ఫక్తు రాజకీయం: అప్పుడు అన్న చిరంజీవి...ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్
రాష్ట్రంలో ఇప్పటివరకు కమ్మ, రెడ్డి సామాజికవర్గాలే ఒకరితర్వాత ఒకరుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నారు. ఎప్పటినుండో బలమైన సామాజికవర్గంగా ఉన్న కాపులకు మాత్రం అధికారం దక్కడంలేదు. ప్రతి పర్యాయం వారు ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వారికి అధికార అందాలన్నీ ఎక్కే ఛాన్స్ మాత్రం దక్కడం లేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కుల ప్రాధాన్యత ఎప్పటినుండో కూడా మనకు కనబడుతుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కమ్మ, రెడ్డి సామాజికవర్గాలే ఒకరితర్వాత ఒకరుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నారు.
ఎప్పటినుండో బలమైన సామాజికవర్గంగా ఉన్న కాపులకు మాత్రం అధికారం దక్కడంలేదు. ప్రతి పర్యాయం వారు ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వారికి అధికార అందాలన్నీ ఎక్కే ఛాన్స్ మాత్రం దక్కడం లేదు.
ప్రతి పార్టీ కూడా ఈ సామాజికవర్గ ఓట్లను తమవైపు తిప్పుకోవడానికి విశ్వ ప్రయత్నం చేసి వాటిని దక్కించుకొని ముఖ్యమంత్రి పదవిని అయితే అలంకరిస్తుంది కానీ, వీరి సొంత సామాజికవర్గం నుండి మాత్రం వారికి ఆ కోరిక తీరడం లేదు.
Also read; బీజేపీతో పవన్ కళ్యాణ్ పొత్తు : చంద్రబాబును వెనక్కి నెట్టి తాను ముందుకు వచ్చేందుకే...
కొన్ని సార్లు ఇతర కులాల నేతల మాయలో పడి అధికారాన్ని చేజిక్కించుకోవడంలో విఫలమైతే....కొన్నిసార్లు తమ సొంత కుల నేతలే వీరి ఆశలకు గండి కొట్టారనేమాట వారి సొంత కులస్థుల నుండే వినబడుతున్న మాట.
ఎన్నికలు కూడా దరిదాపుల్లో లేనప్పుడు ఎందుకు ఈ ఓటు బ్యాంకు రాజకీయాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తుందనే అనుమానం కలగడం సహజం. దీనికి బలమైన కారణం కూడా లేకపోలేదు. యాంగ్రీ యంగ్ మ్యాన్ పవన్ కళ్యాణ్ తాజాగా బీజేపీతో కుదుర్చుకున్న పొత్తు వల్ల ఇప్పుడు ఈ ప్రస్తావన తీసుకురావలిసి వస్తుంది.
అప్పుడు కమ్యూనిజం... ఇప్పుడు కాషాయిజం.... మాయమైన పవనిజం
పవన్ వి కుల రాజకీయాలు కాదు అని వాదించేవారు కూడా లేకపోలేదు. కానీ పవన్ నిన్నటివరకు తాను మతాతీత, కులాతీత రాజకీయాలు చేస్తానని చెప్పాడు. కానీ చివరకు హిందుత్వ అజెండానే ప్రధానంగా ఎత్తుకొని తిరిగే బీజేపీ తో కలిసి ఇప్పుడు తన సిద్ధాంతం బీజేపీ సిద్ధాంతం ఒకటే అంటున్నాడు. (గతంలో కమ్యూనిస్టులతో కలిసినప్పుడు కూడా అదే మాట అన్నాడు, అది వేరే విషయం లెండి)
ఇప్పుడు పవన్ ఒక ఫక్తు రాజకీయ నాయకుడు అనేది తేటతెల్లం. తన రాజకీయ అవసరాలు ఏమైనా అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఇలా బీజేపీతో అర్థాంతరంగా కలవడం, అది ప్రత్యేక హోదా ఇవ్వమని తేల్చేసిన పార్టీతో కలవడం దేనికి సంకేతం?
పోనీ ప్రత్యేక హోదా పక్కన పెడదాము, విభజన హామీలు కూడా పక్కన పెడదాము, కనీసం అమరావతి విషయంలోనైనా ఏమైనా హామీ ఇచ్చిందా అంటే అది లేదు. ఈ పరిస్థితుల్లో పవన్ చేసేది కూడా ముమ్మాటికీ ఫక్తు రాజకీయమే.
Also read; బీహార్ ఫార్ములా: ఏపీ సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్
ఇక ఇప్పుడు కాపుల విషయానికి వద్దాము. వారు ఎప్పటినుండో అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగిన అనంతరం వారికి పవన్ కళ్యాణ్ రూపంలో ఒక నాయకుడు కనిపించాడు.
వారంతా పవన్ వెంట నడిచారు. చివరకు ఎన్నికలప్పుడు సంస్థాగత నిర్మాణం లేని కారణంగా తాను బీజేపీ-టీడీపీ కూటమికి మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపాడు. ఆ కూటమి గెలిచింది.
పోనీ, కూటమి గెలిచినా తరువాతనయినా పవన్ తమకు ఎమన్నా చేస్తాడేమో అనుకుంటే, వారికి ఒరగబెట్టిందేమీ లేదు. పై పెచ్చు ఆయన ఫుల్ టైం పొలిటీషియన్ గా కన్నా కూడా పార్ట్ టైం రాజకీయ నాయకుడిగానే మిగిలిపోయారు. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ అడ్రస్ లేకుండా పోయారు.
ఇక 2019 ఎన్నికలు వచ్చేనాటికి ఆయన ఒకింత యాక్టీవ్ అయినా మాట వాస్తవం. కాకపోతే కేవలం జగన్ మోహన్ రెడ్డినే టార్గెట్ చేయడం ఇక్కడ పవన్ కి ఒకింత మైనస్ అయిందని చెప్పవచ్చు.
వైసీపీ వాళ్ళు పదే పదే టీడీపీ-జనసేన ఒకటే అని చేసిన ప్రచారానికి బలం చేకూరింది. ప్రశ్నించే వాడు ప్రభుత్వాన్ని ఒరశ్నించాలి కానీ ఇలా విపక్షాన్ని ప్రశ్నించడం ఎంతవరకు సబబు అనే ప్రశ్న ఉత్పన్నమైంది.
కానీ కాపులు మాత్రం పవన్ కళ్యాణ్ ని గట్టిగానే నమ్మారు. పవన్ ఓటమి చెందినప్పటికీ, ఇతర పార్టీలను ఎదుర్కొనే అంగ బలం అర్థ బలం లేక ఓటమి చెందారు. డబ్బులను పంచకుండా రాజకీయం చేస్తామని చెప్పినట్టే దానికి ఇతర పార్టీలతో పోల్చుకుంటే చాలా ఎక్కువగా కట్టుబడి ఉన్నారు పవన్ కళ్యాణ్.
Also read; జగన్ కు గుబులు, చంద్రబాబుకు షాక్: బిజెపితో పవన్ కల్యాణ్ పొత్తు
ఎన్నికలయిపోయాయి. ఓటమి చెందారు. చెందినప్పటికీ కూడా ప్రజాక్షేత్రంలోనే ఉంటాను. ఇక్కడే ఉంది తేల్చుకుంటాను అని అన్నారు. ఓటమి చెందినప్పుడు కాన్షి రామ్ ఉదాహరణ చెప్పి క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపి, తాను ముందుంటానన్నాడు. ఇసుక పై తలపెట్టిన పోరులో అలానే ముందుండి ఆ సమస్యపై తీవ్రస్థాయిలోనే పోరాటం చేసారు. పవన్ ని జన సైనికులు అంతలా నమ్మారు.
పవన్ పై ద్వారంపూడి చంద్రశేఖర్ చేసిన అసభ్యకరమైన కామెంట్ పై తీవ్రస్థాయిలో స్పందించిన జనసేన పార్టీ అభిమానులు అధికార పక్ష ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి సైతం పిలుపునిచ్చి తమ నాయకుడిని తాము ఎంతలా నమ్మామో చాటి చెప్పారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్థానిక సంస్థల ఎన్నికల ముందు సంస్థాగత నిర్మాణం కూడా లేని బీజేపీతో పొత్తు పెట్టుకుంది. గ్రామ స్థాయిలో జనసేనకు అభిమానులు ఉన్నారు తప్ప, వారికి క్యాడర్ లేదు. సంస్థాగత నిర్మాణం దిశగా గత 5 సంవత్సరాల్లో పవన్ కృషి చేసిన దాఖలాలే లేవు.
