గోపాల్ తను పెరిగిన మట్టిని,తను తిరిగిన దారిని,తను బతికిన ప్రతిక్షణాన్ని గౌరవించుకొనే దిశగా ప్రతీది కవిత్వంగా మలుచుకొనే ప్రయత్నం లో సమాజపు పోకడలను నిశితంగా పరిశీలించి వాటిని కవితలుగా అల్లడం చూస్తాము.
గోపాల్ కవిత్వం ఓ కొత్త పరిమళం . అది వెంటాడుతుంది, కన్నీళ్ళను రాల్చుతుంది, గుండె బరువును దించుతుంది ,మనసుని కలవరపెడుతోంది, కవిత్వం నిండా జీవితం పారుతుంది,జ్ఞాపకాలు పూస్తాయి,ఆలోచనలు చిగురిస్తాయి.
గోపాల్ కవిత్వాన్ని అక్షరం అక్షరం గాలి పీలుస్తూ నాలోకి ,నా జీవితం లోకి ఒంపుకొని జీవితాన్ని చూసుకున్నాను. ఒక్క జీవితాన్నే చూసుకున్ననా? కాదు ఎన్నో జీవితాలను కళ్ళ ముందే ఆవిష్కరించుకున్నాను.మనుషులను ఎలా అల్లుకోవాలో నేర్చుకున్నాను .తగుళ్ళగోపాల్ అనే పేరు నాకు అసిఫా గురించి రాసిన కవితతో పరిచయమయ్యింది. ఆ కవిత గోపాల్ ఎట్లుండడో చూడాలని అన్వేషించేలా చేసింది .సున్నితంగా మనసుని అల్లుకొని ,ఆప్యాయంగా గుండెల్లోకి చేరిపోయి , వేగంగా బంధువుగా మారిపోయే స్వభావం తగుళ్ళగోపాల్ ది.
గోపాల్ తను పెరిగిన మట్టిని,తను తిరిగిన దారిని,తను బతికిన ప్రతిక్షణాన్ని గౌరవించుకొనే దిశగా ప్రతీది కవిత్వంగా మలుచుకొనే ప్రయత్నం లో సమాజపు పోకడలను నిశితంగా పరిశీలించి వాటిని కవితలుగా అల్లడం చూస్తాము.
Also Read: మట్టి మనసులో వెలుగు నక్షత్రాలు వేణు కథలు
తల్లి బిడ్డను ఎలా చూసుకుంటుందో,గురువు శిష్యులను ఎలా చూసుకుంటాడో దగ్గరనుండి చూశాడేమో మనుషుల్ని కూడా అంత బాగా అంత దగ్గరగా లాక్కొని చూసుకుంటాడు.
అలాంటి గోపాల్ కవిత్వం మీద నాలుగు పావురమైన మాటలు రాసుకోవడానికి అక్షరాలను దేవులాడుకుంటున్నాను .కవిత్వం లో జీవితం లేకపోతే అది గట్టి కవిత్వం అవుతుందా అనిపిస్తుంది . మరీ ఆ జీవితమున్న గోపాల్ కవిత్వాన్ని చదువుతున్నంత సేపు ఆతృత,ఆలోచన,జ్ఞాపకాలు,జీవితాలు పల్లె పరిమళాలు , కన్నీళ్ల బంధాలు వెంటాడుతూ వస్తుంటాయి.ఇప్పుడు కవిత్వంలోకి వెళ్లి పలకరిద్దాం.
"వత్తిజేసి, నూనెబోసి/బతుకును వెల్గించినందుకు/కొడుకు ఈ అమ్మదీపాన్ని గాలికిపెట్టి పోయిండు". (*అమ్మదీపం)
అమ్మగొప్పతనాన్ని వివరించేందుకు కోడి తనపిల్లల్ని ఎలా సాదుతుందో చెపుతూ ఆవు,కుక్క ఎంతటి విశ్వాసం గా వుంటాయో తెలియజేస్తూ నేడు కొడుకులు అమ్మని గాలిలో దీపంలాగా ఎలా వదిలేస్తున్నారో తల్లడిల్లుతూ చెప్తున్నాడు కవి.
"కొంగును మసిగుడ్డ చేసి/గంజిని ఒంపుతూ/అమ్మ పేదరికం లోని ప్రేమల్ని పరిచయం చేస్తుంది". ( గంజి)
గంజి కవితతో మనల్ని పొయ్యి మీద కుతకుత ఉడుకుతున్న గిన్నె దగ్గరికి పట్టుకపోతాడు గంజిని అమృతం చేస్తాడు.పేదోడి కడుపును నింపే ఆ గంజి గొప్పతనాన్ని కవిత్వం చేసి
దాని కమ్మదనంలో తడుపుతాడు.
