RTC strike: విలీనం పక్కనబెట్టి.. మిగిలిన డిమాండ్లు చూడాలన్న హైకోర్టు

By sivanagaprasad KodatiFirst Published Oct 28, 2019, 3:12 PM IST
Highlights

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఆర్టీసీ తరపున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. విలీనం సహా అన్ని డిమాండ్లపై చర్చ జరగాలని కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయని ఏజీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఆర్టీసీ తరపున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. విలీనం సహా అన్ని డిమాండ్లపై చర్చ జరగాలని కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయని ఏజీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

కోర్టు ఆదేశాల ప్రకారం 21 ప్రధాన డిమాండ్లపై చర్చిద్దామన్నా వినలేదని.. యూనియన్ నాయకులు చర్చలు జరపకుండానే బయటకు వెళ్లిపోయారని ఆయన గుర్తు చేశారు. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం విలీనం డిమాండ్‌ను పక్కనబెట్టి మిగతా వాటిపై చర్చించాలని సూచించింది.

చర్చలు జరిగితేనే కార్మికుల్లో ఆత్మస్థైర్యం కలుగుతుందని హైకోర్టు తెలిపింది. ఆర్థిక భారం కాని డిమాండ్లపై చర్చలు జరపాలని సూచించింది. ఒక్క డిమాండ్‌పై పట్టుబట్టకుండా మిగిలిన డిమాండ్లపై చర్చ జరపవచ్చు కదా అని న్యాయస్థానం ప్రశ్నించింది.

Also Read:RTC Strike:విషాదం...మహిళా ఆర్టీసి కండక్టర్ ఆత్మహత్య

ఇదే సమయంలో కోర్టు ఆదేశాలను అధికారులు తప్పుగా అన్వయించుకున్నారని ఆర్టీసీ తరపు న్యాయవాది తెలిపారు. మొత్తం 45 డిమాండ్లలో కార్పోరేషన్‌పై ఆర్ధిక భారం కానీ డిమాండ్ల చర్చ జరగాలన్నామని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

రాత్రికి రాత్రి ఆర్టీసీ విలీనం సాధ్యం కాదు కదా అని ప్రశ్నించారు. సమ్మె నోటీసు ఇచ్చింది మొత్తం డిమాండ్ల మీద మాత్రమేనన్న ఆర్టీసీ న్యాయవాది...కేవలం డిమాండ్లు అన్న విధంగా అధికారులు ప్రచారం చేశారని తెలిపారు.

విలీనం డిమాండ్‌ను పక్కనబెట్టి మిగిలిన వాటిపై చర్చ జరగకపోతే ఇలానే ప్రతిష్టంభన కొనసాగుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇరువర్గాల మధ్య సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మరోసారి గుర్తు చేస్తున్నామని న్యాయస్థానం తెలిపింది.

21 డిమాండ్లలో 2 మాత్రమే ఆమోదయోగ్యమని ఆర్టీసీ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. మరో రెండు డిమాండ్ల అమలు అసాధ్యమని.. 16 డిమాండ్ల అమలుకు డబ్బులు అవసరమన్న యాజమాన్యం, ప్రస్తుతం ఆర్టీసీకి అంత ఆర్ధిక స్తోమత లేదని తెలియజేసింది.

ఇదే సమయంలో కార్మికుల సమ్మెలపై ఆర్టీసీ యాజమాన్య వైఖరిని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని సూచించింది. అదనపు అడ్వొకేట్ జనరల్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ..వెంటనే ఆయనను హాజరవ్వాల్సిందిగా ఆదేశించింది.

ఆర్టికల్ 226 ప్రకారం కోర్టుకు ఎలాంటి అధికారాలున్నాయో.. కోర్టుకు తెలిపే అధికారం అదనపు అడ్వొకేట్ జనరల్‌కు లేదని న్యాయస్థానం అభిప్రాయపడింది. కోర్టు ఆదేశాలతో ఏఏజీ బీఎస్ ప్రసాద్ వెంటనే ధర్మాసనం ముందు హాజరయ్యారు. 

చర్చల వివరాలతో అదనపు కౌంటర్ దాఖలు చేసిన ఆర్టీసీ యాజమాన్యం చర్చల సమయంలో అన్ని డిమాండ్లు చర్చించాలని కార్మిక సంఘాలు పట్టుపట్టాయని నివేదికలో తెలిపింది. 

మరోవైపు తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే కొందరు ఆర్టీసీ కార్మికులు బలవన్మరణాలకు పాల్పడగా తాజాగా మరో కార్మికురాలు ఆత్మహత్యకు పాల్పడింది.

Also Read:RTC Strike: చర్చలకు వెళితే ఖైదీల్లా ట్రీట్ చేశారు... ప్రభుత్వంపై అశ్వత్థామరెడ్డి ఫైర్

ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న నీరజ అనే మహిళ తన ఇంట్లోనే ఉరేసుకుని ప్రాణాలు విడిచింది. ఈ విషాద సంఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. 

మహిళా ఆర్టిసి ఉద్యోగి ఆత్మహత్యతో ఖమ్మం జిల్లాలో విషాదం అలుముకుంది. తమ సహచర ఉద్యోగి ఇలా ప్రాణత్యాగానికి  పాల్పడంతో జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యప్తంగా  ఆర్టీసీ ఉద్యోగులు విచారం వ్యక్తం చేస్తున్నారు.  ఆమె మృతదేహాన్ని సందర్శించిన ఆర్టీసీ కార్మికుల ఖమ్మం రీజినల్ జేఏసీ గడ్డం లింగమూర్తి కుటుంబ సభ్యులను ఓదార్చేప్రయత్నం చేశారు

ఆర్టీసి సమ్మె మొదలై దాదాపు  నెలరోజులే కావస్తోంది. అయినప్పటికి అటు ప్రభుత్వం గానీ, ఇటు కార్మిక సంఘాలు గానీ పట్టువిడుపును ప్రదర్శించకుండా మంకుపట్టును ప్రదర్శిస్తున్నాయి.

దీంతో ఇప్పటికే గతనెల(అక్టోబర్) జీతాలు రాక కార్మికులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ఇంకెంతకాలం ఈ సమ్మె కొనసాగుతుందో తెలీక మానసిక ఒత్తిడికి కూడా లోనవుతున్నారు. 

click me!