Asianet News TeluguAsianet News Telugu

Sania Mirza: ఇదే నా చివరి సీజన్ : షాకింగ్ న్యూస్ చెప్పిన సానియా మీర్జా..

Sania Mirza Retirement: 19 ఏండ్ల వయసులోనే  టెన్నిస్ రాకెట్ పట్టిన సానియా మీర్జా.. ఒకరకంగా భారత  మహిళల టెన్నిస్ కు  ముఖచిత్రంగా ఉంది. 2003లో  టెన్నిస్ రాకెట్ పట్టిన ఈ హైదరాబాదీ..

This Will Be My Last Season : Indian Tennis Sania Mirza Announces Her Retirement
Author
Hyderabad, First Published Jan 19, 2022, 3:19 PM IST

ప్రముఖ  టెన్నిస్ క్రీడాకారిణి, హైదరాబాదీ సానియా  మీర్జా తన కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ సీజనే తనకు చివరిదని, దీని తర్వాత తాను రిటైర్ కాబోతున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఓపెన్ లో ఆడుతున్న  సానియా.. బుధవారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ తొలి రౌండ్ లో  ఓటమి పాలైంది. ఉక్రేనియన్ భాగస్వామి నదియా కిచెనోక్ తో కలిసి ఆడుతున్న ఆమె.. 4-6, 6-7 (5) తో స్లోవేనియా జంట జిదాన్ సేక్-కాజా జువాన్ చేతిలో ఓడింది. అనంతరం పాత్రికేయుల సమావేశంలో ఆమె తన రిటైర్మెంట్ ప్రణాళికలను వెల్లడించింది. 

ఓటమి అనంతరం సానియా మీర్జా స్పందిస్తూ.. ‘ఇదే  నా చివరి సీజన్ అని నేను నిర్ణయించుకున్నాను.  త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటాను.  ఈ సీజన్ ను కొనసాగించగలనా అనేవిషయం నాకు కచ్చితంగా తెలియదు..’ అని తెలిపింది. 

 

19 ఏండ్ల వయసులోనే  టెన్నిస్ రాకెట్ పట్టిన సానియా మీర్జా.. ఒకరకంగా భారత  మహిళల టెన్నిస్ కు  ముఖచిత్రంగా ఉంది. 2003లో  టెన్నిస్ రాకెట్ పట్టిన ఈ హైదరాబాదీ.. కెరీర్ ఆరంభంలో సింగిల్స్ లో మెరిసినా తర్వాత డబుల్స్ కే పరిమితమైంది.  సింగిల్స్ లో 2007 మిడ్ సీజన్ లో ఆమె ప్రపంచ మహిళల ర్యాకింగ్స్ లో 27 వ స్థానానికి చేరింది.  సింగిల్స్ కెరీర్ లో ఆమెకు అదే ఉత్తమ  ర్యాంకు. 

2003 నుంచి 2013 దాకా  సింగిల్స్ లో అదరగొట్టిన సానియా.. ఆ ఏడాది  సింగిల్స్ నుంచి తప్పుకుంది. సింగిల్స్  విభాగంలో ఆమె వందలాది మ్యాచులలో విజయం  సాధించినప్పటికీ ప్రపంచ  స్థాయి క్రీడాకారిణులు స్వెట్లెనా కుజెంట్సోవా, వెర జ్వెనరెవ,  బార్టోలి లతో పాటు మాజీ ప్రపంచ ఛాంపియన్ మార్టినా హింగిస్, డైనారా సఫైనా, విక్టోరియా అజరెంకా లను ఓడించింది. భారత్ తరఫున టెన్నిస్ సింగిల్స్ ర్యాంకింగ్స్ లో  టాప్-100 లోకి ప్రవేశించిన తొలి, ఏకైక మహిళా క్రీడాకారిణి కావడం విశేషం. కానీ 2013లో చేతికి గాయం కారణంగా ఆమె సింగిల్స్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.  దాంతో ఆమె డబుల్స్ కు షిఫ్ట్ అయింది. 

 డబుల్స్ లో ఆమె ఆకట్టుకునే ప్రదర్శనలు చేసింది.  తన కెరీర్ లో డబుల్స్ లో ఏకంగా ఆరు గ్రాండ్ స్లామ్ లను కూడా గెలుచుకుంది.  మార్టినా హింగిస్ తో కలిసి డబుల్స్ లో  పదుల సంఖ్యలో మ్యాచులను గెలిచింది.  

2010లో ఆమె  పాకిస్థాన్ వెటరన్ ఆల్ రౌండర్ షోయభ్ మాలిక్ ను వివాహం చేసుకుని వార్తల్లో నిలిచింది.  పాకిస్థానీ అయిన మాలిక్ ను పెండ్లి చేసుకోవడంపై  ఆ సమయంలో ఆమెపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఈ జంటకు ఒక  అబ్బాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios