ఇండియన్స్ కి ట్రంప్ షాక్ : ఐటీ మేజర్లపై....

ఇండియన్ ఐటీ సంస్థలు సమర్పిస్తున్న హెచ్1 బీ వీసా దరఖాస్తులను ట్రంప్ సర్కార్ భారీగా తిరస్కరిస్తోంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 32 శాతం అప్లికేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నాలుగేళ్లలో తిరస్కరణలు నాలుగు రెట్లు పెరిగాయి. తిరస్కరణకు గురైన హెచ్1 బీ వీసా దరఖాస్తుల్లో 90 శాతానికిపైగా భారతీయ ఐటీ కంపెనీలవే. యూఎస్‌సీఐఎస్‌ నిబంధనల కఠినతరమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఎల్‌–1 వీసాల మంజూరూ అంతంతే ఉన్నాయి.  
 

Indian Companies Worst Hit by H1-B Visa:Trump Govt

వాషింగ్టన్: అగ్రరాజ్యంలో ఉన్నత కొలువులు పొందాలని భావిస్తున్న మన టెక్ నిపుణుల ఆశలను అమెరికా ఆవిరి చేస్తోంది. ‘బై అమెరికన్‌... హైర్‌ అమెరికన్‌. ఉద్యోగ నియామకాల్లో అమెరికన్లకే ప్రాధాన్యం ఇవ్వాలి’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధాన నిర్ణయం తీసుకోవడమే కాక అమలులోనూ కఠినంగా వ్యవహరిస్తుండటం, విదేశీ నిపుణులు ముఖ్యంగా ఉత్తమ నైపుణ్యం గల ఇండియన్లకు అమెరికాలో ఉపాధి దూరమవుతున్నది. 

సైన్స్, ఇంజినీరింగ్ రంగాల్లో పట్టభద్రులై అమెరికాలో మంచి ఉద్యోగం పొందాలని భావించే వారికి హెచ్1-బీ వీసా పొందడమే గగనమవుతోంది. 2015లో హెచ్1 బీ వీసా దరఖాస్తుల తిరస్కరణలు ఆరుశాతంగా ఉంటే, ప్రస్తుత ఏడాది 24 శాతానికి చేరాయి. ఇది నాలుగేళ్లలో నాలుగు రెట్లు పెరిగింది. 

భారతీయ సాంకేతిక నిపుణులతోపాటు స్వదేశీ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు శాపంగా పరిణమిస్తోంది. అమెరికాలో పని చేసేందుకు మంజూరు చేసే వర్క్‌ వీసాల (హెచ్‌–1బీ) విషయంలో యునైటెడ్‌ స్టేట్స్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) నిబంధనలను కఠినతరం చేయడమే ఇందుకు కారణం.

also read న్యూజెర్సీలో వైబ్రాన్ట్ తెలంగాణ కార్యక్రమం: పాల్గొన్న మాజీ ఎంపీ వినోద్ కుమార్

ట్రంప్‌ దేశాధ్యక్షుడయ్యాక 2017లో మొత్తం దరఖాస్తుల్లో 13% తిరస్కరణకు గురవగా ఈ ఆర్థిక సంవత్సరం (అక్టోబర్‌ 2018–సెప్టెంబర్‌–2019) మొదటి త్రైమాసికం (అక్టోబర్‌–డిసెంబర్‌ 18)లో ఏకంగా 32% దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. గత 20 ఏళ్లలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. విచిత్రమేమిటంటే తిరస్కరణకు గురవుతున్న హెచ్‌1బీ వీసాలలో 90 శాతానికిపైగా భారతీయ ఐటీ కంపెనీలవే.

తొలి త్రైమాసికంలో భారతీయ కంపెనీల దరఖాస్తులు కనిష్టంగా 37 శాతం నుంచి గరిష్టంగా 62 శాతం తిరస్కరణకు గురయ్యాయి. తొలి త్రైమాసికంలోనే ఈ పరిస్థితి నెలకొంటే ఏడాది ముగిసే సరికి పరిస్థితులు ఎలా ఉంటాయోనని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. వీలైనంత త్వరగా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు నాస్కామ్‌ ప్రతినిధి ఒకరు చెప్పారు.

హెచ్‌1బీ దరఖాస్తుల విషయంలో యూఎస్‌సీఐఎస్‌ అమెరికన్‌ కంపెనీలకు అండగా నిలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో యాపిల్, ఫేస్‌బుక్‌లు సమర్పించిన హెచ్‌1బీ దరఖాస్తుల్లో 99 శాతం దరఖాస్తులకు ఆమోదం లభించింది. గూగుల్‌ 2 శాతం, మైక్రోసాఫ్ట్‌ 5 శాతం, అమెజాన్‌ 3 శాతం, ఇంటెల్‌ 8 శాతం హెచ్‌1బీ దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. 

ఈ ఆరు ప్రధాన కంపెనీలు సమర్పించిన హెచ్‌1బీ దరఖాస్తుల్లో 67 శాతం భారతీయులవే. వాటిలో 65 శాతం దరఖాస్తులకు ఆమోదం లభించింది. ఈ కంపెనీలు సమర్పించిన రెన్యువల్‌ హెచ్‌1బీ దర ఖాస్తుల ఆమోదం కూడా కనిష్టంగా 91 శాతం, గరిష్టంగా 98 శాతం దాకా ఉండటం గమనార్హం. 

అదే భారతీయ కంపెనీల దగ్గరకు వచ్చే సరికి ఆమోదం పొందిన  దరఖాస్తులు 82 శాతమే. గత పదేళ్ల గణాంకాలను తీసుకుంటే ఇదే ఆల్‌టైమ్‌ రికార్డు. 2009లో ఆరు శాతం రెన్యువల్‌ దరఖాస్తులు తిరస్కరణకు గురి కాగా 2019కు వచ్చేసరికి అది 18 శాతానికి ఎగబాకింది.