2019 ఎన్నికల్లో జనసేనకు ఓట్లు వచ్చాయంటే, పవన్ ను బలంగా నమ్మిన కాపు కులస్థులు అందునా ముఖ్యంగా యువత. వారి ఓట్లతో పాటు పవన్ అభిమానులు, పవన్ పేస్ వాల్యూ ఇవన్నీ వెరసి ఓట్లు పడ్డాయి తప్ప, సంస్థాగతంగా బలోపేతమైన పార్టీ క్యాడర్ వల్ల ఎంతమాత్రమూ కాదు.
ఇప్పుడేమో స్థానిక సంస్థలకు అత్యంత కీలకమైందేమో సంస్థాగత క్యాడర్ నిర్మాణం. ఆ క్యాడర్ నిర్మాణం ఇటు బీజేపీకి లేదు, అటు జనసేనకు కూడా లేదు. ఇలా మరోసారి తమను నట్టేట ముంచే మరో నాయకుడు వచ్చాడని వారు వాపోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.
అప్పట్లో అన్న చిరంజీవి....
పవన్ కళ్యాణ్ కంటే ముందు ఒకసారి ఇలాంటిదే ఒక ప్రయోగం జరిగింది. స్వయానా పవన్ కళ్యాణ్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పేరిట పార్టీని స్థాపించాఋ. ఎన్నాళ్ళనుండో అధికారం కోసం ఎదురు చూస్తున్న కాపులు తమ అధికార కాంక్ష తీరబోతోందన్న సంతోషంతో చిరు వెంట కాపులంతా నడిచారు.
అయితే 2009 ఎన్నికల్లో చిరు పార్టీ అనుకున్న మేర సత్ఫలితాలను సాధించలేకపోయింది. ఉమ్మడి రాష్ట్రం అవడం, తెలంగాణాలో అంత మెరుగైన ప్రదర్శన చేయలేకపోవడం తోపాటు అప్పుడు చిరు పార్టీకి కూడా ప్రస్తుత జనసేనకున్న సమస్య అయిన క్యాడర్ లేమి సమస్య బలంగా ఉంది.
Also read: లెఫ్ట్ పార్టీలకు నేను బాకీ ఉన్నానా: పవన్ కల్యాణ్, బాబుపై ఫైర్
అందువల్లనే చిరంజీవి జనసేన పార్టీ అనుకున్న ప్రదర్శన చేయలేకపోయింది. ఇన్ని కష్టనష్టాలకోర్చి, రాష్ట్రంలో అప్పుడు ఇద్దరు బలమైన నాయకులతో పోటీ పడి, తెలంగాణ వాదాన్ని సైతం ఎదురొడ్డి 18 సీట్లను సాధించింది.
ప్రస్తుత పవన్ కళ్యాణ్ పార్టీ 5 సంవత్సరాల తరువాత కూడా అన్ని సీట్లను సాధించలేకపోయింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రజారాజ్యం పార్టీ ప్రదర్శనను మంచి ప్రదర్శనగానే చెప్పుకోవచ్చు. చిరు పార్టీ అధికారాన్ని ఏర్పాటు చేయలేకపోయినప్పటికీ కూడా కాపులు ఆయన వెన్నంటే నడిచేందుకు సిద్ధపడ్డారు.
ఇలా కాపులు ఎన్నికల ఓటమి బాధ నుండి బయటపడి తమ రాజకీయ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్న తరుణంలోనే వారికి ఒక ఊహించని షాక్ ఇచ్చాడు చిరు. కాపుల ఆశలను - ఆశయాలను పక్కకు పెట్టి మరీ ప్రజారాజ్యం పార్టీని నాటి అధికార కాంగ్రెస్ పార్టీలో కలిపేసారూ.
చిరంజీవి ఇలా పార్టీని కలిపేసినప్పుడు కాపులను తమ వెంట ఉంచుకోవడానికి కాంగ్రెస్ ఇలాంటి పన్నాగం ఆడిందని వదంతులు కూడా వినిపించాయి. కానీ, ఏదిఏమైనా అధికార అందలం ఎక్కాలనుకున్న కాపుల కోరిక మాత్రం తీరలేదు. వారి ఆశలపై చిరంజీవి నీళ్లు చల్లాడు.
పవన్ రూపంలో మరో ఆశాకిరణం
చిరంజీవి చర్యల వల్ల ఒకింత లోలోన మధనపడిపోయినప్పటికీ... ఒక రెండేళ్లలో పవన్ కళ్యాణ్ రూపంలో మరో నాయకుడు వారికి కనబడ్డాడు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ వల్ల, అతడి భావజాలం వల్ల అతడిని చాలా బలంగా నమ్మారు.
