కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు: ప్రజా పాలనకు ధరఖాస్తులు ఎలా చేయాలి?
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. ప్రజా పాలన పేరుతో ప్రజల నుండి ధరఖాస్తులను స్వీకరించనున్నారు.
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై అనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది. ఈ నెల 28వ తేదీ నుండి 2024 జనవరి 6వ తేదీ వరకు ప్రజా పాలన కార్యక్రమంలో ప్రజల నుండి ధరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆరు గ్యారంటీల హామీల అమలు ధరఖాస్తు ఫారాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బుధవారం నాడు ఉదయం విడుదల చేయనున్నారు.
also read:భారత్ న్యాయ యాత్ర: మణిపూర్ నుండి ముంబై వరకు రాహుల్ రెండో విడత యాత్ర
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో చేసిన ప్రచారం ఆ పార్టీకి ఓట్లను కురిపించింది. ఆరు గ్యారంటీలతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో కూడ పలు అంశాలను పొందుపర్చింది. అయితే ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇప్పటికే రెండు హామీలను ప్రభుత్వం అమలు చేసింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణ సౌకర్యాన్ని కల్పించారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
also read:రేషన్ కార్డు లేకుంటే రైతు బంధు కట్:తెలంగాణ సర్కార్ నిబంధన?
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ హామీల్లో భాగంగా ప్రతి ఇంటికి ధరఖాస్తు ఫారాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ధరఖాస్తులను ఆయా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుండి ధరఖాస్తులను స్వీకరించనున్నారు . పట్టణ ప్రాంతాల్లో ఆయా వార్డుల్లో కూడ ప్రజలకు ధరఖాస్తులను అందిస్తారు. ఆయా గ్రామాల్లో ఏ రోజున గ్రామ సభలు నిర్వహిస్తారో ముందే సమాచారం ఇస్తారు. గ్రామ సభల్లో ప్రజల నుండి ధరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆరు గ్యారంటీలకు సంబంధించి ఒకే ధరఖాస్తు ఫారం ఉంటుంది.ఈ ధరఖాస్తు ఫారాన్ని నింపి రేషన్ కార్డు, ఆధార్ కార్డు జీరాక్స్ ప్రతులను జత చేసి అధికారులకు అందించాలి.
also read:ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కూటమి:బాబుకు దెబ్బేనా?
హైద్రాబాద్ లోని ఆయా వార్డుల్లో నాలుగు చోట్ల ధరఖాస్తులను స్వీకరించేందుకు కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ధరఖాస్తు ఫారాన్ని రెండు నుండి ఐదు నిమిషాల్లో నింపవచ్చు. తెలుగులోనే ధరఖాస్తు ఫారం ఉంది. ఈ ధరఖాస్తు ఫారాల్లో ఏ పథకం కింద ధరఖాస్తు చేసుకోవాలో కూడ స్పష్టంగా ఉంటుంది.
మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల మహిళలకు రూ. 2500 , రూ. 500లకే గ్యాస్ సిలిండర్ పథకం కింద అవసరమైన వివరాలు అందించాల్సి ఉంటుంది. ఆయా గ్యాస్ కంపెనీల పేర్లతో పాటు ఏటా ఎన్ని గ్యాస్ సిలిండర్లు అవసరమనే వివరాలుంటాయి.
ఇక రైతు భరోసా పథకం కింద ప్రతి ఏటా రూ. 15 వేలు అందించనున్నారు. కౌలు రైతా, రైతా అనే వివరాలు ధరఖాస్తులో పొందుపర్చాల్సి ఉంటుంది.రైతు సాగు చేస్తున్న భూమి వివరాలను కూడ పొందుపర్చాలి.
ఇందిరమ్మ ఇళ్ల కోసం ధరఖాస్తులో అవసరమైన వివరాలను పొందుపర్చాలి. అమర వీరుల కుటుంబాలైతే ఆ వివరాలను ఆ ధరఖాస్తులో చేర్చాలి.
ఇంటి నిర్మాణం కోసం అవసరమైన ఆర్ధిక సహాయం కోరితే ఆ వివరాలను అందించాలి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని కేసులు, శిక్ష అనుభవిస్తే ఆ వివరాలను కూడ ఆ ధరఖాస్తులో నింపాల్సి ఉంటుంది.
గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల విద్యుత్ వినియోగం ఉచితంగా ప్రకటించింది. ప్రతి నెల ఎన్ని యూనిట్ల విద్యుత్ వినియోగిస్తున్నారనే విషయాన్ని ధరఖాస్తులో నమోదు చేయాలి.
also read:పార్లమెంట్ ఎన్నికలు 2024: తెలంగాణకు అమిత్ షా, ఆ స్థానాలే టార్గెట్
చేయూత పథకం కింద పెన్షన్ల కు సంబంధించిన సమాచారం అందించాల్సి ఉంటుంది.వృద్దాప్య, వితంతు, దివ్యాంగుల, చేనేత, గీత కార్మికుల పెన్షన్ ను అందించనున్నారు.వీరితో పాటు డయాలసిస్ , బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు,ఫైలేరియా బాధితులు, బీడీ టెకేదారు వంటి అంశాలను నింపి ఆయా గ్రామ సభల్లో లేదా వార్డులలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో అందిస్తే సరిపోతుంది.ఈ ధరఖాస్తుకు సంబంధించి సంబంధిత అధికారులు రశీదును కూడ అందిస్తారు.