Indian Companies Worst Hit by H1-B Visa:Trump Govt

భారతీయ కంపెనీల హెచ్‌1బీ దరఖాస్తులు అత్యధికంగా తిరస్కరణకు గురి కావడమే కాక ఎల్‌–1 వీసాలనూ తక్కువ సంఖ్యలో ఇస్తుండటంతో ప్రాజెక్టులపై ప్రతికూల ప్రభావం పడుతోందని నాస్కామ్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఒకరు ఆందోళన వ్యక్తంచేశారు. అమెరికా సంస్థలకు వ్రుత్తిపరమైన ఐటీ సేవలందించే కనీసం 12 కంపెనీల హెచ్1 బీ దరఖాస్తుల్లో మూడో వంతు తిరస్కరణకు గురవుతున్నాయి.

ఈ జాబితాలో అసెంజర్, క్యాప్ జెమినీ తదితర దిగ్గజ సంస్థలు ఉన్నాయి. 2015లో హెచ్1 బీ వీసా దరఖాస్తుల తిరస్కరణ శాతం 2.7 శాతం అయితే, 2019 తొలి త్రైమాసికాల్లో 30 శాతం దాటాయి. నూతన నియామకాల్లో హెచ్1 బీ వీసా దరఖాస్తుల తిరస్కరణకు గురైన కంపెనీల్లో భారతీయ సంస్థలే అధికంగా ఉన్నాయి. 

దీన్ని బట్టి ట్రంప్ ప్రభుత్వం కావాలని చేస్తున్న అభిప్రాయం బలపడుతున్నది. అమెరికా కంపెనీలో పనిచేసే విదేశీ ఉద్యోగుల హెచ్1బీ వీసా కాల పరిమితి ముగిస్తే, పునరుద్ధరణలోనూ అంతే. అమెరికా కంపెనీల దరఖాస్తుల్లో తిరస్కరణలు అతి తక్కువగా ఉంటే భారతీయ కంపెనీలకు తిరస్కరణలు భారీగా పెరిగాయి. 

అమెరికాలోని భారతీయ కంపెనీల్లో పని చేసేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంగల అమెరికన్లు లేకపోవడం వల్ల ఆయా సంస్థలు భారతీయ నిపుణులను నియమించుకుంటున్నాయి. వారికి వర్క్‌ వీసాలు లభించక ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోవడం, ఖాతాదారులకు నాణ్యమైన సేవలు అందించలేక భారతీయ కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయి.

‘మాకు ఉన్న ప్రాజెక్టులు, వాటి కాలపరిమితిని దృష్టిలో ఉంచుకొని నిష్ణాతులైన ఇంజనీర్లను ఇక్కడి నుంచి పంపడమన్నది ఆనవాయితీగా వస్తోంది. కానీ ఇటీవల అమెరికా ఈ విషయంలో నిబంధనలను కఠినతరం చేస్తోంది. దీంతో కొన్ని ప్రాజెక్టులను అర్ధంతరంగా రద్దు చేసుకోవాల్సి వస్తోంది’ అని విప్రో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఒకరు చెప్పారు.

ఎల్‌–1 వీసాల కట్టడిపై అమెరికా వాదన మరోలా ఉంది. ‘ఎల్‌–1 వీసాలపై అమెరికా వస్తున్న ఉద్యోగులను కంపెనీలు టెక్నాలజీ అవసరాలకు కాక ఇతర వ్యాపారాలకు వాడుకుంటున్నాయి. అందుకే ఈ వీసాల తిరప్కరణ అధికమైంది. 

aslo read కత్తితో బెదిరించి అత్యాచారం, దోపిడీ... భారతీయుడికి 15 ఏండ్ల జైలు శిక్ష

దీనికితోడు సరైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించకపోవడం, ఇమ్మిగ్రేషన్‌ అధికారులు కోరిన ఇతర సమాచారం అందించడంలో వైఫల్యం వల్ల కూడా ఈ వీసాలు ఆమోదం లభించడంలేదు’ అని నార్త్‌ అమెరికన్‌ ఇమ్మిగ్రేషన్‌ లా కంపెనీ వ్యవస్థాపకుడు మార్క్‌ డేవిస్‌ అన్నారు.

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని తమ ఆఫీసులు లేదా క్లయింట్ల దగ్గర పని చేయడానికి భారతీయ కంపెనీలు ఉద్యోగులను ఎల్‌–1 వీసాలపై (తాత్కాలిక బదిలీపై అమెరికాలో పని చేయడానికి ఉద్దేశించిన వీసాలు) పంపుతుంటాయి. ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అవసరమైన ఇంజనీర్లను ఇక్కడి నుంచి తరలిస్తుంటాయి. పని, హోదా, అవసరాన్నిబట్టి ఎల్‌–1 వీసాలను కనిష్టంగా ఏడాది నుంచి గరిష్టంగా మూడేళ్లు అనుమతిస్తారు. 

ఇటీవల అమెరికా ఈ వీసాలను కట్టడి చేయడం మొదలుపెట్టింది. భారతీయ కంపెనీలు 2018లో ఎల్‌–1 వీసా కోసం చేసిన దరఖాస్తుల్లో 77.8 శాతం ఆమోదం పొందగా 2019 ఆర్థిక సంవత్సరం (అక్టోబర్‌– డిసెంబర్‌ 18) మొదటి త్రైమాసికంలో 71.9 శాతం దరఖాస్తులనే ఆమోదించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios