ముకేశ్ అంబానీకి షాక్ : ఒక్క రోజే వేల కోట్ల నష్టం...కారణం ?

By Sandra Ashok Kumar  |  First Published Mar 10, 2020, 10:17 AM IST

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి గట్టి షాక్ తగిలింది. చమురు ధరలు పడిపోవడంతో దశాబ్ద కాలంలో కేవలం ఒక్క రోజులో రిలయన్స్ షేర్ 10 శాతానికి పైగా పతనం కావడం ఇదే మొదటి సారి. సోమవారం ట్రేడింగ్‌లో ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ సంస్థ రూ.45 వేల కోట్లు నష్టపోయింది. దీంతో రిలయన్స్ సంస్థకు, అరామ్కోతో ఒప్పందంపై నీలినీడలు కమ్ముకున్నాయి. 
 


ముంబై: భారత స్టాక్‌ మార్కెట్లలో సోమవారం చోటు చేసుకున్న రికార్డ్‌ పతనం రిలయన్స్‌ ఇండిస్టీస్‌ షేర్లను అమాంతం పడేశాయి. ముఖేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండిస్టీస్‌ షేరు ఏకంగా గత దశాబ్ద కాలంలో ఎప్పుడూ లేని విధంగా అతిపెద్ద ఇంట్రాడే నష్టాన్ని చవి చూసింది. 

బీఎస్ఈలో ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ విలువ రూ.7.05 లక్షల కోట్లకు పడిపోయింది. దాంతో టీసీఎస్‌ రూ.7.40 లక్షల కోట్ల క్యాపిటలైజేషన్‌తో మార్కెట్లో అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. ఈ మార్కెట్‌ క్రాష్‌లో ముకేశ్‌ అంబానీ వ్యక్తిగత ఆస్తి కూడా రూ.45వేల కోట్ల మేర తరిగిపోయింది. 

Latest Videos

undefined

మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల భారీ పతనం నేపథ్యంలో సౌదీ ఆరామ్కోతో రిలయన్స్‌ కుదుర్చుకున్న ఒప్పందంపై నీలిమేఘాలు కమ్ముకున్నాయనే విశ్లేషణలు ఆ కంపెనీ షేర్‌ను ఒత్తిడికి గురి చేశాయి. ఫలితంగా రియలన్స్‌ ఇండిస్టీస్‌ షేరు ఏకంగా 13.50శాతం నష్టాన్ని చవి చూసింది. 

గత 12 ఏండ్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ఇదే అతిపెద్ద పతనమని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. శుక్రవారం నాటి ముగింపుతో పోలిస్తే 2శాతం నష్టంతో రూ.1245.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ పతనంలో భాగంగా ఆ సూచీ ఒక దశలో 13.65శాతం నష్టంతో రూ.1096.65 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. 

also read కరోనా ఎఫెక్ట్: అరేబియా సముద్రంలో యుద్ధం... భారీగా తగ్గనున్న చమురు ధరలు

తుదకు 12.35 శాతం లేదా రూ.156.90 నష్టంతో రూ.1,113.15కు రిలయన్స్ పడిపోయింది. దీంతో ఈ షేరు తన జీవితకాల గరిష్టస్థాయి రూ.1617.80 నుంచి ఏకంగా 32.21శాతం పతనాన్ని చవి చూసినట్లైంది. 

పలు పరిణామాల మధ్య బీఎస్‌ఇ ఇండెక్స్ సెన్సెక్స్‌ 1941 పాయింట్లు కోల్పోయి 35,635 పాయింట్లకు, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 538 పాయింట్ల పతనంతో 10,451కి దిగజారింది.  ముడి చమురు ధరల భారీ పతనంతో సౌదీ అరేబియా రిలయన్స్‌తో గతంలో కుదుర్చుకున్న ఒప్పందం సజావుగా జరుగుతుందా? లేదా? అనే అనుమానాలు రేకత్తడంతో మదుపర్లు ఈ షేర్ల అమ్మకాలకు తెగబడ్డారు.

రిలయన్స్‌ ఆయిల్‌, పెట్రోకెమికల్‌ విభాగంలో 20 శాతం వాటాను 7500 కోట్ల డాలర్లకు విక్రయించేందుకు బోర్డు ఆమోదించినట్టు ఆగస్ట్‌లో జరిగిన సంస్థ వార్షిక జనరల్ బాడీ సమావేశంలో ఆ కంపెనీ అధినేత ముఖేష్‌ అంబానీ వెల్లడించిన సంగతి తెలిసిందే. వాటా విక్రయం ద్వారా వచ్చిన నిధులతో కంపెనీ రుణాలను తీర్చేందుకు వినియోగించుకుంటానన్నారు. 

కాగా ముడి చమురు ధర అనూహ్య పతనంతో రిలయన్స్‌ వాటాను సౌదీ అరామ్‌కో కొనుగోలు చేస్తుందా? అనే ప్రశ్నలు ఇన్వెస్టర్లను వెంటాడాయని నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు ప్రపంచంలో అత్యధిక చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో రష్యా, సౌదీ అరేబియా మధ్య అవగాహన దెబ్బతిని ధరల యుద్ధానికి దారి తీసింది. 

దీంతో ఒపెక్‌ దేశాలు రష్యాను దెబ్బతీయడానికి చమురు ఉత్పత్తి పెంచాలని ఒపెక్ దేశాలు నిర్ణయించాయి. ఫలితంగా చమురుధరలు 30% కుంగాయి. చమురు ఉత్పత్తి రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న రిలయన్స్‌, ఓఎన్‌జీసీ వంటి దేశీయ సంస్థల షేర్లు 15శాతం వరకు పడిపోయాయి. ఈ రెండు సంస్థలు సూచీలను భారీగా ప్రభావితం చేసేంత పెద్దవి కావడంతో మార్కెట్లు కుప్పకూలాయని నిపుణులు పేర్కొన్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 30 శాతం పైగా పడిపోవడం దేశీయ ఇంధన ఉత్పత్తి దిగ్గజం ఓఎన్‌జీసీపై భారీ ప్రభావం చూపింది. దేశీయ స్టాక్‌ మార్కెట్లో ఓఎన్‌జీసీ షేరు ధర 16 శాతం పైగా తగ్గి రూ.74.65కి పడిపోయింది. తత్ఫలితంగా కంపెనీ మార్కెట్‌ విలువ రూ.93,911 కోట్లకు పడిపోయింది. దాదాపు 16 ఏళ్ల (2004 ఆగస్టు) తర్వాత కంపెనీ మార్కెట్‌ విలువ రూ.లక్ష కోట్ల దిగువకు చేరడం మళ్లీ ఇదే మొదటిసారి. 

ఇదిలా ఉంటే ప్రైవేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంకులో మెజారిటీ వాటా కొనుగోలు చేయడానికి ఎస్‌బీఐ బోర్డు ఆమోదం తెలపడంతో యస్‌ బ్యాంక్‌ షేర్లకు భారీ డిమాండ్‌ లభించింది. మధ్యాహ్నం 11.20 సమయంలో యస్‌ బ్యాంక్‌ షేరు 41 శాతం దూసుకెళ్లి రూ.23 చేరువలో నమోదైంది. తుదకు 31.17 శాతం లాభంతో రూ.21.25 వద్ద ముగిసింది. మరోవైపు యస్‌ బ్యాంకును సొంతం చేసుకోనున్న ఎస్‌బీఐ 6.19 శాతం నష్టపోయి రూ.253.70 వద్ద ముగిసింది. 

ఇటీవల యస్‌ బ్యాంకు బోర్డును రద్దు చేసిన రిజర్వ్‌ బ్యాంక్‌ కొత్త పాలనాధికారిగా ఎస్‌బీఐ మాజీ అధికారి ప్రశాంత్‌ కుమార్‌ను నియమించిన విషయం విదితమే. కుమార్‌ అధ్యక్షతన సమావేశంకానున్న బోర్డు ఈ నెల 14న అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాలు విడుదల చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

also read రాణా కపూర్ కూతురుకి షాక్... విమానం ఎక్కుతున్న ఆమెను...

భారీ అమ్మకాల ఒత్తిడితో ఎన్‌ఎస్‌ఇలో 660 షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. వీటిలో 20 మైక్రాన్స్‌, 63 మూన్స్‌ టెక్నాలజీస్‌, ఎ2జెడ్‌ ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్‌, అబాన్‌ ఆఫ్‌షోర్‌, ఆదిత్యా మిర్లా క్యాపిటల్‌, అదాని పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌, ఏడీఎఫ్‌ ఫుడ్స్‌, ఆధునిక్‌ ఇండిస్టీస్‌, అడోర్‌ వెల్డింగ్‌, అద్వాని హోటల్స్ అండ్‌ రిసార్ట్స్‌ ఇండియా, అగర్వాల్‌ ఇండిస్టీయల్‌ కార్పొరేషన్‌, అగ్రిటెక్‌ ఇండియా, అలోక్‌ ఇండిస్టీస్‌, అంబికా కాటన్‌ మిల్స్‌ ఉన్నాయి. 

మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీలో 16 షేర్లు 52 వారాల గరిష్టానికి పెరిగాయి. వాటిలో యాక్సిస్‌ మ్చూచువల్‌ ఫండ్‌-యాక్సిస్‌ గోల్డ్‌ ఎటిఎఫ్‌, బాప్నా ఫార్మాసూటికల్స్‌, ఆదిత్యా బిర్లా సన్‌ లైఫ్‌ గోల్డ్‌ ఇటిఎఫ్‌, దివీస్‌ ల్యాబొరేటరీస్‌, ఎస్‌బిఐ ఇటిఎఫ్‌ గోల్డ్‌లు ఉన్నాయి.

ఇదిలా ఉంటే భారత ఆర్థిక వ్యవస్థ, మార్కెట్లపై విశ్వాసం సన్నగిల్లడంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ)లు వరుసగా 15 సెషన్ల నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తరలించుకుపోతున్నారు. నగదు విభాగంలో వారాంతంలో ఎఫ్‌ఐఐలు రూ.3,595 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. 

గురువారం ఎఫ్‌పీఐలు రూ. 2,477 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌ రూ. 2,511 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. గత 15 ట్రేడింగ్‌ సెషన్ల నుంచి విదేశీ సంస్థాగత మదుపరులు వరుసగా అమ్మకాలకు పాల్పడటంతో దాదాపు రూ.21,937కోట్లను వీరు ఈక్విటీ మార్కెట్ల నుంచి ఉపసంహరించుకొన్నారు. 

గత నెల 24వ తేదీ నుంచి ఎఫ్‌ఐఐ కౌంటర్లలో అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ ఫలితం రూపాయి మీద కూడా పడింది. డాలర్లకు డిమాండ్‌ పెరగడంతో రూపాయి కూడా విలువ క్షీణిస్తోంది. బిఎస్‌ఇలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు దాదాపు 5 శాతం చొప్పున పతనమయ్యాయి. ట్రేడైన షేర్లలో 2199 నష్టపోగా.. 357 మాత్రమే లాభపడ్డాయి.
 

click me!