వినియోగదారుల నుంచి డిమాండ్ ఉంటే మందగమనం ఉన్నా.. రాజకీయ ఆర్థిక పరిస్థితులు భిన్నంగా ఉన్నా ప్రతికూలతలేమీ ఉండవని రుజువు చేశాయి ఈ ఏడాది స్మార్ట్ ఫోన్ల విక్రయాలు.. అయితే నూతన వసంతంలోనూ ఇదే ఒరవడి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేసినా.. ధరల పెరుగుదల ఆటంకం కావచ్చు. స్మార్ట్ ఫోన్ల తయారీ దారులు ఇన్నోవేటివ్‌గా ఉత్పత్తులను ఆవిష్కరిస్తే మాత్రం డిమాండ్‌కు కొదవ ఉండక పోవచ్చు.
న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనంలోనూ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు అదిరిపోయాయి. కార్లు, బైకుల దగ్గర్నుంచి బిస్కట్ల వరకు ఈ ఏడాది కొనుగోళ్లు పడిపోయినా.. స్మార్ట్‌ఫోన్ విక్రయాలు మాత్రం స్తంభించలేదు. 2019లో భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ తొమ్మిది శాతం పెరిగినట్లు తేలింది.
ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ మధ్య దేశంలోకి 115 మిలియన్లకుపైగా స్మార్ట్‌ఫోన్లు దిగుమతి అయ్యాయి. షియోమీ, శామ్‌సంగ్, వివో, ఒప్పో, రియల్‌మీ సంస్థలు టాప్-5లో నిలిచాయి. నిజానికి ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్ల సగటు ధరలు పెరిగాయి. నిరుడు రూ.5 వేల నుంచి 10 వేలు పలికిన స్మార్ట్‌ఫోన్లు.. ఈ ఏడాది రూ.10 వేల నుంచి 15 వేలకు చేరినా అమ్మకాలు ఆగలేదు. చాలా మంది ఖరీదైన మొబైల్ కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. ఈ క్రమంలోనే ప్రీమియం శ్రేణి మొబైల్ ఫోన్లకు ఆదరణ పెరిగింది.
also read రివ్యూ 2010-2019 దశాబ్దంలో ఎన్ని మార్పులో తెలుసా...?
రూ.14,000 నుంచి రూ.21,000-35,000 స్థాయి వరకు ధరలున్న స్మార్ట్‌ఫోన్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయని, ప్రధానంగా షియోమీ, ఒప్పో, వన్‌ప్లస్ మోడళ్లకు డిమాండ్ కనిపించిందని అంతర్జాతీయ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) గణాంకాలు చెబుతున్నాయి. మార్కెట్‌లో 80 శాతానికి వీటి వాటా చేరిందని ఐడీసీ పేర్కొన్నది. స్మార్ట్‌ఫోన్ వినియోగంలో అప్‌గ్రేడ్ అవుదామనుకునే వారి సంఖ్య క్రమేణా పెరుగుతున్నదని, డిజైన్, ఇతరత్రా సదుపాయాలను చూస్తున్నారని ఐడీసీ ఇండియా అసోసియేట్ రిసెర్చ్ మేనేజర్ (క్లయింట్ డివైజెస్) ఉపాసన జోషి అన్నారు.
ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ఎన్నెన్నో కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. మార్కెట్‌లోకి అప్‌గ్రేడ్ వెర్షన్లు రావడంతో మరెన్నో సౌకర్యాలూ చేతికందాయి. కెమెరాలు, శక్తి వంతమైన సెన్సార్లు, అధిక మెమరీ సామర్థ్యం, ర్యామ్, చార్జింగ్, టచ్ స్క్రీన్, దాని పరిమాణం, పిక్చర్, సౌండ్ నాణ్యతలు ఇలా చాలా రకాల్లో స్మార్ట్‌ఫోన్లు అభివృద్ధి చెందాయి.
గెలాక్సీ ఫోల్డ్ పేరుతో శామ్‌సంగ్ రూ.1.65 లక్షల స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌కు పరిచయం చేసింది. మోటోరోలా సైతం మోటో రాజ్ ద్వారా మడతబెట్టే ఫోన్ తీసుకొచ్చింది. అయితే దేశీయ మార్కెట్‌లో దీని లభ్యతపై స్పష్టత లేదు. మరోవైపు ఈ ఏడాది మరింతమంది స్మార్ట్‌ఫోన్ తయారీదారులు టీవీల రంగంలోకి అడుగుపెట్టారు.