"మంచికి సెల్యూట్ చేసే ఈ అరచేతిని/చెడుకి చెంపవాయించిన ఆ అరచేతిని/ అప్పుడప్పుడూ కళ్లకద్దుకొని గర్వపడాలి". (అరచేయి)
అరచేయిని కవిత్వం చెయ్యడం నిజంగా ఓ కొత్త అనుభూతి.అరచేయిని దాని గొప్పతనాన్ని చూసుకొని అప్పుడప్పుడూ గర్వపడాలి అంటాడు కవి.
చేతుల మీద అంతటి భావాన్ని సరళమైన వాక్యాలతో నిర్మించడం చాలా బాగా ఆకర్షిస్తుంది కవిత.
Also Read: సమాజానికి వెలుగు రేఖలు ఈ *సిరి రేఖలు*
"అందరిలో ఉంటూనే/
ఒంటరితనాన్ని మోస్తున్న
ఇప్పటి నొప్పికంటే ఈ తుమ్మముల్లు నొప్పి ఏమంత పెద్దది గాదు". (ముల్లు పాఠం)
మనం ముల్లుని ముల్లుతోనే తియ్యడం అనే పదాన్ని సాధారణంగా వింటూనే ఉంటాం . అలాంటి ముల్లు చెప్పిన బతుకుపాఠం ఈ కవిత. ముల్లు రాయిలా బతకడం నేర్పింది అంటూ మనిషి ఎట్ల బతుకాలో చెబుతుంటడు.
"నాలుగు పోగులుగజేసి/నెలకొక్కరి చొప్పున/నిన్ను నీ కొడుకులు పంచుకోక ముందే/నీ తొవ్వ నువ్వు జూసుకొని/కట్టుబట్టలతో వెళ్లిపోవడమే మంచిదైంది. (లేని లోటు)
లేనిచోటు కవితలో "నాయనమ్మ"చనిపోవడమే మంచిదని కవి ఎందుకంటున్నాడని అనిపించినా తరువాత కవితో ఏకీభవిస్తాం. ముసలివారిని పట్టించుకునే నాథుడే లేని కాలం కదా!,కొడుకులున్నా ఒంటరిగా బతుకుతున్న రోజులు కదా.ముసలివాళ్ళ వ్యథలన్ని ఈ కవితలో చూస్తాం.
"వచ్చిపోయే వారికి కూరలు కట్టించే పనే అయినా/నల్గురు మనుషులు గుమ్మిగూడే దగ్గర/ జీతం కుదిరినందుకు నా పేదరికానికి దండం పెట్టుకొనెటోడిని". (కన్నీటి దారపుకండే)
కవికి ఎంత గొప్ప మనసుండాలే చూడండి కూరలు గట్టే పనిని కూడా నచ్చిన పనిగా మార్చుకొని బతికిండు అంటే ఎంత సద్దుకొని మెలిగే గుణం ఉందొ వేరే చెప్పడం అనవసరం, నలుగురిలో బతకాలన్న ఆరాటం,నలుగురిని బతికించడానికి ఏ పని అయితేనేం మనసుకి నచ్చాలి గాని అని మనం గోపాల్ ను చూసి నేర్చుకోవాలి.
Also Read: ఏడవ రుతువు-వైష్ణవిశ్రీ కవిత్వం
"మేక కాలును నీ మోకాల మీద బెట్టుకొని/ ఇరిగిన తుమ్మ ముల్లుని నొప్పి తెల్వకుండా తీసిన నీవు/కన్న బిడ్డల్ని ఎట్లా జూసుకున్నవో వేరే చెప్పాలా తాతా!". (దండ కడియం)
ఈ కవిత మేకలు కాసే గొల్లపెద్దయ్య తాతని యాది చేస్తది. తాత గొర్రెపిల్లలనే అంత ప్రేమగా చూసుకుంటే వాళ్ళ బిడ్డల్ని ఇంకెంత బాగా చూసుకుంటాడో అర్థం చేసుకోవచ్చు అంటూ తాత దండ కడియాన్ని వారసత్వంగా తీసుకొని అంతటి ప్రేమని మన మీద చూపిస్తున్నాడు గోపాల్.
"ఎప్పుడో రాఖీ పండుగప్పుడు నువ్వు కట్టిన ఈ దారప్పోగు /ఇంకా నీ మెత్తని చేయిలాగే తగిలి నన్ను పల్కరిస్తుంటే/పదకొండు గొట్టే ఈ రాత్రి నిన్ను తల్సుకుంటే దుఃఖమాగుతలేదురా..". ( దుఃఖ మాగుతలేదు)
ట్యూషన్ లో ఓ చెల్లి
విషాద వార్త విని గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఏడిపిస్తున్నాడు కవి.
చిక్కులెక్కలు చిటికెలోఎట్లా తియ్యాలో నేర్పిన గాని , నీ బతుకు చిక్కులను ఎట్లా తియ్యాలో నేర్పకపోతిని అని బాధపడుతున్నాడు చెల్లెని నోరారా పిలుస్తున్నాడు.
"మా ఇంట్లో పేదరికాన్నంత
కొంచెం కొంచెంగా నరుక్కుంటూ వచ్చింది/
బాల్యంలో నాలుగు అక్షరాలు తిన్నానంటే/
మా నాయనకిది నాయనలాతోడు నడవడం వల్లనే".(నాన్న గొడ్డలి)
కట్టెలు గొట్టి బతుకుని ఎళ్లదీసే నాన్నకి ఆ గొడ్డలి నాన్నలా,తోడుగా నడిచొచ్చింది అని.
గొడ్డలి ఇంట్లో పేదరికాన్ని కొంచెం కొంచెంగా నరుక్కుంటూ రావడం వల్లనే బతుకుతున్నాను అని చివరికి నాన్న ని గొడ్డలిలో చూసుకున్నాను అని సహాయం చేసిన గొడ్డలికి నాన్నంతటి ప్రాధాన్యత ఇచ్చి రుణం తీర్చుకుంటాడు కవితలో.
"జాగ్రత్త ఇది ఎన్నికల సుడిగాలి/వాగ్దానాల దుమ్ముగాలి/ఇక్కడిక్కడే తిరిగిపోతది వందనోట్లని చల్లి/అడగడానికి నోరు లేకుండా చేస్తుంది".( ఎక్కడిగాలో ఇది..)
ఈ కవిత ద్వారా నేటి ఎన్నికల ముసుగులో జరిగే దౌర్జన్యాలను లోటుపాటులను చెపుతూఅవసరమొచ్చినప్పుడూ అడగడానికి నోరులేకుండా చేస్తుంది అని ఒక ఆవేదను
వ్యక్తపరుస్తున్నాడు కవి దానికి మనందరిని ఈ ఎన్నికల గాలి నుండి తప్పించుకొని ప్రశ్నించాలి అని చెపుతున్నాడు.దీనిలో ప్రతీ వాక్యంలో మానవీయస్పర్శ తలుగుతుంది
" ఇంకెప్పుడైనా
రైతు ఊపిరి చెట్ల కొమ్మలకు
వేలాడుతే/ తోలు చెప్పుల సప్పుడే దేశంమంతా జాతీయగితమై మారుమోగుతుంది".
(నెత్తుటిపాదాలు)
అంటూ కవితలో రైతు చావులకి కారణమౌతున్నఅధికారుల నిర్లక్షాన్ని ప్రశ్నిస్తూ రైతు బతుకులకి అండగా నిలబడతాడు.మరో రైతు ఆత్మహత్య జరుగుతే తొలుచెప్పులతో కొడతాం అని అధికారులకు ఓ వణుకు పుట్టిస్తాడు.
గోపాల్ తన కవిత్వం లో అనేక రకాల భావాలను వ్యక్తపరిచాడు.తనదైన కొత్త గొంతుతో ఏ విషయాన్నైనా మనసులోకి ఒంపుకొని కవిత్వికరించగలడు అలాంటి కొత్త గొంతు మన ముందుకు దండకండియాని చేసుకొని అనేక జీవితాలను చుట్టుకొని వస్తున్నాడు.
దీనిలో దాదాపుగా 165 పేజీలతో గుండెని తడిపేసే...దుఃఖపు గంప,చెమట నది,మనిషి చెట్టు, గల్లగురిగి, ఎర్రమన్ను తట్ట,అడవిపొద్దూకినట్లు,మాటల పావురాలు,చిమ్మ చీకటి ,ఎండ పద్యం,అమ్మలేని నేను, మొదలైన 55 కవితలున్నాయి.
ఈ కవి రాసిన కవిత్వాలు మరెన్నో కాలాలకి,కలాలకి ఆదర్శంగా నిలుస్తాయి ,నిలవాలి అని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా అభినందనలు. గోపాల్ మరెన్నో కవిత్వాలతో ఈ దోపిడి,అరాచకాల,నిర్లక్ష్య సమాజాన్ని నిద్రలేపాలని కోరుకుంటున్నాను.
- పేర్ల రాము