Covid-19 impact: కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభం అంతాఇంతా కాదు. దాదాపు అన్ని రంగాలను కోవిడ్-19 కోలుకోని దెబ్బకొట్టింది. కొత్త వేరియంట్లు పుట్టుకురావడంతో భయాందోళనలు మరింతగా పెరిగాయి. అయితే, కరోనా కారణంగా స్కూళ్లు మూసివేయడంతో దేశంలో 32 కోట్ల మంది చిన్నారులు ప్రభావితమయ్యారని Ministry of Education పేర్కొంది.
Covid-19 impact: గతేడాది చైనాలో వెగులుచూసిన కరోనా వైరస్.. ఇప్పటికీ తన విజృంభణను కొనసాగిస్తున్నది. వైరస్ కు వ్యతిరేకంగా టీకాలు అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ.. మ్యుటేషన్లకు లోనవుతూ.. కోవిడ్-19 మరింత ప్రమాదకరంగా మారుతున్నది. మానవ మనుగడకు సవాలు విసురుతున్నది. ఇక వైరస్ కారణంగా అన్ని వయస్సుల వారు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో పాఠశాలలు మూసివేయడంతో దేశంలోని 32 కోట్ల మంది చిన్నారులపై ప్రభావం పడిందని పార్లమెంట్‌లో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీరిలో ప్రీ-ప్రైమరీ నుంచి తృతీయ స్థాయి వరకు చదువున్న చిన్నారులు అధికంగా ఉన్నారు. మహిళా సాధికారతకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ విషయాలు తెలియజేసింది.
Also Read: Bank privatisation: కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా బ్యాంక్ యూనియన్ల సంచలన నిర్ణయం
Ministry of Education బేటీ బచావో.. బేటీ పడావోపై నివేదికను పార్లమెంట్‌కు అందజేసింది. దాంట్లో స్కూళ్ల మూసివేత అంశాలను సైతం ప్రస్తావించింది. ఆ వివరాల ప్రకారం.. స్కూళ్ల మూసివేత కారణంగా దేశవ్యాప్తంగా 32 కోట్ల మంది చిన్నారులపై ప్రభావం పడిందని పేర్కొంది. వీరిలో అత్యధికం బాలికలే ఉన్నారని తెలిపింది. 15.8 కోట్ల మంది అంటే.. సుమారు 49.37 శాతం మంది అమ్మాయిలు ఉన్నారని విద్యాశాఖ వెల్లడించింది. కరోనా వైరస్ విజృంభణ సమయంలో ఎక్కువగా కౌమార దశలో ఉన్న బాలికలపై తీవ్ర ప్రభావం పడిందని తెలిపింది. మహమ్మారి ముగిసిన తర్వాత బాలికలు ఎక్కువ స్థాయిలో చదువులకు దూరం అయ్యే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేశారు. బడులు మూత పడటంతో ఆన్ లైన్ విద్యను అందిస్తున్నారు. ఈ విషయంలోనూ బాలికల పట్ల అసమానతలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. దీని ప్రధాన కారణం ఒకే ఒక్క ఫోన్ లేదా అన్లైన్ విద్యకు అనుకూలంగా ఉన్న గ్యాడ్జెట్లు ఉండటం అని పేర్కొంది. ఈ పరిస్థితులు బాలికలను ఆన్‌లైన్ విద్యకు దూరం చేస్తున్నదని విద్యాశాఖ తన నివేదికలో పేర్కొంది.
Also Read: Coronavirus: తగ్గిన కరోనా కొత్త కేసులు.. పెరిగిన మరణాలు
అలాగే, స్కూల్ డ్రాపౌట్స్ సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నదని విద్యాశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. దాదాపు మూడు రెట్లు బడి మానేస్తున్న వారి సంఖ్య పెరిగిందని తెలిపింది. 2020-2021లో పది లక్షల మంది చిన్నారులు స్కూల్‌కు రాకుండా ఉండగా, ఈ ఏడాది ఆ సంఖ్య 27.85 లక్షలకు చేరినట్లు విద్యాశాఖ వెల్లడించింది. అలాంటి పిల్లలను ట్రాక్ చేస్తున్నామని తెలిపింది. వీరిని పాఠశాలల్లోకి చేర్చడానికి బ్రిడ్జ్ కోర్సును ప్రవేశపెట్టారు. Gross Enrolment Ratio (GER) సైతం తగ్గుముఖం పట్టింది. దేశంలోని మొత్తం 36 రాష్ట్రాలు ఉండగా, అందులో 18 రాష్ట్రాల్లో జీఈఆర్ గణనీయంగా తగ్గింది. ఇదిలావుండగా, మహిళా సాధికారత కోసం ప్రభుత్వం అనేక పథకాలు తీసుకువస్తున్న మెరుగైన పనితీరును కనబర్చడం లేదనే విమర్శలున్నాయి. బాలికల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బేటీ బచావో.. బేటీ పడావో పథకం నిధుల్లో దాదాపు 80శాతం ప్రచారం, ప్రకటనలనే ఖర్చు చేయడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: UP assembly elections 2022: యూపీ ఎన్నికల్లో 350కిపైగా సీట్లు గెలుస్తాం: యూపీ సీఎం యోగి