సోనీ, ఎల్‌జీ, శామ్‌సంగ్ వంటి దిగ్గజాలకు పోటీగా షియోమీ, వన్‌ప్లస్, మోటోరోలా, నోకియా స్మార్ట్ టీవీలు మార్కెట్‌లోకి వచ్చి చేరాయి. దేశీయ టెలివిజన్ మార్కెట్‌లో స్మార్ట్ టీవీల వాటా 18 శాతం నుంచి 43 శాతానికి పెరిగిందని షియోమీ ఇండియా ఆన్‌లైన్ సేల్స్ అధిపతి రఘురెడ్డి తెలిపారు.
దేశంలో స్మార్ట్‌ఫోన్ల తయారీకి ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలూ కలిసొచ్చింది. కార్పొరేట్ పన్నును 22 శాతానికి తగ్గించడం, కొత్త ఉత్పాదక కేంద్రాలకు 15 శాతం రేటు సూచించడంతో విదేశీ సంస్థలు భారత్ వైపు తరలి వచ్చాయి. దేశీయంగానే ఆపిల్ సంస్థ ఐఫోన్ ఎక్స్‌ఆర్‌ను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడి నుంచే బయటి దేశాలకు ఎగుమతి చేయాలనీ చూస్తున్నది.
రూ.2000 కోట్ల పెట్టుబడులతో సాల్కాంప్ ముందుకు వచ్చింది. ఐఫోన్ చార్జర్లకు సంబంధించి అతిపెద్ద సరఫరాదారు, ఉత్పత్తిదారుగా సాల్కాంప్ ఉన్నది. చెన్నై సమీపంలోగల ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లోని నోకియా ప్లాంట్‌ను టేకోవర్ చేస్తున్నారు. 2020 మార్చి నుంచి ఆపిల్ ఇక్కడ ఐఫోన్ల ఉత్పత్తి మొదలు కానున్నది. కనీసం 10 వేల మందికి ఉపాధి లభించవచ్చునని అంచనా. 2025 నాటికి దేశంలో 100 కోట్ల మొబైళ్ల తయారీని మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకున్నది.
also read ఉద్యమాల వేదికగా ‘సోషల్ మీడియా’... కట్టడికి సర్కార్ వ్యూహాలు
2020లోనూ స్మార్ట్‌ఫోన్లకు గిరాకీ బాగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వృద్ధి రెండంకెల స్థాయికి చేరుకోవచ్చని 12-14 శాతంగా నమోదు కావచ్చని కౌంటర్‌పాయింట్ రిసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ తరున్ పాతక్ అంచనా వేశరు. దిగుమతులూ భారీగా పెరుగవచ్చని చెబుతున్నారు.
ఈ క్రమంలోనే 2022 నాటికి దేశంలోని 70 కోట్లకుపైగా జనాభా వద్ద స్మార్ట్‌ఫోన్లు ఉంటాయని అంచనా వేశారు. రాబోయే 4-5 ఏళ్లలో 100 కోట్లకుపైగా స్మార్ట్‌ఫోన్లు అమ్ముడవుతాయన్నారు. 5జీ రాకతో స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు జెట్ స్పీడ్ అందుకోవచ్చన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.
ఇక షాపింగ్ నుంచి బ్యాంకింగ్ వరకు.. వినోదం నుంచి ప్రయాణం వరకు ఈనాడు అంతా స్మార్ట్‌ఫోన్లపైనే ఆధారపడాల్సి వస్తుందని, దీంతో స్మార్ట్‌ఫోన్ లేకుండా రోజు గడువని పరిస్థితి వచ్చేసిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సోషల్ మీడియా, సెల్ఫీలు సరేసరి అంటున్న విశ్లేషకులు.. విస్తరిస్తున్న డిజిటల్ చెల్లింపుల ఆర్థిక వ్యవస్థ కూడా స్మార్ట్‌ఫోన్ల వినియోగాన్ని అమాంతం పెంచి వేసిందని గుర్తుచేస్తున్నారు. మొత్తానికి డిజిటల్ ప్రపంచం తలుపులను తెరిచే కీగా స్మార్ట్‌ఫోన్ మారుతుండటం విశేషం.