శివపుత్రుడు, వాడు వీడు, నేను దేవుడ్ని ఇలా ఎన్నో చిత్రాలను తెరకెక్కించి దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును పొందాడు బాల. ఆయన సినిమాల్లో సహజత్వం నిండిపోయుంటుంది.
నటీనటులు: జ్యోతిక, జివి ప్రకాష్ కుమార్, ఇవానా తదితరులు
సంగీతం: ఇళయరాజా
సినిమాటోగ్రఫీ: తేని ఈశ్వర్
ఎడిటింగ్: సతీష్ సూర్య
కథ-దర్శకత్వం-నిర్మాణం: బాల
శివపుత్రుడు, వాడు వీడు, నేను దేవుడ్ని ఇలా ఎన్నో చిత్రాలను తెరకెక్కించి దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును పొందాడు బాల. ఆయన సినిమాల్లో సహజత్వం నిండిపోయుంటుంది. ఈ ఏడాదిలో ఆయన రూపొందించిన 'నాచ్చియార్' అనే తమిళ సినిమాను 'ఝాన్సీ' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!
undefined
కథ:
ఝాన్సీ(జ్యోతిక) అసిస్టెంట్ కమీషనర్ గా విధులు నిర్వర్తిస్తుంటారు. ఓ మైనర్ అమ్మాయి రేప్ కేసుని డీల్ చేయమని ఝాన్సీకి అప్పగిస్తారు. ఈ కేసులో ఝాన్సీ.. గాలిరాజు(జివి ప్రకాష్ కుమార్)ని అరెస్ట్ చేస్తారు. అలానే బాధితురాలు రాశి(ఇవానా)ని కూడా తన అదుపులో ఉంచుకుంటుంది. రాశి గర్భవతి పైగా నెలలు నిండడంతో ఝాన్సీ తనతో పాటే రాశిని ఇంటికి తీసుకెళ్లి ఆమె బాగోగులు చూసుకుంటుంటుంది. అయితే రాశి తను ఇష్టపూర్వకంగానే గాలిరాజుతో ఉన్నానని ఎలాంటి బలవంతం లేదని చెబుతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలుసుకున్న ఝాన్సీ మైనర్లు కావడంతో ఆఫ్ ది రికార్డ్ డీల్ చేయాలనుకుంటుంది.
ఇంతలో రాశికి బిడ్డ పుడుతుంది. అయితే ఆ బిడ్డ డిఎన్ఏ.. గాలిరాజు డిఎన్ఏ తో మ్యాచ్ అవ్వదు. ఆ బిడ్డ గాలిరాజుకి పుట్టినవాడు కాకపోతే మరి రాశి ఎందుకు అలా చెబుతుంది..? రాశిని మోసం చేసిందెవరనే విషయాలను తెలుసుకోవాలని నిర్ణయించుకుంటుంది ఝాన్సీ. మరి ఈ కేసులో ఆమెకు అసలైన నిందితుడు దొరుకుతాడా..? ఆ బిడ్డ తనకు పుట్టినవాడు కాదని తెలిస్తే గాలిరాజు తట్టుకోగలడా..? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!
విశ్లేషణ:
బీద కుటుంబానికి చెందిన ఒక అమ్మాయి ఒక కుర్రాడిని ప్రేమిస్తుంది. ఇద్దరూ తెలియక తప్పు చేస్తారు. ఆ కారణంగా ఆమె తల్లయ్యిందనుకుంటే దర్శకుడు మరో ట్విస్ట్ రాసుకొని పోలీస్ ఇన్వెస్టిగేషన్ కోణంలో ఈ సినిమాను నడిపించారు. ఇప్పటివరకు దర్శకుడు బాల డైరెక్ట్ చేసిన సినిమాలు ఒక రకంగా ఉంటే ఈ సినిమాలో కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించినట్లుగా అనిపిస్తుంది. ఇద్దరు మైనర్ పిల్లలు ఒక పోలీస్ ఆఫీసర్ చుట్టూ సాగే కథే ఈ సినిమా. ఈ కథతో దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. మైనర్ ఆడపిల్లలను పనిలో పెట్టుకోవడం ఎలాంటి పాపం తెలియని వారి జీవితాలతో ఆదుకోవడం వంటి విషయాలను దర్శకుడు తెరపై కళ్లకు కట్టినట్లుగా చూపించాడు. ఒక ఆడపిల్లకు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొంటూ ఆమెకు ఆ గతి పట్టించినవాడిని అతి క్రూరంగా శిక్షించే సన్నివేశాలు సినిమా స్థాయిని పెంచాయి.
సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం మైనర్ బాలికకు బిడ్డ పుట్టడం, ఆమెను పోలీస్ ఆఫీసర్ రక్షణలో ఉంచడం వంటి సాదాసీదా సన్నివేశాలతో సాగుతుంది. ఎప్పుడైతే ఆ బిడ్డ డిఎన్ఏ గాలిరాజుతో మ్యాచ్ కాలేదని తెలుస్తుందో కథ మలుపు తీసుకుంటుంది. ప్రీక్లైమాక్స్ వరకు కూడా అసలు బాలికను రేప్ చేసిందెవరనే విషయాన్ని రివీల్ చేయకుండా సస్పెన్స్ కొనసాగించాడు. దీంతో సినిమా చూసే ఆడియన్స్ కు ఎవరై ఉంటారా..? అనే ఆలోచనలు మొదలవుతాయి. అయితే ఈ ఎపిసోడ్ ని మరింత ఆసక్తికరంగా చిత్రీకరించి ఉంటే బాగుండేది. పతాక సన్నివేశాల్లో నిందుతుడు ఎవరని తెలిసినా శిక్షించలేని స్టేజ్ లో పోలీసులు ఉండడంతో పోలీస్ ఆఫీసర్ ఝాన్సీ అతడిని అతి క్రూరంగా శిక్షించడం, రాశికి పుట్టిన బిడ్డ తన కారణంగా కలగలేదని తెలిసినా.. గాలిరాజు తను ప్రేమించి అమ్మాయిని, బిడ్డను ఆదరించే సన్నివేశాలు ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతాయి.
'నా లవర్ కి ఎవరో అన్యాయం చేసినా.. తను నన్ను తల్చుకుంటూ బిడ్డను కంది. కాబట్టి ఆ బిడ్డ నాకు పుట్టినవాడే' అంటూ గాలిరాజు పాత్రలో జివి ప్రకాష్ చెప్పే డైలాగ్స్ కన్నీళ్లు తెప్పిస్తుంది. చిన్న పాయింట్ ని తీసుకొని సినిమా మొత్తం నడిపించడం మామూలు విషయం కాదు. అది కూడా ఆడియన్స్ కి ఎక్కడా బోర్ కలగకుండా.. క్రైమ్ కథలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. ఇప్పటివరకు జ్యోతికను చూడని ఓ సరికొత్త పాత్రలో ఈ సినిమాలో కనిపించింది. నిజాయితీగా దేనికి లొంగకుండా ధైర్యంగా ఉండే ఓ మహిళా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో జ్యోతిక ఒదిగిపోయింది. తన కనుసన్నల్లోనే కథను మొత్తం నడిపించింది. ఆమె కాస్ట్యూమ్స్, మేకప్ చాలా సింపుల్ గా ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్ పాత్రకు పూర్తి న్యాయం చేసింది. క్లైమాక్స్ లో జ్యోతిక కళ్లలో నీళ్లు తిరుగుతుంటే చూసే ఆడియన్స్ కూడా ఎమోషనల్ అయిపోతారు.
జివి ప్రకాష్ తన పాత్రలో మరెవరూ చేయలేరనేంతగా మెప్పించాడు. పసితనంతో కనిపిస్తూ 'నా లాంటి వాళ్లకు లవరే సర్ అమ్మ, తనకి నేను అన్యాయం చేయను. బాగా చూసుకుంటాను' అంటూ జివి ప్రకాష్ పలికిన డైలాగ్స్ బాగున్నాయి. ఇవానా తెరపై క్యూట్ గా కనిపించింది. తన అభినయంతో ఆకట్టుకుంది. ఇళయరాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, చిన్న బిట్ సాంగ్ మెప్పిస్తాయి. సినిమాటోగ్రఫీ కథకు తగ్గట్లుగా ఉంది. ఎడిటింగ్ వర్క్ బాగుంది. కథ ప్రధానంగా సాగే సినిమా కావడంతో టెక్నికల్ అంశాల కంటే కంటెంట్ ఆకట్టుకుంటుంది. రెగ్యులర్ బాల సినిమాల్లో కనిపించే రానెస్ ఈ సినిమాలో కూడా కనిపిస్తుంది. టైటిల్స్ వేయడమే డంప్ యార్డ్ ను చూపిస్తారు. రెండు గంటల పాటు ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాకు వెళ్లే ఆడియన్స్ కు ఈ సినిమా చూసి గుండె బరువెక్కడం ఖాయం. రియలిస్టిక్ క్రైమ్ కథలు, బాల సినిమాలు ఇష్టపడే ఆడియన్స్ ను ఈ సినిమా మెప్పిస్తుంది. తెలుగు ఆడియన్స్ కు ఈ సినిమా ఎంతవరకు కనెక్ట్ అవుతుందనేది చెప్పలేని పరిస్థితి. ఈ వీకెండ్ వరకు కూడా థియేటర్ లో సినిమాను ఉంచుతారో లేదో సందేహమే!
రేటింగ్: 2.5/5
ఈ రివ్యూ కూడా చదవండి..
రివ్యూ: గీత గోవిందం