తెలుగు సాహిత్యం: దారి చూపే వ్యాసాలు ఇవీ...

డాక్టర్ పసునూరు రవీందర్ ఇమ్మతి పేరు మీద సాహిత్య వ్యాస సంకలనాన్ని తెచ్చారు. ఈ వ్యాసాల్లో తన దృక్కోణంతో పసునూరు రవీందర్ తెలుగు సాహిత్యాన్ని విశ్లేషించారు. 

Kasula Pratap reddy on Pasunuru Ravinder Immathi literary essays

(డాక్టర్ పసునూరి రవీందర్ ఇమ్మతి వ్యాస సంకలనం ఆవిష్కరణ సభ శనివారం మధ్యాహ్నం 2 గంటలకు రవీంద్ర భారతిలో జరుగుతోంది. ఆ వ్యాస సంకలనంపై రాసిన ముందుమాటను ఈ సందర్భంగా ఇక్కడ ఇస్తున్నాం).

పసునూరి రవీందర్‌ను చూసినప్పుడల్లా రెండు దశాబ్దాల కిందటి నన్ను చూసుకుంటున్నట్లు ఉంటుంది. నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా అభిప్రాయాలను వెల్లడించే వర్తమాన సాహిత్యకారుల్లో పసునూరి రవీందర్‌ ఉంటాడు. పసునూరి రవీందర్‌ది దళిత దృక్పథం. తాను ఏది రాసినా అంతస్సూత్రంగా ఆ ధార కొనసాగుతూ ఉంటుంది.

తెలుగు సాహిత్యంలో అస్తిత్వ ఉద్యమాలు వెళ్లూనుకుని ముందుకు సాగుతున్న క్రమంలో దళిత అస్తిత్వం తెలుగులో చాలా బలమైన వ్యక్తీకరణగా ముందుకు వచ్చింది. ఈ దళిత వ్యక్తీకరణకు బలమైన గొంతుకగా పసునూరి రవీందర్‌ కనిపిస్తాడు. అధిపత్యాలను ప్రశ్నించి, ధిక్కరించే కంఠస్వరం ఆయన సాహిత్యంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అయితే, ఆగ్రహంగానో, హద్దులు దాటే అరుపుల్లాగనో వ్యక్తం కాదు. రవీందర్‌లో సంయమనశీలి కనిపిస్తాడు. ఎదుటివారికి నచ్చజెప్పే వాదనాపటిమను సంతరించుకోవడం వల్ల అది సాధ్యమైంది అతనికి. దానికి విస్తృతమైన అధ్యయనం అవసరం. అధ్యయనం, అన్వేషణ, ఆరాటం, అణగారిన వర్గాలు ప్రాంతాల పట్ల అవసరమైన పక్షపాత వైఖరి అతన్ని తెలుగు సాహిత్యంలో ప్రత్యేకంగా నిలబెడుతాయి. కవిత్వం, కథ, పరిశోధన ద్వారా తెలంగాణ సాహిత్యంలోనే కాదు, తెలుగు సాహిత్యంలో ప్రత్యేక ముద్రను వేశాడు. ఇప్పటి ఇమ్మతి వ్యాసాలు కూడా ఆ విషయాన్ని తెలియజేస్తాయి.

Also Read: సమాజ మాగాణిలో చైతన్య *మొలక*

స్పష్టమైన అవగాహన వల్ల ఇమ్మతి సాహిత్య వ్యాసాలు చాలా సరళంగా కనిపిస్తాయి. సరళతకు, సంక్లిష్టతకు మధ్య వైరుధ్యం ఉన్నట్లు కనిపించవచ్చు. కానీ రెండు ఒక్కటే. సంక్లిష్టమైన విషయాను వెల్లడించడానికి అవసరమైన అధ్యయనం, అవగాహన రవీందర్‌ వ్యాసాలకు సరళతను సంతరించిపెట్టాయి. దళిత అస్తిత్వాన్ని భుజాల మీద మోస్తూనే పసునూరి రవీందర్‌ తెంగాణ అస్తిత్వాన్ని చాటుకున్నాడు. దళిత ఉద్యమానికి మాత్రమే కాకుండా తెలంగాణ ఉద్యమానికి కలాన్నే కాకుండా గళాన్ని కూడా ఇచ్చాడు. తనకున్న అవగాహన వల్ల, స్పష్టత వల్ల ‘స్థలకాలాల చిత్రణ ఎప్పటినుంచో ఉంది కానీ ఆధునికోత్తర సమయంలో ప్రాదేశికత మరింత నిర్దిష్టతను సంతరించుకుంది’ అని ‘తెంగాణ కథ ` ప్రాంతీయ అస్తిత్వం’ అనే వ్యాసంలో అనగలిగాడు. అలా తన తెంగాణ ప్రాదేశిక అస్తిత్వాన్ని పసునూరి రవీందర్‌ ప్రకటించుకున్నాడు.

