పాత ఊట...(రజనీ 'పేట' రివ్యూ)
ఒకప్పుడు రజనీ సినిమా అంటే స్టైల్స్, మేనరిజమ్స్ తో మాస్ కి పండగగా ఉండేది. అయితే కొంతకాలంగా ఆయన మెల్లిమెల్లిగా వాటికి దూరం అవుతూ వచ్చారు. ముఖ్యంగా 2.0 సినిమాల్లో అలాంటి అంశాలు పొందు పరచటానికి అవకాసమే లేదు.
---సూర్య ప్రకాష్ జోశ్యుల
ఒకప్పుడు రజనీ సినిమా అంటే స్టైల్స్, మేనరిజమ్స్ తో మాస్ కి పండగగా ఉండేది. అయితే కొంతకాలంగా ఆయన మెల్లిమెల్లిగా వాటికి దూరం అవుతూ వచ్చారు. ముఖ్యంగా 2.0 సినిమాల్లో అలాంటి అంశాలు పొందు పరచటానికి అవకాసమే లేదు. దాంతో అలాంటి ఎలిమెంట్స్ ని అన్ని ఓ చోట పోగిసి, వాటి చుట్టూ కథ అల్లేస్తే ఎలా ఉంటుంది, పాత రజనీని చూసి జనం మురిసిపోయి పెద్ద హిట్ చేసేస్తారు కదా అనిపించినట్లుంది కార్తీక్ సుబ్బరాజ్ కు. యంగ్ డైరక్టర్ అయినా తను చిన్నప్పుడు చూసిన రజనీ ని మళ్లీ తెరపైకు తెచ్చాడు. ఈ క్రమంలో ఆయన విజయం సాధించాడా..ఈ చిత్రంలో కథ ఏంటి...పేట..ఫ్యాన్స్ కు పండగ చేసుకునేలా ఉంటుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథేంటి..
కాలేజీ హాస్టల్ వార్డెన్ గా ఛార్జ్ తీసుకున్న కాళీ(రజనీకాంత్) అక్కడున్న ర్యాగింగ్ సమస్యపై దృష్టి పెడతాడు. ఆ తర్వాత ఫుడ్ కాంట్రాక్టర్ పనిపడతాడు. అంతేకాదు ఆ కాలేజీలో ఉన్న ఓ చిన్న సైడ్ విలన్ గ్రూప్ ని డీల్ చేస్తూంటారు. మరో ప్రక్క అక్కడ చదువుకునే స్టూడెంట్ తల్లి ప్రాణిక్ హీలర్ డాక్టర్(సిమ్రన్)తో కాళీకి పరిచయం అవుతుంది. ఆమెతో రొమాన్స్ సాంగ్ పాడుకుంటూ..వార్డెన్ గా వరసపెట్టి సమస్యలపై వార్ జరుపుతూంటాడు. ఈ లోగా పనిలో పనిగా ఒక ప్రేమ జంటను కూడా కలుపుతాడు. ఆ పరిస్థితుల్లో లోకల్ గూండాతో గొడవ పెట్టుకోవాల్సి వస్తుంది. కాళీపై మర్డర్ ఎటెమ్ట్ సైతం జరుగుతూంటాయి. ఓ సాదా సీదా సరదా వార్డెన్ పై మర్డర్ ఎటెమ్ట్ ఎవరు చూస్తారు.
ఇలా ఆలోచన పడుతున్న మనకు కాళీ గురించిన అతి పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఎదురుగా ఉన్న వార్డెన్ అసలు పేరు ... కాళీ కాదు... పేట (పెట్ట వీర) అని తెలుస్తుంది. అంతేకాదు అతనికి ఉత్తరప్రదేశ్ అని, ఓ పని మీద అక్కడికి వచ్చాడని తెలుస్తోంది. అలాగే ఉత్తర్‌ప్రదేశ్‌లోని సింహాచలం(నవాజుద్దీన్) అనే పొలిటీషన్ తో ఈ వార్డన్ ఆల్రెడీ వార్ జోన్ లో ఉన్నాడని తెలుస్తుంది . ఇంతకీ పేట ప్లాష్ బ్యాక్ ఏమిటి, పేట, కాళీగా ఎందుకు మారాడు..? సింహాచలం(నవాజుద్ధీన్ సిద్ధిఖీ)కు, జిత్తు (విజయ్ సేతుపతి ) పాత్రకు..పేటకు మధ్య గొడవ ఏంటి? కథలో త్రిష పాత్ర ఏమిటి... ఫైనల్ గా ఏం జరిగింది అనేది తెరపై చూడాల్సిన కథ.
ఎలా ఉందంటే..