అయితే 2014 ఎన్నికల్లో అసలు ప్రత్యక్ష బరిలోకి దిగేందుకు సిద్ధపడని పవన్ కళ్యాణ్, టీడీపీ - బీజేపీల కూటమికి మద్దతు పలికి కాపులను ఒకింత నిరాశపరిచైనా మాట వాస్తవం. సంస్థాగతంగా బలమైన నిర్మాణం లేని కారణంగా పవన్ ఆ నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడే పెట్టిన పార్టీ కావడంతో అంతా పవన్ మాటకు కట్టుబడి ఓటు వేశారు.
ఆ తరువాత సైతం ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ రాజకీయ చిత్రపటంపై కనపడకుండా పోయారు. పార్ట్ టైం పొలిటీషియన్ అని అందరూ ఎద్దేవా చేసేంతలా పవన్ కనబడలేదు. సరే అజ్ఞ్యాతవాసి సినిమా తరువాత ఇక సినిమాలు చేయనని వచ్చేసాడు. రాజకీయంగా కూడా ఆక్టివ్ అయ్యారు.
2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కి మద్దతుగా యావత్ కాపు సామాజికవర్గమంతా ముందుకు వచుయింది. కాకపోతే రాజకీయంగా అధికారంలో ఉన్న చంద్రబాబు కన్నా, విపక్ష వైసీపీని ఎక్కువగా టార్గెట్ చేయడం, వారు కూడా టీడీపీ-జనసేన ఒక్కటే అని పదే పదే చెప్పడం ఇత్యాది కారణాల వల్ల కాపుల్లో ఒకింత చీలిక ప్రస్ఫుటంగా కనిపించింది.
కాపు యువత ముఖ్యంగా పవన్ వెంట నడిచినా, ఇతర వయస్కుల ఓట్లలో చీలిక కనిపించింది. ఏది ఏమైనా పవన్ నాయకత్వంలో నడవడానికి మాత్రం కాపులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారు.
2019 ఎన్నికలు ముగిసాయి. జనసేన పార్టీ ఘోరమైన పరాభవాన్ని చూసింది. పవన్ కళ్యాణ్ కూడా రెండు చోట్ల ఓటమి చెందాడు. కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచాడు. అయినప్పటికీ ఎన్నికల తరువాత ప్రజాక్షేత్రంలోనే ఉంటానన్న పవన్ తనది 25 ఏండ్ల ప్రణాళిక అని చెప్పుకొచ్చాడు.
Also read; బిజెపితో పవన్ కల్యాణ్ పొత్తుపై చంద్రబాబు గప్ చుప్: అంచనా ఇదీ..
పవన్ మాటతో ఉత్సాహం పొందిన జనసైనికులు పార్టీ నిర్మాణం పట్ల కృషి తదితర కార్యక్రమాల్లో నిమగ్నమయిపోయిన తరుణంలో, ఇలా బీజేపీతో పొత్తు అనే బాంబులాంటి వార్త పేల్చారు.
2024 ఎన్నికల్లో పవన్ ప్రభంజనం సృష్టిస్తాడని బలంగా నమ్మి స్థానిక సంస్థల పోరుకు సమాయత్తమవుతున్న వేళ ఇలా పవన్ ఏ మాత్రం సంస్థాగత నిర్మాణం లేని, జనసేన కన్నా అధ్వాన స్థితిలో ఉన్న బీజేపీతో కలవడం ఇప్పుడు జనసైనికులకు మింగుడు పడడంలేదు.
ఇప్పుడు బీజేపీతో కలిస్తే అధికార అండదండలు, ఆర్థికసహాయం అందుతాయి కానీ డబ్బులే అన్ని పనులను చేయలేవుగా అని వారు వాపోతున్నారు. పవన్ సినిమాలు చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఇప్పటికే పింక్ చిత్రంలో పవన్ నటించడం దాదాపుగా ఖరారయిపోయింది.
ఈ తరుణంలో పవన్ ఇలా బీజేపీతో పొత్తును ముందుకు తీసుకురావడంతో, పవన్ జనసేనలో క్రియాశీలకంగా వ్యవహరించబోననే మెసేజ్ ని ఇస్తున్నారా.. లేక మున్ముందు రానున్న కాలంలో తన అన్న లాగే విలీనం చేయబోతున్నారా అనే ప్రశ్న మాత్రం ఉద్భవిస్తుంది.