Asianet News TeluguAsianet News Telugu

రివ్యూ: మను

టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. అయితే గౌతమ్ నటించిన సినిమాలు ఆయన్ని హీరోగా నిలబెట్టలేకపోతున్నాయి. 

manu telugu movie review
Author
Hyderabad, First Published Sep 7, 2018, 2:05 PM IST

నటీనటులు: రాజా గౌతమ్‌, చాందినీ చౌదరి, జాన్‌ కోట్లే, అభిరామ్‌, మోహన్‌ భగత్‌ తదితరులు
సంగీతం: నరేష్‌ కుమారన్‌
సినిమాటోగ్రఫీ: విశ్వనాథ్‌రెడ్డి
ఎడిటింగ్: ఫణీంద్ర నరిశెట్టి
నిర్మాణం: ది క్రౌడ్‌
దర్శకత్వం: ఫణీంద్ర నరిశెట్టి

టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. అయితే గౌతమ్ నటించిన సినిమాలు ఆయన్ని హీరోగా నిలబెట్టలేకపోతున్నాయి. ఈ క్రమంలో మూడున్నరేళ్లు కష్టపడి 'మను' అనే సినిమా కోసం పని చేశాడు. ఈ సినిమా పోస్టర్స్, ట్రైలర్స్ తో ఆడియన్స్ దృష్టి ఆకర్షించింది. మరి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఎంతమేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ: 
ఈస్ట్ కోస్ట్ సముద్ర తీరంలో సియా అనే దీవిలో నివసించే ఆర్టిస్ట్ మను(రాజా గౌతమ్). అక్కడే ఫోటో స్టూడియోని నడుపుతూ తన తండ్రితో కలిసి జీవిస్తుంటుంది నీల(చాందిని చౌదరి). మను ఆర్ట్ అంటే నీలకి చాలా ఇష్టం. అయితే వీరి పరిచయం మాత్రం గొడవతో మొదలవుతుంది. ఆ తరువాత మనుని అర్ధం చేసుకొని అతడిని ప్రేమిస్తుంది నీల. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడిన తరువాత వీరి జీవితంలో లోకి నలుగురు వ్యక్తులు ప్రవేశిస్తారు. వారి కారణంగా మను, నీల ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది..? చివరికి వీరి ప్రేమ సక్సెస్ అవుతుందా..? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

విశ్లేషణ: 
ఓ వజ్రాన్ని దొంగిలించడం కోసం ముగ్గురు వ్యక్తులు చేసే పని కారణంగా ఇద్దరు వ్యక్తుల జీవితాలు ఎలా మలుపు తీసుకుంటాయనే పాయింట్ తో దర్శకుడు ఈ సినిమా కథను రాసుకున్నాడు. సినిమా మొదలైన కాసేపటికే ఇదొక క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో నడిచే కథ అనుకుంటాం. కానీ కొద్దిసేపటికే హారర్ జోనర్ లో కథ నడుస్తుంది. హారర్ అంటే మన తెలుగు సినిమాల్లో కనిపించే తెల్లజీర, విరబూసిన జుట్టు లాంటి రొటీన్ సన్నివేశాలు కాకుండా కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. సినిమా కోసం ఒక దీవిని సెలెక్ట్ చేసుకోవడం, కథనాన్ని కొత్తగా నడిపించాలని డైరెక్టర్ చేసిన ప్రయత్నం పూర్తి స్థాయిలో వర్కవుట్ కాలేదు.

ఒకే కథను పలు రకాల జోనర్లలో నడిపిస్తూ ఆడియన్స్ ను థ్రిల్ చేయడానికి ట్రై చేసి దర్శకుడు బోల్తా పడ్డాడు. స్క్రీన్ ప్లే పరంగా దొర్లిన తప్పులు సినిమాను దెబ్బతీశాయి. దర్శకుడు అనుకున్న పాయింట్ కొత్తగా ఉన్నప్పటికీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విషయంలో తప్పులు జరగడంతో సినిమా రిజల్ట్ పై దాని ప్రభావం పడింది. ప్రయోగాత్మక సినిమా చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా తీయగలమా..? లేదా..? అని కూడా చూసుకోవాలి. మనం చెప్పాలనుకునే పాయింట్ ఆడియన్స్ కి అర్ధంకాకుండా కన్ఫ్యూజన్ లో పడేస్తే.. గనుక ఇంక అంతే సంగతులు. ఈ సినిమా పరిస్థితి కూడా అదే.

హీరో పాత్ర చెప్పే డైలాగ్స్ అర్ధం చేసుకుంటే పర్వాలేదు లేదంటే మాత్రం అయోమయానికి గురవుతాం. ఈ సినిమా కోసం హీరో రాజా గౌతమ్ మూడున్నరేళ్లు కష్టపడ్డానని చెప్పాడు. సినిమా చూసిన తరువాత అంతగా కష్టపడానికి ఏముందని అనిపిస్తుంది. కానీ తన మార్చుకొని డిక్షన్ విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకున్నాడు. సరికొత్తగా కనిపిస్తూ సన్నివేశానికి తగ్గట్లుగా నటిస్తూ మెప్పించాడు. కథ మొత్తం అతడి చుట్టూనే తిరుగుతుంటుంది. చాందిని చౌదరి గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో నటన పరంగా ఆకట్టుకుంటుంది. తెరపై అందంగా కూడా కనిపించింది. టిపికల్ రోల్ లో కనిపించి తన నటనతో మెప్పించాడు అభిరాం వర్మ. మిగిలిన పాత్రదారులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

నరేష్ అందించిన నేపధ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ. సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ప్లస్. కథ మొత్తం రెండు, మూడు గదుల్లోనే జరుగుతున్నప్పటికీ ఆ ఫీలింగ్ ప్రేక్షకులకు కలగదు. లొకేషన్లు కొత్త అనుభూతిని కలిగిస్తాయి. దర్శకుడిగా తన భావాలను ప్రేక్షకులకు చెప్పే తొందరలో ఫణీంద్ర నరిశెట్టి ఏదేదో చెప్పేశాడు. గంటన్నరలో చెప్పాల్సిన కథని మూడు గంటల పాటు సాగదీసి ప్రేక్షకులకు విసుగొచ్చేలా చేశాడు. ఆయన రాసుకున్న డైలాగ్స్ లో కొన్ని ప్రశ్నలుగానే మిగిలిపోతాయి. ఈ ప్రయోగం ఆడియన్స్ కు అర్ధమవ్వడం కష్టమనిపిస్తుంది. రెగ్యులర్ సినిమాలు చూసి బోర్ కొట్టిన ఆడియన్స్ మాత్రం ఒకసారి ఈ సినిమా చూసే సాహసం చేయొచ్చు. 

రేటింగ్: 2/5 

ఇవి కూడా చదవండి.. 

రివ్యూ: C/o కంచరపాలెం

రివ్యూ: సిల్లీ ఫెలోస్

Follow Us:
Download App:
  • android
  • ios