India Pakistan War: పాకిస్తాన్ డ్రోన్ దాడులకు డీఆర్డీవో చెక్.. ఏంటి ఈ ఇండియ‌న్ డోమ్ టెక్నాల‌జీ?

Google News Follow Us

సారాంశం

India Pakistan War: డీఆర్డీవో (DRDO) అభివృద్ధి చేసిన డీ4 యాంటీ-డ్రోన్ సిస్టమ్ పాకిస్తాన్ డ్రోన్ దాడులను సమర్థంగా అడ్డుకుంటూ భారత రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇండియ‌న్ డోమ్ టెక్నాల‌జీ భార‌త న‌గ‌రాల‌ను సుర‌క్షితంగా ఉంచుతోంది. పాక్ దాడికి చెక్ పెడుతున్న డీఆర్డీవో టెక్నాల‌జీ వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 
 

India Pakistan tensions: పాకిస్తాన్ సరిహద్దుల్లో భారత దేశంపై డ్రోన్ల దాడులకు యత్నిస్తున్న నేపథ్యంలో, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అభివృద్ధి చేసిన దేశీయ యాంటీ డ్రోన్ వ్యవస్థ “డ్రోన్ డిటెక్ట్, డీటర్ అండ్ డిస్ట్రాయ్” (D4) సిస్టమ్ సమర్థంగా పని చేస్తోంది. ఇజ్రాయెల్ వాడే "ఐరన్ డోమ్" విధానానికి సమానంగా ఉన్న ఈ గ్రౌండ్-బేస్డ్ టెక్నాలజీ, పాకిస్తాన్ ప్రయోగిస్తున్న డ్రోన్లను గాల్లోనే ధ్వంసం చేస్తోంది.

ఈ వ్యవస్థను రూపొందించేందుకు DRDO నాలుగు ప్రత్యేక విభాగాలను కలిపి పనిచేసింది. ఇందులో బెంగళూరులోని ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (LRDE), హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ (CHESS), డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ (DLRL), డెహ్రాడూన్‌లోని ఇన్‌స్ట్రుమెంట్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (IRDE) లు భాగస్వాములుగా ఉన్నాయి.

D4 సిస్టమ్‌లో డ్రోన్లను గుర్తించడానికి రాడార్, రేడియో ఫ్రీక్వెన్సీ డిటెక్షన్, ఎలెక్ట్రో-ఆప్టికల్ గుర్తింపు పద్ధతులు ఉపయోగిస్తారు. ఈ సమాచారం ఆధారంగా డ్రోన్లను “సాఫ్ట్ కిల్” లేదా “హార్డ్ కిల్” ద్వారా నిర్వీర్యం చేస్తారు. సాఫ్ట్ కిల్‌ పద్ధతిలో RF జ్యామింగ్, GNSS జ్యామింగ్ GPS స్పూఫింగ్ ద్వారా డ్రోన్ నావిగేషన్‌ను దెబ్బ‌తీస్తారు. ఇది ఫలించకపోతే, అధిక శక్తితో పనిచేసే లేజర్ ఆయుధాల ద్వారా డ్రోన్లను కూల్చివేస్తారు. 

ఈ సిస్టమ్‌ను వాహనంపై అమర్చే వెర్షన్, స్థిరంగా ఉండే వెర్షన్‌గా రెండు రూపాల్లో వినియోగిస్తున్నారు. క‌దిలే వాహ‌నాల వేరియంట్లు యుద్ధ సన్నివేశాల్లో ఉపయోగిస్తుండగా, స్థిర వ్యవస్థలను ముఖ్యమైన రక్షణ కట్టడాల వద్ద ఏర్పాటుచేశారు. స్థిర D4 వ్యవస్థ 360 డిగ్రీ కవచాన్ని కలిగి ఉండి చిన్న డ్రోన్లను కూడా గాల్లోనే అంతం చేయ‌గ‌ల‌దు. 

భారతీయ కంపెనీ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ఈ వ్యవస్థను "మేక్ ఇన్ ఇండియా" కార్యక్రమం కింద ఉత్పత్తి చేస్తోంది. ఈ టెక్నాలజీ ఇప్పటికే హోం, డిఫెన్స్ మంత్రిత్వ శాఖల పరిధిలోని అనేక భద్రతా సంస్థ‌లు ప‌రిశీలించిన‌ట్టు DRDO తెలిపింది.

మార్చి 10న సెంటర్ ఫర్ జాయింట్ వార్‌ఫేర్ స్టడీస్ నిర్వహించిన కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ మాట్లాడుతూ.. “యాన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ ఆధునిక యుద్ధాలలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తున్నాయి” అని పేర్కొన్నారు. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టం కలిగించే వీటి సామర్థ్యం యుద్ధ ఆర్థిక శాస్త్రాన్నే మార్చేస్తోందని ఆయన అన్నారు.

ఇండియన్ డీ4 యాంటీ డ్రోన్ వ్యవస్థ ఇప్పటికే దేశవ్యాప్తంగా జరిగే ముఖ్యమైన జాతీయ కార్యక్రమాల్లో భద్రతా ఏర్పాట్లలో భాగంగా వినియోగించబడుతోంది. ఈ విధంగా DRDO అభివృద్ధి చేసిన డీ4 సిస్టమ్ భారత్‌కు డిజిటల్ యుగంలో మరింత సురక్షిత వాతావరణాన్ని కల్పిస్తున్నది.

Read more Articles on