Asianet News TeluguAsianet News Telugu

French Open: పోలాండ్ భామదే ఫ్రెంచ్ ఓపెన్.. ఫైనల్ లో కోకో గాఫ్ కు నిరాశ

French Open 2022 Winner Iga Swiatek: ఫ్రెంచ్ ఓపెన్ -2022  మహిళల సింగిల్స్  టైటిల్ ను పోలాండ్ భామ, వరల్డ్ నెంబర్ వన్ ఇగా స్వియాటెక్ ఎగురేసుకుపోయింది. అమెరికా యువ సంచలనం కోకో గాఫ్ కు ఫైనల్ లో నిరాశే ఎదురైంది. 

Poland Tennis Star Iga Swiatek wins Second Grand Salm Title, Defeats Coco gauff in French Open finals 2022
Author
India, First Published Jun 5, 2022, 9:40 AM IST

పారిస్ వేదికగా జరుగుతున్న ఫ్రెంచ్  ఓపెన్ -2022 మహిళల సింగిల్స్ ఫైనల్ లో ప్రపంచ నెంబర్ వన్  స్టార్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) రెండోసారి టైటిల్ ఎగురేసుకుపోయింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో ఆమె.. 6-1, 6-3 తేడాతో అమెరికా యువ సంచలనం కోకో గాఫ్ ను ఓడించింది. 68 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్ ప్రారంభం నుంచి చివరివరకు స్వియాటెక్ ఆధిక్యాన్ని తనవద్దే ఉంచుకుని ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా విజయాన్ని సొంతం చేసుకుంది. స్వియాటెక్ కెరీర్ లో ఇది రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్. 2020 లో ఆమె తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ నెగ్గింది. 

తొలి సెట్ నుంచే స్వియాటెక్.. గాఫ్ పై ఆధిక్యం చెలాయించింది. ఆట ప్రారంభమైన 15 నిమిషాల్లోనే 4-0 తో సంపూర్ణ ఆధిక్యం లో నిలిచిన స్వియాటెక్.. అదే జోరును చివరివరకు కొనసాగించింది.  రెండో సెట్ లో కోకో గాఫ్ కాస్త ప్రతిఘటించినా కీలక సమయాల్లో చేతులెత్తేసింది. 

కెరీర్ లో తొలి గ్రాండ్ స్లామ్ ఫైనల్ ఆడుతున్న కోకో గాఫ్.. ఒత్తిడిని తట్టుకోలేకపోయింది. ప్రత్యర్థి తడబడటాన్ని గమనించిన స్వియాటెక్..  అదే అదునుగా చెలరేగిపోయింది. కచ్చితమైన సర్వీస్ లకు తోడు శక్తివంతమైన గ్రౌండ్ స్ట్రోక్స్ తో గాఫ్ పై ఆధిపత్యం చెలాయించింది.  స్వియాటెక్ కు ఇది వరుసగా 35వ విజయం. కాగా  ఈ టోర్నీలో ఓటమన్నదే లేకుండా.. ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ఫైనల్ కు చేరిన  గాఫ్.. తుది పోరులో మాత్రం చేతులెత్తేసింది. 

 

ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గినందుకు గాను స్వియాటెక్ కు  22 లక్షల యూరోలు (రూ. 18 కోట్ల 30 లక్షలు), రన్నపర్ కోకో గాఫ్ కు 11 లక్షల యూరోలు (రూ. 9 కోట్ల 15 లక్షలు) ప్రైజ్ మనీగా లభించాయి.  

 

పురుషుల ఫైనల్ లో నాదల్-రూడ్ : 

మహిళల సింగిల్స్ ముగియడంతో ఇక అందరి కళ్లూ  పురుషుల సింగిల్స్ ఫైనల్స్ మీద పడ్డాయి.  మట్టి కోర్టు మహారాజు నాదల్.. కెరీర్ లో 21 గ్రాండ్ స్లామ్స్ గెలిస్తే అందులో 13 టైటిల్స్ ఫ్రెంచ్ ఓపెన్ వే కావడం గమనార్హం. నేటి తుది పోరులో అతడు నార్వేకు చెందిన  క్యాస్పర్ రూడ్ తో తలపడనున్నాడు.  రూడ్ కు ఇదే తొలి గ్రాండ్ స్లామ్ ఫైనల్. తొలి ప్రయత్నంలోనే కొండను ఢీకొడుతున్న రూడ్.. నాదల్ ను ఎలా ఎదుర్కుంటాడో  చూడాలని ప్రపంచ టెన్నిస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios