లస్ పాయింట్స్: దర్శకుడు తేజ  అనుభవం  స్క్రీన్ ప్లే రూపంలో స్పష్టంగా తెరపై కనిపించింది. ప్రతీ సీన్ లో లాజిక్ మిస్ కాకుండా క్లైమాక్స్ వరకు ఎగ్జయిట్ మెంట్ మిస్ కాకుండా సీన్ టు సీన్ అద్భుతంగా తెరకెక్కించాడు. ఇక జోగేంద్రగా రానా, రాధగా కాజల్ తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. ఒక దశలో చనిపోయే ముందు కాజల్ ప్రేక్షకుల కంటతడి  పెట్టించేలా తీర్చిదిద్దిన సీన్ కదిలించేస్తుంది. ఇంకా చాలా వుంది. సినిమా చూడాల్సిందే.

మైనస్ పాయింట్స్ :

ఒక్క రాధను ప్రేమించడం విషయంలో తప్ప రానాలో ఎక్కడా హీరోను చూపించకపోవడం తేజ చేసిన తప్పిదంగా చెప్పొచ్చు. అయితే రాధ లాంటి ఇల్లాలు పక్కనుంటే జోగేంద్ర లాంటి విలన్స్ కూడా మంచి వాళ్లుగా మారిపోతారని కవర్ చేసేశాడు. మరోవైపు రాధను ఎంతగానో ప్రేమించే జోగి ఒకదశలో తన రాజకీయ జీవితం కోసం ఛానెల్ ఓనర్(కేథరిన్)తో అలా కానిచ్చేయటం కొంత కెరీర్ కు, కుటుంబానికి మధ్య బ్యాలెన్స్ అవుట్ చేసినట్లనిపిస్తుంది. అంతే కాక చివర్లో క్సైమాక్స్ సీన్ రానా సీఎంగా ముగుస్తుందనుకుంటే... రాధ త్యాగానికి విలువ లేకుండా చేసి జోగేంద్ర ఆత్మహత్య చేసుకోవడం దర్శకుడి సెన్స్ ఎక్కడో మిస్ అయిందని అనిపిస్తుంది. ఈ విషయంలో దర్శకత్వ ప్రతిభ పక్కకుబోయి పిచ్చి పీక్స్ కు చేరిందనిపిస్తుంది. కానీ.. మిగతా అంతా ఓకే కాబట్టి ఇది పెద్దగా ఎఫెక్ట్ చూపదనుకున్నారేమో.

 

చివరగా:

రాధ త్యాగానికి విలువనిచ్చి సీఎం కాకుండా ఆత్మహత్య చేసుకున్నా.. జోగేంద్ర అంటే రాధాజోగేంద్ర అనిపించాడు జోగి.

Follow Us:
Download App:
  • android
  • ios