న్యూఢిల్లీ: చమురు ఉత్పత్తి దారుల మధ్య పోటీ నెలకొంది. దీనివల్ల భారత్ లబ్దిదారుగా నిలిచే అవకాశాలు లభిస్తున్నాయి. వాణిజ్య లోటు తగ్గించుకునేందుకు మార్గం సుగమం అవుతున్నది. ఒకవేళ చమురు ధర పెరిగితే భారత్ నష్టపోతుంది. తగ్గితే లాభ పడుతుంది.

అసలే మందగమనంలో ఉన్నప్పుడు దేశంలో వాణిజ్య లోటు పెరగకుండా జాగ్రత్త పడాలి. అయితే అంతర్జాతీయ పరిణామాలు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు అనుకోని వరంగా మారాయి. ఒపెక్ సభ్య దేశాలు, రష్యా మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఫలితంగా బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌పై భారీగా తగ్గింది. 

అంతర్జాతీయ మార్కెట్లో సోమవారం చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. ఏకంగా 25 శాతానికి పైగా దిగజారాయి. ఇంధన ఉత్పత్తి విషయంలో రష్యా, సౌదీ అరేబియా మధ్య విభేదాలు తలెత్తడమే దీనికి కారణం. 

also read బ్లాక్ మండే: స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇదే అతి పెద్ద పతనం

బ్రెంట్‌ క్రూడ్‌ ధర 26శాతం కుంగి బ్యారెల్‌ 33.66 డాలర్లకు చేరగా.. డబ్ల్యూటీఐ 27 శాతం నష్టపోయి బ్యారెల్‌ 30.35 డాలర్లకు చేరింది. 1991 గల్ఫ్‌ యుద్ధం తర్వాత ముడి చమురు ధరలు ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. 

కరోనావైరస్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా చమురు డిమాండ్‌ భారీగా తగ్గిపోయింది. కర్మాగారాలు మూత పడ్డాయి. ఫలితంగా ఉత్పత్తి తగ్గి చమురు రంగంపైనా ప్రభావం పడింది. ఫలితంగా కంపెనీలకు, వాహనాలకు ఇంధన అవసరాలు తగ్గాయి. దీంతో చమురు ఉత్పత్తులకు డిమాండ్ తగ్గింది. 

ఈ నేపథ్యంలో ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్ దేశాలు), రష్యా మధ్య ఇంధన ఉత్పత్తి తగ్గించాలన్న అంశంపై జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. చమురు ధర బ్యారెల్ పై 43 డాలర్ల కంటే తగ్గితే రష్యా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది.

దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని సౌదీఅరేబియా గతవారం చమురు ధరలు భారీగా తగ్గించింది. ఎక్కువ మార్కెట్‌ను ఒడిసిపట్టాలన్న వ్యూహంతోనే సౌదీ ఈ చర్యలకు ఉపక్రమించింది. 

రానున్న రోజుల్లో సౌదీ చమురు శుద్ధి సంస్థ ఆరామ్‌కో ఉత్పత్తిని మరింత పెంచేసి తీవ్రమైన ధరల పోరుకు తెర తీయాలని తలపోస్తున్నది. రష్యాతో పోలిస్తే సౌదీ అరేబియాకు చమురు రవాణా మార్గాలు ఎక్కువ.

అధికంగా చమురు ఉత్పత్తి చేసి తక్కువ ధరకు యూరప్, అమెరికాలోని రిఫైనరీలకు అమ్మి డిమాండ్‌ను ఆకర్షించాలని సౌదీ ప్లాన్. అవసరమైతే 12 మిలియన్ల బ్యారెళ్లకు ఉత్పత్తి పెంచే ప్లాన్ లో సౌదీ ఉంది. ప్రస్తుతం అది 9.7 మిలియన్ బ్యారెళ్లుగా చేరుకున్నది. 

also read మరింత తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు...

భారత్, చైనా భారీగా చమురు నిల్వలను వ్యూహాత్మకంగా పెంచుకునేలా సౌదీ అరేబియా వ్యూహం ఆశలు కల్పిస్తోంది. భారీగా చమురు నిల్వలను పెంచుకోవడానికి చైనా భారీగా నిధులు ఖర్చు చేస్తోంది. 2018-19లో భారత్ 207.3 మిలియన్ టన్నుల ముడి చమురు దిగుమతి చేసుకున్నది. అప్పుడు ధర కూడా ఎక్కువే. 

కానీ ఇప్పుడు బ్యారెల్ చమురు ధర భారీగా పడిపోవడంతో భారతదేశానికి కలిసి వచ్చింది. ప్రస్తుత పరిణామాలను భారత్ సమర్థవంతంగా వినియోగించుకోవాలంటే వ్యూహాత్మక పెట్రోలియం నిల్వ సామర్థ్యాన్ని సొంతం చేసుకోవాలి. కానీ ఉడిపి, మంగళూరు, విశాఖల్లో మాత్రమే 3.7 కోట్ల పీపాల నిల్వ సామర్థ్యం ఉంది. 

చిన్న దేశం జపాన్ ఇందుకు భిన్నంగా 32 కోట్ల పీపాల చమురు నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. చైనా రెండు విభాగాల్లో 68 కోట్ల పీపాలకు పైగా చమురు నిల్వల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నది. ఈ పరిస్థితుల్లో చమురు ధర తగ్గడం భారతదేశానికి మేలు చేస్తుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.