Asianet News TeluguAsianet News Telugu

తిరుమల బ్రహ్మోత్సవాలు... స్వ‌ర్ణ‌ర‌థంపై శ్రీవారి ఊరేగింపు

కలియుగ ప్రత్యక్షధైవం శ్రీవారికి బ్రహ్మోత్సవాలు తిరుమలలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులోభాగంగా ఆ వైకుంఠవాసుడు ఇవాళ స్వర్ణరథంపై దర్శనమివ్వనున్నాడు.  

tirumala tirupati brahmotsavam 2019
Author
Tirumala, First Published Oct 5, 2019, 1:46 PM IST

కలియుగ ప్రత్యక్ష  దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన శ‌నివారం స్వామివారి స్వ‌ర్ణ‌ర‌థంపై ఊరేగనున్నారు. సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు మాడవీధుల్లో ఈ స్వ‌ర్ణ‌ర‌థోత్స‌వం కన్నులపండుగగా జరుగనుంది. 

దేవదేవుడై శ్రీవారు బంగారు రథాన్ని అధిరోహించి అశేష భక్తజనులకు దర్శన భాగ్యాన్ని కల్పించనున్నాడు. ఈ స్వర్ణరథయాత్ర ఆ వైకుంఠవాసునికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా పురాణాలు చెబుతున్నాయి. అలా దేవదేవుడు ఇష్టపడే రథోత్సవాన్ని కళ్లారా చూసి తరించి తమ జన్మను చరితార్థం చేసుకోవాలని భక్తులు భావిస్తారు. దీంతో ఇప్పటికే చాలామంది భక్తులు తిరుమలకు చేరుకున్నారు.

స్వర్ణమయమైన రథంలో శ్రీభూదేవేరులతో మలయప్ప ఇవాళ భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ఇతర వాహనాల ముందు సాగే బ్రహ్మశూన్యరథం, గజ, అశ్వ, వృషభాదుల సంరంభం ఈ స్వర్ణ రథోత్సవంలో కూడా ఉంటుంది. శ్రీవారి గరుడసేవకు ఎంతటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉంటుందో స్వర్ణరధోత్సవానికి కూడా అంతే ప్రాధాన్యత బ్రహ్మోత్సవాలలో కనిపిస్తుంది. 

రథాన్ని లాగాలని వందలాది మంది ప్రయత్నం చేస్తుంటే తాకాలని వేలాది మంది సాహసిస్తుంటారు. కన్నుల పండుగగా సాగే ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు లక్షల మంది మాఢ వీధులలో వేచి చూస్తుంటారు. వారందరికి ఆ దేవవదేవుడు దర్శనభాగ్యాన్ని కల్పించి చల్లని చూపును వారిపై ప్రసరిస్తారు.  

Follow Us:
Download App:
  • android
  • ios