తెలంగాణ అస్తిత్వవాదిగా తన ఉనికిని చాటుకుంటూనే దళిత అస్తిత్వవాదిగా నిబడడంలో వైరుధ్యమేమీ లేదని పసునూరి రవీందర్‌ తన ఈ వ్యాసాల ద్వారా నిరూపించాడు. తెంగాణ దళిత సాహిత్యాన్ని, కోస్తాంధ్ర లేదా నేటి ఆంధ్రప్రదేశ్‌ దళిత సాహిత్యంలో తులనాత్మక పరిశీలన చేసిన వ్యాసాలు ఈ సంపుటిలో ఉన్నాయి. రెండు శతాబ్దాల దళిత సాహిత్యం అనే వ్యాసంలో ఆ పనిచేశాడు. దున్న ఇద్దాసు విశిష్టతను, ప్రత్యేకతను తెలుగు పాఠకలోకానికి చాటి చెప్పాడు. తెలంగాణ నుంచి వెలువడిన ‘తొండము’ ప్రత్యేకతను చాటి చెప్పాడు. జాషువాను, కొలకూరి ఇనాక్‌ను ఆదరిస్తూనే తెంగాణ దళిత సాహిత్యవేత్తలకు తన వ్యాసాల్లో తగిన స్థానం కల్పిస్తూ దళిత సాహిత్యం సమగ్రతకు అవసరమైన పునాదులు వేశాడు. కొలకూరి ఇనాక్‌పై తెలుగు సాహిత్యానికి అరుదైన గౌరవం అనే వ్యాసం ద్వారా ప్రాంతమేదైనా దళిత ఉమ్మడి అస్తిత్వం తనది అనే విషయాన్ని రవీందర్‌ చాటుకున్నాడు. చెప్పాలంటే, విశాలమైన దృక్పథం ఉంటే తప్ప అలా ప్రకటించుకోవడం, అలా అక్కున చేర్చుకోవడం సాధ్యం కాదు.

Also Read: మట్టి మనసులో వెలుగు నక్షత్రాలు వేణు కథలు

బోయ జంగయ్య మీద కూడా ఓ వ్యాసం ఉంది. ఏదో ఒక ఉద్యమం వెంట నడవకుండా, దానికి అనుగుణంగా సాహిత్యాన్ని సృష్టించుకుండా మనుగడ సాగించడం కష్టమే. అయితే, అన్ని రకాల రణగొణ ధ్వనుల మధ్య తాను ఎవరికోసం రాయాలో, ఎందుకు రాయాలో స్పష్టంగా ఎరిగి సాహిత్య సృజన చేసినవాడు బోయ జంగయ్య. దళితులు, అణగారిన వర్గాలు శాస్త్రీయ దృక్పథాన్ని అలవరుచుకోవాలని, ఆధిపత్యాలను ధిక్కరించాలని బోధిస్తూ ఆ ఆధిపత్యాలను ధిక్కరించే అస్త్రాలను అందిస్తూ వచ్చిన రచయిత బోయ జంగయ్య. దార్ల రామచంద్ర రాసిన కిర్రుచెప్పులు కథ, జాజుల గౌరి మన్నుబువ్వ కథలు దళితులకు కావాల్సింది  చదువు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పిన తర్వాత గానీ బోయ జంగయ్య సాహిత్య విశిష్టత ఏమిటో బహుశా చాలా మందికి తెలిసి రాలేదు. వర్గ అస్తిత్వాన్ని విశ్వసించినా తెలుగు సమాజాన్ని పట్టించుకోకుండా కుల పునాదిని గుర్తించి సాహిత్య రచన చేసుకుంటూ వెళ్లిన రచయిత బోయ జంగయ్య. దాన్ని పసునూరి రవీందర్‌ తన ‘దళిత దార్శనికుడు బోయ జంగయ్య’ అనే వ్యాసంలో చాలా స్పష్టంగా వివరించాడు.

ఇక అరుణ్‌ సాగర్‌ ‘మాగ్జిమమ్‌ రిస్క్‌, మ్యూజిక్‌ గైడ్‌’ అనే కవిత్వంపై పసునూరి రవీందర్‌ రాసిన వ్యాసం అత్యంత విలువైంది. ‘మారుతున్న కాలపు మార్మికతను కవిత్వంలో చేర్చారు’ అనే నిర్ధారణ అత్యంత విలువైంది. అరుణ్‌ సాగర్‌ అంతకు ముందు వెలువరించిన ‘మేల్‌కొలుపు’, ‘మియర్‌మేల్‌’ కవితాసంపుటాలపై కె. శ్రీనివాస్‌ రాసిన తర్వాత ఏమీ మిగలలేదని నాకు అనిపించింది. అలాగే, మాగ్జిమమ్‌ రిస్క్ కు ఘంటా చక్రపాణి రాసిన ముందు మాట రాసిన తర్వాత దానిపై మనం చేయి చేసుకోవడం సాహసమే అనిపిస్తుంది. కానీ, పసునూరి రవీందర్‌ దానిపై చేసిన విశ్లేషణను చూస్తే రాయాల్సింది ఇంకా ఉన్నట్లే అనిపించింది. ఎందుకంటే, అరుణ్‌సాగర్‌ కాలాన్ని ఒడిసిపట్టుకున్నాడు అనే నిశితమైన దృష్టి వల్ల దాన్ని గుర్తించడానికి వీలైంది.

