ప్యారిస్ ఒలింపిక్స్‌కి 118 మంది భారత అథ్లెట్లు... క్రీడాకారుల సమన్వయంపై ఉన్నత స్థాయి సమీక్ష
ప్యారిస్ ఒలింపిక్స్‌లో 16 క్రీడాంశాల్లో పాల్గొనేందుకు భారత క్రీడాకారులు అర్హత సాధించారు. వారిలో 48 మంది మహిళా అథ్లెట్లు సహా మొత్తం 118 మంది అథ్లెట్లు ఉన్నారు. ఇప్పటికే క్రీడాకారులు ప్యారిస్‌కు వెళ్లారు.
ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా పండుగ ప్రారంభం కావడానికి మరో రెండో వారాలే మిగిలి ఉంది. ఈ నెల 26వ తేదీ నుంచి ప్యారిస్ వేదికగా ఒలింపిక్స్ క్రీడా సంబరం మొదలు కానుంది. ఇందుకోసం నిర్వాహకులు ఏర్పాటు పూర్తిచేశారు. ప్రపంచ దేశాలన్నీ పాల్గొనే ఈ విశ్వ క్రీడా పోటీలో భారత్ వివిధ విభాగాల్లో తలపడనుంది.
ప్యారిస్ ఒలింపిక్స్‌లో 16 క్రీడాంశాల్లో పాల్గొనేందుకు భారత క్రీడాకారులు అర్హత సాధించారు. వారిలో 48 మంది మహిళా అథ్లెట్లు సహా మొత్తం 118 మంది అథ్లెట్లు ఉన్నారు. ఇప్పటికే క్రీడాకారులు ప్యారిస్‌కు వెళ్లారు. మొత్తం 118 మంది అథ్లెట్లలో 26 మంది ఖేలో ఇండియా అథ్లెట్లు కాగా, 72 మంది అథ్లెట్లు తొలిసారి ఒలింపిక్ క్రీడలకు అర్హత సాధించారు.
ఈ నేపథ్యంలో శుక్రవారం పారిస్ ఒలింపిక్స్- 2024 సన్నద్ధతపై సమీక్షించేందుకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక, ఉపాధి శాఖల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్లు ఇబ్బందులు ఎదుర్కోకుండా సంపూర్ణ మద్దతు అందించేందుకు సమన్వయ బృందాన్ని ఏర్పాటు చేశారు. పోటీకి ముందు, ఆ తర్వాత క్రీడాకారులకు ఏవైనా సమస్యలు ఎదురైతే పరిష్కరించాలని సూచించారు. అథ్లెట్లకు అవసరమైన మద్దతును అందించేందుకు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. మన అథ్లెట్లు ఒలింపిక్స్ రాణించేందుకు ఉత్తమమైన శారీరక, మానసిక స్థితిలో ఉండేలా చూడాలన్న ప్రధాని మోదీ సందేశాన్ని వివరించారు. ఒలింపిక్స్‌కు అర్హత సాధించినవారిలో 80 శాతానికి పైగా అథ్లెట్లు ఇప్పటికే ఐరోపాలోని వివిధ ప్రదేశాల్లో శిక్షణ పొందుతున్నారని... అక్కడి వాతావరణానికి వారు అలవాటుపడే సమస్యలు తలెత్తకుండా చూస్తామన్నారు.
ఒలింపిక్స్‌కు భారత అథ్లెట్లు అత్యుత్తమ సన్నద్ధత కలిగి ఉండేలా టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (TOPS) ద్వారా శిక్షణ అందిస్తున్నారు. ఇందుకోసం ప్రపంచ స్థాయి కోచ్‌లు, నిపుణులు పనిచేస్తున్నారు. తొలిసారిగా గేమ్స్ విలేజ్‌లో భారత అథ్లెట్ల కోసం స్పోర్ట్స్ సైన్స్ పరికరాలతో కూడిన రికవరీ సెంటర్ అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా పారిస్‌లోని పార్క్ ఆఫ్ నేషన్స్‌లో ఇండియా హౌస్‌ను ఏర్పాటు చేసి ఫ్రాన్స్ సహా మరో 14 దేశాల సరసన ఆటగాళ్లకు శిబిరాలను ఏర్పాటు చేశారు. అథ్లెట్ల అవసరాల అనుగుణంగా వసతులు కల్పించారు. దీంతో ఈసారి అథ్లెట్లు ఉత్తమ ప్రతిభ కనబరుస్తారన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.
- India House
- India's participation
- Indian athletes
- Mansukh Mandaviya
- Paris 2024
- Paris Olympics
- Prime Minister Modi
- Target Olympic Podium Scheme (TOPS)
- athlete facilities
- coordination
- high-level meeting
- organizers
- participating countries
- performance expectations
- physical and mental fitness
- preparation
- recovery center
- support team
- training camps
- training in Europe
- world's biggest sports festival
- world-class coaches