ఈజిట్? ఫెస్టివ్ సీజన్‌లోనూ తగ్గిన పసిడి దిగుమతులు!
భారతదేశంలో ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా బంగారానికి భారీగా గిరాకీ తగ్గింది. జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో 32% క్షీణత నమోదైంది. దీనికి అధిక ధర, ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ అని డబ్ల్యూజీసీ తాజా నివేదికలో తెలిపింది. భారతదేశంలో బంగారానికి డిమాండ్ మూడేళ్ల కనిష్టానికి పడిపోతుందని హెచ్చరించింది.
న్యూఢిల్లీ: భారతీయులకు బంగారంపై మోజెక్కువే. పసిడి వినియోగంలో చైనా తర్వాత స్థానం మనదే. కానీ, ఈ మధ్య కాలంలో పరిస్థితులు మారాయి. భారత్‌లో బంగారానికి డిమాండ్ భారీగా తగ్గిందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) అంటోంది. జూలై-సెప్టెంబరు త్రైమాసికంలో పసిడి గిరాకీ 32 శాతం క్షీణించి 123.9 టన్నులకు పడిపోయిందని తాజా నివేదికలో వెల్లడించింది.
2019లో పుత్తడి డిమాండ్ మూడేళ్ల కనిష్ఠ స్థాయి 700-750 టన్నులకు తగ్గవచ్చని, 2018తో పోలిస్తే 8 శాతం మేర తగ్గవచ్చని డబ్ల్యూజీసీ అంచనా వేస్తోంది. ఈ ఏడాది పసిడి దిగుమతులూ భారీ తగ్గవచ్చునంటున్నది. 2016లో పసిడి గిరాకీ 667 టన్నులకు పరిమితమైంది.
అయితే, ఈ ఏడాదిలో ధర అనూహ్యంగా పెరగడంతోపాటు ఆర్థిక మాంద్యం పరిస్థితులే ఇందుకు ప్రధాన కారణమని డబ్ల్యూజీసీ పేర్కొంది. సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో భారత్‌లోకి పసిడి దిగుమతులు సైతం 66 శాతం తగ్గి 80.5 టన్నులకు పడిపోయాయి.
also read 10వేల కోట్లు దాటిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాభాలు
గతంలో దిగుమతి చేసుకున్న, రీసైక్లింగ్ చేసిన బంగారంతోనే ఆభరణ వర్తకుల అవసరాలు గట్టెక్కడంతో దిగుమతులు భారీగా తగ్గాయని డబ్ల్యూజీసీ తెలిపింది. సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో 24 క్యారెట్లతో కూడిన పది గ్రాముల పసిడి ధర రూ.39,000 ఎగువ స్థాయిలో కదలాడింది. ప్రస్తుతం ఈ స్థాయిలకు దిగువన ట్రేడవుతోంది.
ఈ ఏడాదిలో మొదటి 9 నెలల్లో అంటే జనవరి-సెప్టెంబర్ నెలల మధ్య గోల్డ్ డిమాండ్ 496.11 టన్నులకు పడిపోయింది. 2018లో ఇదే కాలానికి గిరాకీ 523.9 టన్నులుగా నమోదైంది. గత సంవత్సరం మొత్తానికి 760.4 టన్నులుగా ఉంది. ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ మధ్య కాలానికి బంగారం దిగుమతులు 502.9 టన్నులకు పరిమితమయ్యాయి.
గత ఏడాది ఇదే సమయానికి 587.3 టన్నులు దిగుమతైంది. గతేడాది మొత్తానికి 755.7 టన్నులు దిగుమతి చేసుకున్నది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలోనూ ధరలు గరిష్ఠ స్థాయిలోనే ఉండనున్నాయని డబ్ల్యూజీసీ అంటోంది.
కస్టమర్లు ప్రస్తుత స్థాయి ధరలకు అలవాటు పడేందుకు మరింత సమయం పట్టవచ్చు. గ్రామీణ మార్కెట్లో కొనసాగుతున్న ఒత్తిడి కారణంగా వినియోగదారుల సెంటిమెంట్ అంతగా మెరుగుపడలేదు. ధన్‌తేరస్, దీపావళి సమయంలో డిమాండ్ కాస్త పెరిగినా గత ఏడాదితో పోలిస్తే మాత్రం తక్కువే. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో ప్రస్తుత త్రైమాసికంలో కొనుగోళ్లు కాస్త పెరగవచ్చు.
సెప్టెంబర్ నెలాఖరు నాటికి గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లలో (ఈటీఎఫ్)లో పెట్టుబడులు సరికొత్త ఆల్‌టైం గరిష్ఠ స్థాయి 2,855.3 టన్నులకు చేరుకుందని డబ్ల్యూజీసీ తెలిపింది. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో మదుపర్లు భద్రమైన పెట్టుబడి సాధనంగా బంగారాన్ని ఎంచుకుంటున్నారంటోంది.
also read మళ్లీ ‘మహారాజా’ టాటా!! బిడ్ దాఖలుకు ఆసక్తి
సెప్టెంబర్ త్రైమాసికంలో భారత్, చైనాలో గిరాకీ తగ్గినా ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ డిమాండ్ మాత్రం 3 శాతం పెరగడం గమనార్హం. భారత్‌లో గోల్డ్ డిమాండ్ తగ్గడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని డబ్ల్యూజీసీ ఇండియా ఎండీ పీఆర్ సోమసుందరం చెప్పారు.
ఈ ఏడాదిలో సెప్టెంబర్ నాటికి బంగారం ధర 20 శాతం మేర పెరిగిందన్నారు. ఆర్థిక మందగమన ప్రభావంతో కొనుగోలుదారుల సెంటిమెంట్‌కు గండిపడటం మరో కారణం అని సోమసుందరం వివరించారు. అధిక ధరలతో పాటు గ్రామీణ మార్కెట్లో డిమాండ్ కొరవడటంతో దిగుమతులూ తగ్గాయని డబ్ల్యూజీసీ ఇండియా ఎండీ పీఆర్ సోమసుందరం చెప్పారు.
సాధారణంగా గిరాకీ తక్కువగా ఉన్నప్పుడు దేశీయంగా బంగారం రీసైక్లింగ్ పెరుగుతుందన్నారు. దాంతో ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరు నాటికి దేశంలో 90.5 టన్నుల రీసైక్లింగ్ జరిగిందని, గోల్డ్ రీసైక్లింగ్ అత్యధికంగా జరిగిన సంవత్సరాల్లో ఒకటిగా 2019 నిలిచిపోనున్నదని సోమసుందరం వివరించారు.