వెనకటికి ఎవడో ..వంకాయ కూర బాగుందే అంటే...వాళ్లావిడ దాన్ని దాచి మరుసటి రోజు మళ్లీ అదే కూర వేసి పెట్టిందిట. అప్పటికి అది వాసన వచ్చేసింది. ఫ్రిజ్ లు లేని రోజుల్లోని జోకే అయినా పేట సినిమా చూస్తుంటే అదే గుర్తు వస్తుంది. రజనీకాంత్ సినిమాలంటే జనాలకు ఓ మోజు..క్రేజు..ఎందుకంటే ఆయన స్టైల్స్, మేనరింజమ్స్ అంతలా మెప్పిప్పాయి. అయితే కథ లేకుండా కేవలం వాటినే హైలెట్ చేస్తూ సినిమా చేస్తే...ఎలా ఉంటుంది.. యూట్యూబ్ లో అవన్నీ దొరుకుతున్నాయి కదా ...మళ్లీ స్పెషల్ గా చూపటం ఎందుకు అనిపిస్తుంది. అదే ఈ విషయం కార్తీక్ సుబ్బరాజ్ మర్చిపోయనట్లున్నారు.
ఆయన స్టైల్స్ ని పెట్టుకున్నా కథ, కథనం కొత్తగా ఉంటే అంత ఇబ్బందిగా ఉండదు. కానీ అది చేయలేదు. రజనీకాంత్ సూపర్ హిట్ భాషా స్టోరీ లైన్ నే రిపీట్ చేసారు. దాంతో భాషానే కొద్దిగా మార్చి రీమేక్ చేసారా అనిపిస్తుంది. అది అంతగా ఆకట్టుకోదు..
సుబ్బరాజు ఎందుకు.. సురేష్ కృష్ణను పిలిస్తే చాలు..
హీరో ఎక్కడో అజ్ఞాతవాసిలా బ్రతకటం.. ఓ ఫైన్ డే రోజున ప్లాష్ బ్యాక్ రివీల్ అవటం అనే స్క్రీన్ ప్లే భాషాతో పుట్టి,పాపులర్ అయ్యింది. బి.గోపాల్, రాజమౌళి, మురగదాస్ వంటి స్టార్ డైరక్టర్స్ సైతం ఇదే స్క్రీన్ ప్లేని తమ సినిమాల్లో తెగ వాడేసి...ప్రెడిక్టబుల్ గా మార్చేసారు. కథ ఎక్కడో జరుగుతోందంటే ఖచ్చితంగా ఇంట్రవెల్ దగ్గర ప్లాష్ బ్యాక్ ట్విస్ట్ ఉంటుందని అంచనా వేసేసే స్దాయికి ప్రేక్షకులు వచ్చేసారు. ఈ నేపధ్యంలో భాషాలో నటించిన రజనీతో మళ్లీ అలాంటి కథనే వండి వడ్డించారంటే ఏ ధైర్యం,నమ్మకంతో ఈ సినిమా చేసారో అర్దం కాదు. అలాగే రజనీకాంత్ సైతం ఇలాంటి యువ దర్శకులతో చేసేటప్పుడు కూడా ఇవే కథలు ఎందుకు చేయటం...ఈ మాత్రం భాషా మళ్లీ తీయటానికి సుబ్బరాజు ఎందుకు .. బాషా దర్శకుడు సురేష్ కృష్ణను పిలిస్తే పోతుంది కదా..
రజనీదే కష్టం
ఇక పాత వింటేజ్ లుక్ లోకి రావటానికి రజనీ పడిన కష్టం తెరపై కనపడుతుంది. ఆయన తన స్టైల్స్ , మేనరిజంలను చాలా ఎంజాయ్ చేస్తూ చేసారని అర్దమవుతుంది. ఇక త్రిష, సిమ్రన్ ..ఇద్దరూ ఏజ్ కనపడింది. రజనీనే వాళ్ల ముందు కుర్రాడిలా ఉన్నాడు కొన్ని సీన్స్ లో. విజయ్ సేతుపతి మాత్రం ఎక్సలెంట్, నవాజుద్ధీన్ సిద్ధిఖీ నామ మాత్రంగా ఉన్నారు.
టెక్నికల్ గా..
మొదటే చెప్పుకున్నట్లు కథలో కొత్తదనం లేదు. దానికి తోడు అరవ వాసన అడుగడుగునా ఎంజాయ్ చేయటానికి అడ్డుపడుతుంది. అనిరుధ్ కూడా ఈ సినిమాకు ఎవరూ పెద్దగా కష్టపడనప్పుడు నేను మాత్రం ఎందుకు కష్టపడాలి అనుకున్నట్లున్నాడు... పాటలు ఏవీ గొప్పగా లేవు. బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ మాత్రం భీబత్సం. తిరు కెమెరా వర్క్ రజనీ సినిమాల స్టాండర్డ్స్ లో ఉంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు ఓకే.
ఫైనల్ ధాట్
ఏ పేటలో అయినా పాత పాటే పాడితే పట్టుమని పదిమంది కూడా ఉండరు.
రేటింగ్: 2/5
నటీనటులు: రజనీకాంత్, సిమ్రన్, త్రిష, విజయ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ, బాబీ సింహా, యోగిబాబు తదితరులు
సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్
సినిమాటోగ్రఫీ: తిరు
ఎడిటింగ్: వివేక్ హర్షన్
నిర్మాత: కళానిధి మారన్, అశోక్ వల్లభనేని
దర్శకత్వం: కార్తీక్ సుబ్బరాజు
సంస్థ: సన్ పిక్చర్స్
విడుదల: 10-01-2019