న్యూఢిల్లీ: కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చాక కొత్త ఉద్యోగాలు కల్పించడం కంటే కొలువులు కోల్పోయిన వారి సంఖ్యే ఎక్కువ. ముఖ్యంగా 2016 నవంబర్‌లో అనూహ్యంగా చేపట్టిన రూ.500, రూ.1000 నోట్ల రద్దు పలు రంగాలను చిన్నాభిన్నం చేసింది. ఫలితంగా లక్షల మంది ఉపాధి కోల్పోవడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 

దేశ ఆర్ధిక వ్యవస్థలో నెలకొన్న మాంద్యం దెబ్బకు వాహన, రియాల్టీ, ఐటీ తదితర రంగాల్లో భారీగా ఉద్యోగాల్లో కోత విధించాయి. ఫలితంగా ఆయా ఉద్యోగుల కుటుంబాల పరిస్థితి తీవ్ర ఆందోళనకర స్థితికి చేరుకుంది. గత 45 ఏళ్లల్లో ఎన్నడూ లేని విధంగా 2017-18లో దేశంలో భారత్‌లో నిరుద్యోగం ఆరు శాతానికి పెరిగిందని కేంద్ర ప్రభుత్వ గణంకాల శాఖ అనుబంధ సంస్థ ఎన్‌ఎస్‌ఎస్‌ఓ తెలిపింది. 

also read Budget 2020: బడ్జెట్‌లో ఆదాయ పన్నులో కోతలు...నిపుణులు అంచనా

ఈ క్లిష్ట పరిస్థితుల్లో దేశంలో ఉపాధి కల్పన పెంచేలా ప్రభుత్వం ఇకనైనా దృష్టి సారించాల్సి ఉంది. ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లోకి జారుకున్న నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లోనైనా సర్కార్ ఉద్యోగాల కల్పన దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు. 

ప్రభుత్వ ఆర్ధిక విధానాలతో దేశంలో మందగమన పరిస్థితులు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఉపాధి కల్పనపై తీవ్ర ప్రభావం నెలకొనడంతో ఆయా రంగాల అమ్మకాలు కుదేలవుతున్నాయి. అమ్మకాలు తగ్గడంతో పరిశ్రమ వర్గాలు ఉత్పత్తిని తగ్గించుకోవడం లేదా నిలిపివేయడం వంటి చర్యలకు దిగుతున్నాయి. దీంతో ఉన్న కొలువులు కొండెక్కుతున్నాయి. 

ఆర్థిక వ్యవస్థ పనితీరుకు ప్రత్యక్షంగా అద్దం పట్టే వాహన, స్థిరాస్తి, ఐటి, విత్త సంస్థల విభాగంలో భారీగా ఉద్యోగ కోతలు నమోదవుతున్నాయి. ఇక ఆయా కంపెనీలు కొత్త ఉద్యోగ ప్రకటనలివ్వడం లేదు. ఈ పరిణామాలను ప్రధానంగా తీసుకోవడం వల్ల ఉపాధి కల్పన పెంచడానికి దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి కేంద్రం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

పెట్టుబడులు పెరిగేలా ప్రభుత్వ విధానాలు ఉండాలని పేర్కొంటున్నారు. టెలికం రంగంలోకి రిలయన్స్‌ జియో రంగ ప్రవేశంతో టెలినార్‌, ఎయిర్‌సెల్‌, టాటా కమ్యూనికేషన్స్‌, ఆర్‌కామ్‌, ఎంటీఎస్‌ లాంటి సంస్థలు మూత పడ్డాయి. దీంతో ఈ కంపెనీల్లో పని చేసే లక్షల మంది రోడ్డున పడ్డారు.

2019 సెప్టెంబర్‌ - డిసెంబర్‌ త్రైమాసికంలో భారత్‌లో నిరుద్యోగం 7.5 శాతానికి చేరిందని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) ఓ నివేదికలో వెల్లడించింది. భారత్‌లో 60 శాతం అక్షరాస్యత ఉన్నా, ఈ స్థాయిలో నిరుద్యోగం పెరగడం ఆందోళనకరమని హెచ్చరించింది. 

2017 మే- ఆగస్టులో 3.8 శాతంగా ఉన్న నిరుద్యోగం వరుసగా ఏడో సారి ఎగిసి రెట్టింపు స్థాయికి చేరిందని సీఎంఐఇ పేర్కొంది. దీంతో కేవలం రెండున్నరేళ్లలోనే నిరుద్యోగం రెట్టింపైనట్లైంది. సీఎంఐఇ దాదాపు 1,74,405 కుటుంబాలను సర్వే చేసి ఈ నివేదిక రూపొందించింది.గ్రామాలతో పోల్చితే పట్టణాల్లోనే అత్యధికంగా తొమ్మిది శాతం నిరుద్యోగం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది 6.8 శాతంగా నమోదయ్యింది. మొత్తం నిరుద్యోగుల్లో 66 శాతం వాటా గ్రామీణ ప్రాంతాలదే.

ఉపాధికి ఎక్కువ అవకాశాలు కల్పించే చిన్న పరిశ్రమలకు మద్దతు పెరిగేలా బడ్జెట్‌ రూపకల్పన జరగాలని ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ మాజీ ఛైర్మన్‌ ఎస్‌ ఎస్‌ మంత పేర్కొన్నారు. మౌలిక వసతుల సంస్థలు ఎక్కువ ఉద్యోగాలు కల్పించడానికి ఆస్కారం ఉన్న రంగం అన్నారు. 

also read budget 2020: మధ్యతరగతి వారికి గుడ్ న్యూస్...రూ. 7 లక్షల దాకా.. నో ట్యాక్స్...

విద్య, నైపుణ్యాభివృద్ధి సామర్థ్యాలు పెంచేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ మాజీ ఛైర్మన్‌ ఎస్‌ ఎస్‌ మంత అన్నారు. ప్రస్తుత విద్యా విధానం కూడా ఆ విధంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా పట్టణ యువత నైపుణ్య కొరతతో నిరుద్యోగాన్ని ఎక్కువగా ఎదుర్కుంటుందన్నారు.

ఉన్న ఉద్యోగాలు ఊడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, పారిశ్రామిక వికేంద్రీకరణ జరగాలని అభ్యర్థనలు వ్యక్తం అవుతున్నాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మద్దతునివ్వాలని, స్వయం ఉపాధి కల్పనకు ప్రోత్సాహాకాలు పెంచాల్సి ఉందని చెబుతున్నారు.

వృద్ధి రేటు పెంపునకు చర్యలు తీసుకోవాలని, నైపుణ్య శిక్షణ ఇచ్చే కోర్సులను ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌లో గ్రామీణ యువతను తీర్చిదిద్ది, ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజీల్లో సమూల మార్పులు చేపట్టాలన్న వినతులు వెలువడుతున్నాయి. తద్వారా నిరుద్యోగులకు అన్వేషణ అవకాశాలను పెంచాలని, ఉపాధి అవకాశాల్లో వివక్షను తగ్గించి, ఔత్సాహికవేత్తలకు రుణ లభ్యతను పెంచాలని సూచిస్తున్నారు.