Also Read: జీవితాలను పెనవేసుకున్న దండకడియం

ఈ ఇమ్మతి పుస్తకంలో ‘ఊరే ఊట సెలిమ దళిత భాష’ అనే వ్యాసం అత్యంత విలువైంది. నోమ్‌ చామ్‌స్కీ భాషాసిద్ధాంతం తెలుగు సమాజానికి ఎక్కువగా వర్తిస్తుందని అనిపిస్తుంది. భాష అనేది కేవలం సమాచార మాధ్యమమే కాదు, దానికీ రాజకీయం ఉందని పసునూరి రవీందర్‌ గుర్తించాడు. దాన్ని ఒక రాజకీయ పనిముట్టుగా అతను భావిస్తాడు. చిన్నయసూరి సూత్రాన్ని ఉటంకిస్తూ దళిత భాష బ్రాహ్మణ వ్యాకరణ సూత్రాల్లో ఇమడదని అత్యంత స్పష్టంగా గుర్తించిన రచయిత పసునూరి రవీందర్‌. 

కవులకు గ్రామాలపై భ్రమలున్నాయి. అందుకే, నగరీకరణను వ్యతిరేకించడానికి పల్లెను కీర్తించడం ఇప్పటికీ కొనసాగిస్తూ వస్తున్నారు. పసునూరి రవీందర్‌ ‘గ్రామ పునాదులను కదిలిస్తున్న కవిత్వం’ అనే వ్యాసంలో ఆ భ్రమను పటాపంచలు చేశాడు. కుల అవమానాల రంపెపు కోతగా గ్రామాన్ని చూశాడు. ఇది పూర్తి వాస్తవిక దృక్పథంతో కూడిన దృష్టి. కుల మూలాలన్నీ గ్రామాల్లోనే ఉన్నాయి. సమాజంలో అణచివేతకు, అవమానాలకు కారణమైన కులం కేంద్రంగా ఉన్న గ్రామం దళితుల వైపు నుంచి చూస్తే ఏ మాత్రం ప్రేమపూరితమైంది కాదు, పైగా వ్యతిరేకించదగింది.

Kasula Pratap reddy on Pasunuru Ravinder Immathi literary essays

ఇంకా ఈ పుస్తకంలో మరిన్ని వ్యాసాలు ఉన్నాయి. చుక్క సత్తయ్యపై, మిద్దె రాములు, సుద్దాల హన్మంతుపై పసునూరి రవీందర్‌ రాసిన వ్యాసాలు విలువైనవి. తెలంగాణ దళిత కథా వస్తువు పరిణామ క్రమాన్ని వివరిస్తూ కూడా ఓ వ్యాసంఉంది. పసునూరి రవీందర్‌ వ్యాసాల్లో లోతైన విశ్లేషణ ఉంది. నిష్పాక్షిక దృష్టి ఉంది. విషయ పరిశీలనకు అవసరమైన సమగ్ర సమాచారం ఉంది. ఈ వ్యాసాలు చాలా నిబద్ధతతో రాసినవి. నిజాయితీ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇప్పుడు సమాజానికి ఏం కావాలో చెప్పే భవిష్యద్దర్శనం ఉంది. లేకుంటే, ‘తెలంగాణ ఏర్పాటుతో అధికారం అగ్రవర్ణాల నుంచి అగ్రవర్ణాలకే బదిలీ అయింది’ అని ఉండగలిగేవాడు కాడు.

ఈ కాలానికి అవసరమైన విమర్శకుడు, పరిశోధకుడు పసునూరి రవీందర్‌. సమాజానికి మనం అందించాల్సిందేమిటో తెలుసుకోవడానికి కూడా ఈ వ్యాసాలను చదవాలి. వ్యాసపరిమితిని ఎరిగిన శైలి పసునూరి రవీందర్‌ది. అందువల్ల ఇవి అత్యంత పఠనయోగ్యాలుగా కూడా రూపుదిద్దుకున్నాయి. కథను చదివినంత తేలికగా వీటిని చదవడానికి వీలవుతుంది. అలాంటి వీలును కల్పిస్తూ లోతైన విషయాలను అవగాహన చేసుకోవడానికి పనికి వస్తాయని నేను గట్టిగానే నమ్ముతున్నాను.

- కాసుల ప్రతాపరెడ్డి

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios